ఉద్యోగాల్లో కోతలు, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన అవకాశాలు మొదలైన ఆందోళనకర పరిస్థితి నెలకొన్నప్పటికీ జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో మాత్రం నియామకాలు ఆశావహంగా కనిపిస్తున్నాయి. ఐటీ రంగంలో అత్యధికంగా రిక్రూట్‌మెంట్ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. మ్యాన్‌పవర్‌గ్రూప్ నిర్వహించిన ఉపాధి అంచనాల సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
3,020 పైచిలుకు సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. ఇందులో 49 శాతం సంస్థలు హైరింగ్‌పై అత్యధికంగా ఆసక్తి వ్యక్తం చేయగా, 13 శాతం మాత్రం నియామకాల యోచన లేదని పేర్కొన్నాయి. దీంతో నికరంగా 36 శాతం సంస్థలు రిక్రూట్‌మెంట్ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే హైరింగ్ సెంటిమెంటు 15 శాతం క్షీణిచగా, క్రితం క్వార్టర్‌తో పోలిస్తే మాత్రం 6 పర్సంటేజీ పాయింట్లు మెరుగుపడింది. సర్వేలోని మరిన్ని వివరాలు..
► అంతర్జాతీయంగా 41 దేశాలు హైరింగ్ విషయంలో సానుకూలంగా ఉన్నాయి. కోస్టారికాలో నికర నియామకాల అంచనాలు 43 శాతంగా ఉండగా, నెదర్లాండ్స్ (39 శాతం), పెరూ (38 శాతం), తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా తర్వాత 36 శాతంతో భారత్ అయిదో ర్యాంకులో నిల్చింది.
► రంగాలవారీగా చూస్తే ఐటీ, టెక్నాలజీ, టెలికం, కమ్యూనికేషన్స్, మీడియా సంస్థల హైరింగ్ అంచనాలు 47 శాతంగా ఉన్నాయి. పర్యావరణ అనుకూల విధానాలను అమలు చేయాల్సిన విధులు నిర్వర్తించే ఉద్యోగులను తీసుకోవడంపై (గ్రీన్ జాబ్స్) కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి.
► రీజియన్లవారీగా చూస్తే పశ్చిమ రాష్ట్రాల్లో నికర హైరింగ్ అంచనాలు 42 శాతంగా ఉండగా, ఉత్తరాదిలో 39 శాతంగా, దక్షిణాదిలో 39 శాతంగా, తూర్పు రాష్ట్రాల్లో 29 శాతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment