చాలా ఐటీ కంపెనీలపై అనవసర లిటిగేషన్
ఇన్ఫీ జీఎస్‌టీ ఎగవేత నోటీసులపై నాస్కామ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌కు రూ. 32,400 కోట్ల జీఎస్‌టీ ఎగవేత నోటీసులివ్వడంపై ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ స్పందించింది. ఐటీ పరిశ్రమ నిర్వహణ విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదనడానికి తాజా పన్ను నోటీసుల ఉదంతమే నిదర్శనమని పేర్కొంది. పలు కంపెనీలు ఇలాంటి అనవసరమైన లిటిగేషన్‌లను, పన్నుల విషయంలో అనిశి్చతిని ఎదుర్కొంటున్నాయని కూడా తెలిపింది.
‘పరిశ్రమ వ్యాప్తంగా ఇలాంటి సమస్య నెలకొంది. జీఎస్‌టీ కౌన్సిల్‌లో తీసుక్ను నిర్ణయాలు, సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తుంది. చట్టాలను అమలు చేసే యంత్రాంగాలు వీటిని పాటించాలి. దీనివల్ల నోటీసులతో అనిశి్చతికి దారితీయదు, అలాగే భారత్‌లో వ్యాపార సానుకూలతపై ప్రభావం చూపకుండా ఉంటుంది’ అని నాస్కామ్ పేర్కొంది.
రివర్స్ చార్జ్ మెకానిజం (ఆర్‌సీఎం) ద్వారా జీఎస్‌టీని వర్తింపజేయడం వల్లే సమస్య ఉత్పన్నమవుతోందని అభిప్రాయపడింది. ‘భారత ఐటీ కంపెనీల ప్రధాన కార్యాలయాలు తమ విదేశీ శాఖలకు పంపే నిధులపై జీఎస్‌టీ అధికారులు పన్ను ఎగవేత నోటీసులు ఇస్తున్నారు. ఈ ఆర్‌సీఎం విషయంలో హెడ్ ఆఫీసు, విదేశీ బ్రాంచ్ మధ్య ఎలాంటి సేవల లావాదేవీలు జరగలేదు.
ఇది బ్రాంచ్ నుంచి హెడ్ ఆఫీసు సేవలను పొందడం కిందికి రాదనే విషయాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. ఇదేమీ కొత్త సమస్య కాదు. ఇప్పటికే పలు కేసుల్లో కోర్టులు ఐటీ పరిశ్రమకు అనుకూలంగా తీర్పులిచ్చాయి. ఓ పెద్ద ఐటీ కంపెనీకి ఇలాంటి కేసులోనే జారీ చేసిన జీఎస్‌టీ నోటీసుపై కర్నాటక హైకోర్టు స్టే ఇచ్చింది’ అని నాస్కామ్ వివరించింది. దీనికి సంబంధించి స్పష్టతనిచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment