IESA
-
బ్యాటరీ రంగంలో భారీ పెట్టుబడులు: ఐఈఎస్ఏ
న్యూఢిల్లీ: బ్యాటరీ, మొబిలిటీ స్టార్టప్ వ్యవస్థలో.. భారతదేశానికి 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు ఏడాదిలో రావొచ్చని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) అంచనా వేసింది.పెట్టుబడులు నూతన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధిని నడిపించడంతోపాటు ఈ స్టార్టప్‌లు తయారు చేసే ఉత్పత్తుల పురోగతికి దోహదం చేస్తుందని ఐఈఎస్ఏ తెలిపింది. అంతేగాక బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సేఫ్టీ మేనేజ్మెంట్, విడిభాగాల తయారీ కంపెనీలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని వివరించింది.స్టార్టప్, ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ ద్వా రా అంకుర కంపెనీలను ప్రోత్సహించడానికి ఐఈఎస్ఏ చురుకుగా పని చేస్తోంది. ఇప్పటికే 400 స్టార్టప్‌లు, యూనిడో, ఐక్రియేట్, ఇండి యా యాక్సిలరేటర్, ఇతర ప్రముఖ సంస్థల తో చేతులు కలిపింది. స్టార్టప్‌లకు పెట్టుబడి మద్దతు, మార్గదర్శకత్వం, సాంకేతిక ధ్రువీకరణ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యానికి సాయపడుతోంది. -
1.7 కోట్ల వార్షిక యూనిట్లకు ఈవీ మార్కెట్
ముంబై: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్ 2021-2030 మధ్య ఏటా 49 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) అంచనా వేసింది. వార్షిక అమ్మకాలు 2030 నాటికి 1.7 కోట్లకు చేరుకుంటాయని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అందులో ద్విచక్ర ఈవీలు 1.5 కోట్లుగా ఉంటాయని తెలిపింది. పెరిగిపోతున్న ఇంధన ధరలు, కొత్త కొత్త సంస్థలు ప్రవేశిస్తుండడం, ఈవీ టెక్నాలజీలో అభివృద్ధి, కేంద్ర, రాష్ట్రాల నుంచి సబ్సిడీ మద్దతు, ఉద్గారాల విడుదల ప్రమాణాలు ఇవన్నీ ఈవీ విక్రయాలు పెరిగేందుకు మద్దతుగా నిలుస్తున్న అంశాలని పేర్కొంది. 2020లో కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ల నుంచి ఈవీ పరిశ్రమ చాలా వేగంగా కోలుకున్నట్టు గుర్తు చేసింది. 2021లో మొత్తం ఈవీ విక్రయాలు 4.67 లక్షల యూనిట్లలో సగం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఉండగా, ఆ తర్వాత తక్కువ వేగంతో నడిచే త్రిచక్ర వాహనాలున్నట్టు తెలిపింది. ఇతర విభాగాల్లోనూ విక్రయాలు పుంజుకున్నట్టు పేర్కొంది. 2021–2030 మధ్య ఈవీ బ్యాటరీ డిమాండ్ ఏటా 41 శాతం మేర పెరుగుతూ, 142 గిగావాట్ హవర్‌కు (జీడబ్ల్యూహెచ్) చేరుకుంటుందని వెల్లడించింది. 2021లో 6.5 జీడబ్ల్యూహెచ్‌గా ఉన్నట్టు తెలిపింది. బ్యాటరీల ధరలు తగ్గుతుండడం, ఈవీ సాంకేతికతల్లో అత్యాధునికత వల్ల ఈవీల ధరలు కంబస్టన్ ఇంజన్ వాహనాల ధరల స్థాయికి (2024-25 నాటికి) చేరుకుంటాయని అంచనా వేసింది. భారత ఈవీ మార్కెట్లో లెడ్ యాసిడ్ ఆధారిత బ్యాటరీల ఆధిపత్యం కొనసాగుతోందని, 2021లో 81 శాతం మార్కెట్ వీటిదేనని పేర్కొంది. లిథియం అయాన్ బ్యాటరీలకు డిమాండ్ క్రమంగా పెరుగుతుందంటూ, 2021లో మొదటిసారి 1గిగావాట్‌కు చేరుకున్నట్టు వివరించింది. -
నాస్కామ్తో ఐఈఎస్ఏ ఒప్పందం
న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఎలక్ట్రానిక్స్, ఐటీ వాటాను పెంచే దిశగా ఐటీ కంపెనీల సమాఖ్య నాస్కామ్, ఎల క్ట్రానిక్స్ తయారీ కంపెనీల సమాఖ్య ఐఈఎస్ఏ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం 2025 నాటికల్లా జీడీపీలో వీటి వాటా 25 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ చైర్మన్ వినయ్ షెనాయ్ తెలిపారు. 2013లో 76 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ (ఈఎస్డీఎం) మార్కెట్.. 2015లో 94 బిలియన్ డాలర్లకు, 2020 నాటికి 400 బిలియన్ డాలర్ల స్థాయికి ఎదుగుతుందని అంచనాలు ఉన్నట్లు ఆయన వివరించారు. భారత ఎలక్ట్రానిక్ మార్కెట్లో 90 శాతం దిగుమతులే ఉంటున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం కింద దేశీ ఎలక్ట్రానిక్స్, ఐటీకి మరింత ప్రాధాన్యం లభించగలదని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మరోవైపు, రూ. 65,000 కోట్ల మేర ఎలక్ట్రానిక్స్ తయారీ ప్రతిపాదనలు కేంద్రానికి అందినట్లు టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. 21 ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లకు సూత్రప్రాయ అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.