అమెరికాపై నాస్కామ్ కౌంటర్ అటాక్
అమెరికాపై నాస్కామ్ కౌంటర్ అటాక్
Published Mon, Apr 24 2017 8:04 PM | Last Updated on Wed, Sep 26 2018 6:44 PM
హెచ్-1బీ వీసాలను ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీలు అక్రమంగా కైవసం చేసుకుంటున్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్ తిప్పికొట్టింది. ఈ రెండు కంపెనీలకు కేవలం 8.8 శాతం అంటే 7,504 వీసాలు మాత్రమే 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆమోదమయ్యాయని నాస్కామ్ సోమవారం పేర్కొంది. టాప్ 20 హెచ్-1బీ గ్రహీతల్లో భారత కంపెనీలు కేవలం ఆరు మాత్రమే ఉన్నాయని కూడా నాస్కామ్ తెలిపింది. వీసా లాటరీ సిస్టమ్ దుర్వినియోగపరుస్తూ దేశీయ టాప్ టెక్ కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రోలు ఎక్కువగా లబ్ది పొందుతాయని అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే. మూడు టాప్ హెచ్-1బీ వీసాల గ్రహీతల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ కంపెనీలే ఉన్నాయని వైట్ హౌస్ పేర్కొంది.
అమెరికా డేటాపై నాస్కామ్ కౌంటరిచ్చింది. మొత్తం ఆమోదమయ్యే హెచ్-1బీ వీసాలలో 20శాతం కంటే తక్కువే భారత ఐటీ కంపెనీలకు దక్కుతున్నాయని తెలిపింది. అమెరికా వర్క్ ఫోర్స్లోని కంప్యూటర్ సైన్స్ దిగ్గజాల్లో సప్లై, డిమాండ్ల మధ్య విపరీతమైన కొరత ఏర్పడుతుందని కూడా నాస్కామ్ పేర్కొంది. ముఖ్యంగా క్లౌడ్, బిగ్ డేటా, మొబైల్ కంప్యూటింగ్లలో ఈ కొరత ఎక్కువగా ఉందని వివరించింది. దేశీయ ఐటీ సర్వీసు కంపెనీల్లో తాత్కాలిక వీసాపై పనిచేసే భారత ఐటీ నిపుణులు మొత్తం 158 మిలియన్ మెంబర్ల అమెరికా వర్క్ ఫోర్స్ లో కేవలం 0.009 శాతమేనని వెల్లడించింది. వీసా హోల్డర్ల కనీసం వేతనం 82వేల డార్లకు పైనే ఉందని, ఇంకా ఫిక్స్డ్ వ్యయాలు 15వేల డాలర్లు ఉంటాయని తెలిపింది.
అయితే ఈ మూడు కంపెనీల్లో హెచ్1బీ వీసా హోల్డర్లకు ఏడాదికి సగటు వేతనం 60,000 నుంచి 65,000 డాలర్ల మధ్య ఉందని అమెరికా పేర్కొంటోంది. కార్మిక శాఖ నిర్దేశించిన వేతనాలకు అనుగుణంగా కేవలం 5–6% హెచ్1బీ వీసా హోల్డర్లే వేతనాలను పొందుతున్నారని అమెరికా ఆరోపిస్తోంది. హెచ్-1బీ వీసాలపై కంపెనీలు తాత్కాలికంగా భారత ఉద్యోగులను అమెరికాలోని తమ కంపెనీల్లో పనిచేయడానికి నియమించుకుంటున్నాయి. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, హెచ్-1బీ వీసాలు దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలు అత్యధికమయ్యాయి. ఐటీ కంపెనీలకు భారీగా షాకిస్తూ ట్రంప్ హెచ్-1బీ వీసాల కఠినతరంపై బై అమెరికన్, హైర్ అమెరికన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై కూడా సంతకం చేశారు.
Advertisement