టీసీఎస్ లాభం 45% అప్
ముంబై: సాఫ్ట్‌వేర్ సేవలకు టాప్ ర్యాంక్‌లో ఉన్న దేశీ దిగ్గజం టీసీఎస్ మరోసారి ప్రోత్సాహకర ఫలితాలను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ1(ఏప్రిల్-జూన్)లో 45% అధికంగా రూ. 5,568 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో రూ. 3,840 కోట్లను మాత్రమే ఆర్జించింది. ఇదే కాలానికి ఆదాయం సైతం 23% ఎగసి రూ. 22,111 కోట్లను తాకింది. గతంలో రూ. 17,987 కోట్లు నమోదైంది. దేశీ అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం వెల్లడించిన కన్సాలిడేటెడ్ ఫలితాలివి. పబ్లిక్ ఇష్యూ చేపట్టి 10 వసంతాలు పూర్తయిన సందర్భంగా వాటాదారులకు షేరుకి రూ. 40 ప్రత్యేక డివిడెండ్‌ను ప్రతిపాదించింది.
పటిష్ట నిర్వహణ కారణంగా కరెన్సీ కదలికలు, తరుగుదల, వేతన పెంపు వంటి ప్రతికూల అంశాలను సమర్థవంతంగా ఎదుర్కోగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో రాజేష్ గోపీనాథన్ పేర్కొన్నారు.
ఆశలు తక్కువే...
మధ్యప్రాచ్యం, ఆఫ్రికా మార్కెట్ల నుంచి సవాళ్లు ఎదురయ్యాయని, బీమా రంగం మినహా ఇతర విభాగాలలో ప్రోత్సాహకర పనితీరును చూపగలిగామని చంద్రశేఖరన్ వివరించారు. అయితే బీమా రంగ విభాగంపై అధిక అంచనాలు లేకపోవడంతో ఆందోళనచెందాల్సినదేమీ లేదని వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం ఐటీ ఆధారిత ప్రకటనలు చేసినప్పటికీ, దేశీ మార్కెట్‌పై అంతగా ఆశలు పెట్టుకోలేదని, అయితే అవకాశాలను అందిపుచ్చుకుంటామని పేర్కొన్నారు.
కాగా, తరుగుదల లెక్కింపు విధానాల్లో చోటుచేసుకున్న మార్పులవల్ల రూ. 490 కోట్లమేర లాభాలు పెరిగినట్లు రాజేష్ తెలిపారు. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చూస్తే లాభాలపై ఇదే స్థాయిలో ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. ఫలితాలపై అంచనాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు 0.8% క్షీణించి రూ. 2,381 వద్ద ముగిసింది. క్యూ1 ఫలితాలను కంపెనీ మార్కెట్లు ముగిశాక సాయంత్రం విడుదల చేసింది.
ఇతర కీలక అంశాలివీ...
క్యూ1లో స్థూలంగా 15,817 మందికి ఉద్యోగాలివ్వగా, నికరంగా 4,967 మంది మిగిలారు. దీంతో జూన్ చివరికి మొత్తం సిబ్బంది సంఖ్య 3,05,431కు చేరింది. గత 12 నెలల్లోలేని విధంగా ఉద్యోగవలస రేటు 12%గా నమోదైంది.
మొత్తం 25,000 మంది క్యాంపస్ విద్యార్థులను ఎంపిక చేసుకోగా, 3,000 మందితో ఇప్పటికే శిక్షణా తరగతులను మొదలుపెట్టినట్లు కంపెనీ మానవ వనరుల గ్లోబల్ హెడ్ అజయ్ ముఖర్జీ చెప్పారు. మిగిలినవారిని కూడా ఈ ఏడాదిలో తీసుకోనున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది కొత్తగా 55,000 మందికి ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్లు అజయ్ తెలిపారు.
నిర్వహణ లాభం 22.5%గా నమోదైంది. ట్రయినీలను మినహాయిస్తే ఉద్యోగుల వినియోగ రేటు అత్యధికంగా 85.3%ను తాకింది.
డాలర్లలో క్యూ1: నికర లాభం 20.5% పుంజుకుని 84.5 కోట్ల డాలర్లను తాకింది. గతంలో 70.1 కోట్ల డాలర్లు ఆర్జించింది.
ఆదాయం కూడా 16.4% పెరిగి 369 కోట్ల డాలర్లకు చేరింది. గతంలో 317 కోట్ల డాలర్ల ఆదాయం నమోదైంది.
మీడియా, ఇన్ఫర్మేషన్ సర్వీసులు, లైఫ్‌సెన్సైస్, రిటైల్, టెలికం వంటి బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌యేతర సర్వీసులలో 5% వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది.
రిటైల్, లైఫ్‌సెన్సైస్, బ్యాంకింగ్ రంగాలలో 5 కోట్ల డాలర్ల స్థాయిలో 7 భారీ ఆర్డర్లను సంపాదించింది. ప్రస్తుతం ఇలాంటి మరో 8 కాంట్రాక్ట్‌ల కోసం చర్చలు నిర్వహిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.