ఈ ఏడాది ఐటీ ఉద్యోగాలు తగ్గుతాయ్
2016-17లో 2.3 లక్షల ఐటీ ఉద్యోగ నియామకాల అంచనా
♦ గతేడాదితో పోలిస్తే 20% తక్కువ
♦ పరిశ్రమ ఆదాయంలో రెండంకెల వృద్ధి
♦ నాస్కామ్ చైర్మన్ సి.పి.గుర్నాని
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరం ఐటీ రంగంలో వృద్ధి నమోదైనా ఆ మేరకు కొత్త ఉద్యోగ నియామకాలు ఉండకపోవచ్చని నాస్కామ్ పేర్కొంది. గతేడాది కంటే ఐటీ కంపెనీల ఆదాయంలో 10-11% వృద్ధి నమోదయ్యే అవకాశాలున్నాయని, కానీ ఇదే సమయంలో నియామకాల్లో 20% తగ్గొచ్చని అంచనా వేస్తున్నట్లు నాస్కామ్ చైర్మన్ సి.పి.గుర్నాని తెలిపారు. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ప్రధాన ఐటీ కంపెనీలు ఆటోమేషన్‌పై అత్యధికంగా దృష్టిసారిస్తుండటం నియామకాలు తగ్గడానికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు.
143 బిలియన్ డాలర్ల పరిమాణం గల దేశీయ ఐటీ పరిశ్రమ 2016-17లో 2.75 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్స్ కాన్‌క్లేవ్’ సదస్సుకు గుర్నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ అమెరికా ఎన్నికలు ఐటీ పరిశ్రమపై పెద్దగా ప్రభావం చూపవన్నారు. అమెరికా, భారత్‌లకు ఒకరి అవసరం ఒకరికి ఉండటంతో ఎవ రు అధికారంలోకి వచ్చినా పరిశ్రమపై పెద్దగా ప్రతి కూల ప్రభావం ఏమీ ఉండదన్నారు. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు వ్యయనియంత్రణకు ఇండియా చక్కటి వేదిక అని, ఇక్కడ గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్స్(జీఐసీ) ఏర్పాటు చేయడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవచ్చని నాస్కామ్ పేర్కొంది.