నాస్కామ్‌తో ఐఈఎస్‌ఏ ఒప్పందం
న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఎలక్ట్రానిక్స్, ఐటీ వాటాను పెంచే దిశగా ఐటీ కంపెనీల సమాఖ్య నాస్కామ్, ఎల క్ట్రానిక్స్ తయారీ కంపెనీల సమాఖ్య ఐఈఎస్‌ఏ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం 2025 నాటికల్లా జీడీపీలో వీటి వాటా 25 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి.
ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ చైర్మన్ వినయ్ షెనాయ్ తెలిపారు. 2013లో 76 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ (ఈఎస్‌డీఎం) మార్కెట్.. 2015లో 94 బిలియన్ డాలర్లకు, 2020 నాటికి 400 బిలియన్ డాలర్ల స్థాయికి ఎదుగుతుందని అంచనాలు ఉన్నట్లు ఆయన వివరించారు. భారత ఎలక్ట్రానిక్ మార్కెట్లో 90 శాతం దిగుమతులే ఉంటున్నాయని వివరించారు.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం కింద దేశీ ఎలక్ట్రానిక్స్, ఐటీకి మరింత ప్రాధాన్యం లభించగలదని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మరోవైపు, రూ. 65,000 కోట్ల మేర ఎలక్ట్రానిక్స్ తయారీ ప్రతిపాదనలు కేంద్రానికి అందినట్లు టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. 21 ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లకు సూత్రప్రాయ అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.