న్యూఢిల్లీ: జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ) ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా కాకుండా వారు తమ విధులను మరింత మెరుగ్గా నిర్వహించడానికి తోడ్పడే సాధనంగా ఉపయోగపడే అవకాశం ఉందని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్తా తెలిపారు. దేశీయంగా ఉద్యోగాలపై దీని ప్రభావాలు ఎలా ఉంటాయనే అంశంపై కాలక్రమేణా స్పష్టత రాగలదని ఆమె పేర్కొన్నారు.
సాంకేతిక, సాంకేతికయేతర రంగాల్లో ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావాలు పడుతున్న నేపథ్యంలో గుప్తా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాస్కామ్ వార్షిక టెక్నాలజీ సదస్సు 2023లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, వారానికి 40 గంటల పని విధానాన్ని ఏఐ మార్చేయగలదని, ఉద్యోగులు తమకు ఆసక్తి ఉన్న ఇతర అంశాలపై దృష్టి పెట్టేందుకు తగినంత సమయం లభించేందుకు ఇది తోడ్పడగలదని యాక్సెంచర్ గ్లోబల్ సీనియర్ ఎండీ మార్క్ క్యారెల్ బిలియార్డ్ తెలిపారు.
అటు, విదేశాల్లో లిస్టయిన అంకుర సంస్థలను భారత్‌కు తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గుప్తా స్పందించారు. సాధారణంగా తమ ఇన్వెస్టర్ల ప్రయోజనాల రీత్యా, అలాగే వ్యాపారాల నిర్వహణకు సులభతరమైన పరిస్థితుల కారణంగా పలు స్టార్టప్‌లు విదేశాల్లో లిస్టింగ్ వైపు మొగ్గు చూపుతుంటాయని ఆమె తెలిపారు. వాటిని తిరిగి భారత్‌కు తెప్పించే క్రమంలో దేశీయంగా పన్నులపరమైన విధానాలు, ఎసాప్ (ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్స్ ఇవ్వడం) పాలసీలు మొదలైన వాటిని తగు రీతిలో సరిదిద్దేలా నాస్కామ్.. ప్రభుత్వంతో కలిసి పని చేస్తోందని గుప్తా వివరించారు. డీప్‌టెక్ పరిశ్రమకు ప్రతిభావంతులు, పెట్టుబడులు, తగిన మౌలిక సదుపాయాల కొరత సమస్యగా ఉంటోందన్న నివేదిక వివరాలను సదస్సు సందర్భంగా నాస్కామ్, కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఆవిష్కరించాయి.
Comments
Please login to add a commentAdd a comment