టీసీఎస్, ఇన్ఫీలపై అమెరికా గుర్రు
హెచ్1బీ వీసాలను అక్రమంగా కైవసం చేసుకుంటున్నాయంటూ ఆరోపణ
వాషింగ్టన్: హెచ్1 బీ వీసాల విషయంలో భారత ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్‌ల తీరును అమెరికా తప్పుబట్టింది. భారీగా దరఖాస్తులు పెట్టేసి లాటరీ విధానంలో ఎక్కువ వీసాలను కైవసం చేసుకుంటున్నాయంటూ విమర్శించింది. అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ హెచ్1బీ వీసాల అంశంపై గతవారం నిర్వహించిన సమావేశంలో ఓ అధికారి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అత్యధిక నైపుణ్యం కలిగిన మానవ వనరులకే హెచ్1బీ వీసాలను పరిమితం చేయాలంటూ అక్కడి ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే.
‘‘కొన్ని ఐటీ సంస్థలు దరఖాస్తులను వరదల్లా పారిస్తున్నాయి.దీనివల్ల సహజంగానే లాటరీ డ్రాలో ఎంపిక అవకాశాలు పెరుగుతాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ కంపెనీలు వాస్తవంగా పొందే సంఖ్యకన్నా భారీగా వీసాల కోసం దరఖాస్తులను పంపుతున్నాయి. అదనంగా దరఖాస్తులను పంపడం ద్వారా లాటరీ విధానంలో సింహభాగం వీసాలను సొంతం చేసుకుంటున్నాయి’’ అని ఆ అధికారి పేర్కొన్నారు. భారత ఐటీ కంపెనీలనే ఎందుకు ప్రస్తావించడమన్న ప్రశ్నకు... టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్‌లు అధిక హెచ్1బీ వీసాలను పొందుతున్న తొలి 3 కంపెనీలని చెప్పారు.
సగం వేతనానికే...
ఈ మూడు కంపెనీల్లో హెచ్1బీ వీసా హోల్డర్లకు ఏడాదికి సగటు వేతనం 60,000 నుంచి 65,000 డాలర్ల మధ్య ఉంది. అదే సగటు సిలికాన్ వ్యాలీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వేతనం 1,50,000 డాలర్లుగా ఉన్నట్టు ఆ అధికారి వివరించారు. కార్మిక శాఖ నిర్దేశించిన వేతనాలకు అనుగుణంగా కేవలం 5–6% హెచ్1బీ వీసా హోల్డర్లే వేతనాలను పొందుతున్నారని చెప్పారు.
అమెరికా ఉద్యోగుల స్థానంలో నియమించుకునేందుకు గాను తక్కువ వేతనాలకే బయటి నుంచి ఉద్యోగులను తీసుకొస్తున్నారని చెప్పారు. ఇలా తీసుకొచ్చే ఉద్యోగులు తక్కువ నైపుణ్యాలున్నవారేనని... నిజానికి నిపుణులైన కార్మికులకు ఉద్దేశించిన వీసాల కార్యక్రమానికి ఇది విరుద్ధమని పేర్కొన్నారు. ప్రస్తుత విధానంలో వీసాలను నైపుణ్యాలు, వేతనాలతో సంబంధం లేకుండా లాటరీ విధానంలో ఎంపిక చేస్తుండగా, దీన్ని మార్పు చేసినట్టు చెప్పారు. దీంతో అమెరికన్ల ఉద్యోగుల స్థానంలో వీసాల సాయంతో మరొకర్ని భర్తీ చేయడం చాలా కష్టమన్నారు.
దేశం వెలుపల నియామకాల్ని పెంచిన టీసీఎస్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టీసీఎస్.. విదేశీ మార్కెట్లలో స్థానికుల నియామకాలను పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో 11,500 మందికి పైగా ఇలా నియమించుకుంది. వీరిలో అమెరికాలోని ఇంజనీరింగ్, బిజినెస్ స్కూళ్ల పట్టభద్రులు సైతం ఉన్నారు. వీసా సంబంధిత సమస్యల నేపథ్యంలో విదేశాల్లో స్థానికుల నియామకాలను పెంచినట్టు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికరంగా 33,380 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోగా, సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.87 లక్షలకు చేరుకుంది.
‘‘వివిధ దేశాల్లో స్థానికుల నియామకాల ప్రక్రియ చక్కగా కొనసాగుతోంది. 2016–17లో భారత్‌కు వెలుపల 11,500 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాం. అమెరికాలోని టాప్ 10 బిజినెస్ స్కూళ్లు, ఇంజనీరింగ్ క్యాంపస్‌ల నుంచి సైతం తీసుకోవడం జరిగింది’’ అని టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపీనాథన్ చెప్పారు. వీసా నిబంధనలు కఠినతరం కావడం తో ఐటీ కంపెనీలు స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చేలా విధానాలను మార్చుకుంటున్నాయి.