ఇరు ప్రభుత్వాలూ ఐటీకి అనుకూలమే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత రెండేళ్లుగా రాష్ట్ర విభజన సమస్య ఐటీ రంగ వృద్ధిని దెబ్బతీసిందని, ఇప్పుడు ఆ సమస్య లేకపోవడంతో ఇరు రాష్ట్రాల్లో ఐటీ రంగం వేగంగా వృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని నాస్కామ్ వ్యక్తం చేసింది. ఇరు రాష్ట్రాలు ఐటీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఇప్పటికే సంకేతాలను ఇవ్వడం సానుకూల పరిణామమని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ వ్యక్తం చేశారు. విభజన సమస్య తీరడంతో హైదరాబాద్‌లో ఐటీ రంగానికి పూర్వవైభవం వస్తుందని, కాని ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగ వృద్ధి అనేది అక్కడి ప్రభుత్వం తీసుకునే చర్యలు, కల్పించే మౌలిక వసతులపై ఆధారపడి ఉంటుదన్నారు.
హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రాలో కొత్తగా ఒక సిటీని రూపొందించి దానికి బ్రాండ్ తీసుకురావడమే అత్యంత క్లిష్టమైన అంశమన్నారు. ఇలా బ్రాండ్ తీసుకొచ్చినా అక్కడ పట్టణ వాతావరణానికి సంబంధించిన మౌలిక వసతులు లేకపోతే పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకొచ్చినా, ఉద్యోగస్తులు రాని పరిస్థితి ఉంటుందని, ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర ప్రభుత్వం ఐటీ రంగం కోసం నగరాలను అభివృద్ధి చేయడమే కాకుండా ప్రోత్సాహకాలను ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
స్మాక్‌దే భవిష్యత్తు
ఈ ఏడాది దేశంలో ఐటీ, ఐటీ ఆధారిత సేవల వ్యాపారంలో 13- 15 శాతం వృద్ధి అంచనా వేస్తున్నట్లు నాస్కామ్ పేర్కొంది. ప్రస్తుతం రూ.7,08,000 కోట్లుగా (118 బిలియన్ డాలర్లు) ఉన్న ఐటీ పరిశ్రమ ఈ ఏడాది రూ.8,20,000 కోట్లుదాటుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం పరిశ్రమ సగటు వృద్ధి రేటుకు రెట్టింపు స్థాయిలో సోషల్ మీడియా, మొబైల్, ఎనలటిక్స్, క్లౌడ్(స్మాక్- ఎస్‌ఎంఏసీ) రంగాల్లో వృద్ధి నమోదవుతున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. నాస్కామ్ నిర్వహిస్తున్న రెండవ బిగ్ డేటా సదస్సుకు హాజరైన చంద్ర శేఖర్ మాట్లాడుతూ స్టార్ట్‌అప్ కంపెనీలకు మౌలిక వసతులు కల్పించడానికి రూ.500 కోట్లతో మూలధన నిధిని ఏ ర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో ఎనలటిక్స్ వ్యాపారం 100 కోట్ల డాలర్లుగా ఉందని, ఇది 2017-18 నాటికి 230 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు బ్లూఓషన్ నివేదికలో వెల్లడించింది.