ఎస్‌టీపీఐ యూనిట్లకు ఎస్‌ఈఐఎస్ ప్రయోజనాలు: నాస్కామ్
హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) యూనిట్లకు సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ (ఎస్‌ఈఐఎస్) ప్రయోజనాలను 2016-17 బడ్జెట్‌లో వర్తింపజేయాలని నాస్కామ్ ప్రభుత్వాన్ని కోరింది. ఐటీ, ఐటీఈఎస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీలకు వచ్చే బడ్జెట్ చాలా కీలకమని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి తెలిపారు. ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ నియమాల్లో స్పష్టత లేకపోవడంతో ఇక్కడి కంపెనీలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని వ్యాఖ్యానించారు. సేఫ్ హార్బర్ మార్జిన్స్‌పై ఉన్న 20-30 శాతం అధిక వడ్డీ రేట్లను ఈ బడ్జెట్‌లో అయినా సవరించాలన్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు వాటికి వ్యాపారానికి అనువైన పరిస్థితులకు కల్పించాలని కోరారు. మ్యాట్‌తోసహా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నుంచి స్టార్టప్స్‌కు మినహాయింపు ఇవ్వాలన్నారు. ప్రారంభ దశలో ఉన్న కంపెనీలకు ప్రభుత్వం పెట్టుబడి సహాయం చేయాలని విన్నవించారు.