2023 ప్రారంభం నుంచి టెక్ ఉద్యోగులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఏడాది (2024) ప్రారంభంలో కూడా కొన్ని దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించగా.. టీసీఎస్ మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మీద ఏకంగా ఐదు లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారతీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రారంభ దశలో ఉన్న Gen AIలో ఐదు లక్షలమందికి ట్రైనింగ్ ఇవ్వడానికి సంకల్పించింది. రాబోయే రోజుల్లో కృత్రిమ మేధను ఉపయోగించుకోవాల్సి వస్తుందని, అప్పటికి అందులో శిక్షణ పొందిన ఉద్యోగుల అవసరం కంపెనీకి ఉంటుందని TCS ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వర్క్‌ఫోర్స్ ట్రైనింగ్ అండ్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌లు అనే రెండు కీలక రంగాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా AI భవిష్యత్తు కోసం TCS చురుకుగా సిద్ధమవుతోందని కంపెనీ AI.Cloud యూనిట్ హెడ్ శివ గణేశన్ తెలిపారు.
ఏఐ మీద శిక్షణ ఇవ్వడానికి కంపెనీ అత్యధునిక సాంకేతికతలను ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే ట్రైనింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించనుంది, ఎప్పటికి పూర్తి చేయనుందనే విషయాలను వెల్లడించలేదు. కానీ గతంలో టీసీఎస్ కంపెనీ 150,000 మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి ఏడు నెలల సమయం తీసుకుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజులో ఐదు లక్షల మందికి ఎన్ని రోజుల్లో శిక్షణ ఇస్తుందనేది అంచనా వేసుకోవచ్చు.
ఇదీ చదవండి: వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం, వెండి - నేటి కొత్త ధరలు ఇవే
ఏఐ టెక్నాలజీ ద్వారా ఉద్యోగాలు పోతాయని చాలా కంపెనీల సీఈఓలు గతంలో వెల్లడించారు, కానీ ఈ టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోవడానికి మానవ ప్రమేయం అవసరమని, తద్వారా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని కొందరు భావించారు. ప్రస్తుతం ఆ భావనే నిజమవుతోంది. పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో మరిన్ని టెక్ కంపెనీలు ఈ ఏఐపైన ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment