న్యూఢిల్లీ : అమెరికాలో ఉద్యోగ నియామకాల్లో అమెరికన్లకే ప్రాధాన్యమివ్వాలన్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధోరణులు భారత ఐటీ సంస్థలకు సమస్యగా మారుతున్నాయి. తాజాగా ఫెడరల్ ఏజెన్సీలు.. విదేశీ ఉద్యోగులను, ముఖ్యంగా హెచ్–1బీ వీసాలపై ఉన్నవారిని తీసుకోకుండా నిరోధించేలా ట్రంప్ ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. ఇది పూర్తి అపోహలకు, తప్పుడు సమాచారంతో తీసుకున్న నిర్ణయంలాగా కనిపిస్తోందని భారత ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వ్యాఖ్యానించింది. కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్న తరుణంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా కోలుకోవడానికి ప్రతిభావంతుల లభ్యత చాలా కీలకమని పేర్కొంది. ఇలాంటి వారిపై ఆంక్షలు విధిస్తే అమెరికా ఎకానమీ, ఉద్యోగాలు, నవకల్పనలు, పరిశోధన .. అభివృద్ధి కార్యకలాపాల రికవరీ దశ మందగించే అవకాశం ఉందని నాస్కామ్ పేర్కొంది. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, లెక్కలు (స్టెమ్) నైపుణ్యాలు గల వారి కొరత తీవ్రంగా ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment