2025 నాటికి 10 లక్షల ఐటీ ఉద్యోగాలు
న్యూఢిల్లీ: 2025 సంవత్సారానికి దేశంలో 10 లక్షల నిపుణులైన ఐటి ఉద్యోగులను సైబర్ సెక్యూరిటీ రంగం నియమించుకునే అవకాశం ఉందని నాస్కామ్ అంచనావేస్తోంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో నిపుణులైన వారికి డిమాండ్ భారీగా పెరుగుతుందని చెపుతోంది. ఈ రంగంలో దాదాపు మూడువేల అయిదువందలకోట్లు లాభాలను ఆర్జించనున్న నేపథ్యంలో ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయని భావిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాల నిరోధానికిగాను ఇంత పెద్ద మొత్తంలో ఐటి నిపుణులు కావాల్పి వస్తుందని సైబర్ సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్ ప్రతినిధి రాజేంద్ర పవార్ తెలిపారు.
సైబర్ భద్రతా రంగంలో 3వేల అయిదువందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుందని నాస్కామ్ అంచనా వేసింది. ఈ రంగంలో పెరుగుతున్న ఆదరణ, ఆదాయం నేపథ్యంలో లక్షలాది ఐటి నిపుణులను ఆయా సంస్థలు నియమించుకుంటారని నాస్కామ్ భావిస్తోంది. అలాగే ఉనికిలోకి వస్తున్న చిన్న కంపెనీల మూలంగా ఐటి నిపుణుల ఆవశ్యకత మరింత పెరగనుందన్నారు. భవిష్యత్తు సుమారు వెయ్యి స్టార్ట్ ఆప్ లు రాబోతున్నాయన్నారు. ఆయా సంస్థలపై సైబర్ దాడి సంఘటనలు పెరుగుతున్నందువల్ల సైబర్ భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వక తప్పదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ సురక్షితపై సెక్యూరిటీ రంగ నిపుణులపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతారన్నారు.
కాగా గత ఏడాది నాస్కామ్, సైబర్ భద్రతా పరిష్కారాల లక్ష్యంగా టాస్క్ ఫో ర్స్ ను ఏర్పాటు చేసింది. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ లో ఇండియా ను గ్లోబల్ హబ్ గా రూపొందించే ప్రణాళికతో దీన్ని రూపొందించింది. నాస్కామ్ , డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఐటి సంస్థ సిమాంటెక్ సంయుక్తంగా 'నేషనల్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్' ను బుధవారం ప్రారంభించింది. దీని ద్వారా సిమాంటెక్ సంస్థ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ చేస్తున్న మహిళా అభ్యర్థులకు వెయ్యి రూపాయల స్కాలర్ షిప్ ను ప్రకటించింది.