వీసాల లొల్లి: లాబీయింగ్ ఖర్చు 2.8 కోట్లు
వీసాల లొల్లి: లాబీయింగ్ ఖర్చు 2.8 కోట్లు
Published Tue, Apr 11 2017 12:31 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
హెచ్1 బీ వీసాలో తీసుకొస్తున్న కఠినతరమైన నిబంధనలతో దేశీయ ఐటీ కంపెనీలకు కంటిమీద కునుకు లేదనే చెప్పొచ్చు. వీసా నిబంధనల్లో కొత్త ప్రతిపాదనలు మొదలైనప్పటి నుంచి కంపెనీలు ఆందోళనలు వ్యక్తంచేస్తూనే ఉన్నాయి. దేశీయ ఐటీ కంపెనీల ఆందోళలనకు స్పందించిన ఇండస్ట్రీ బాడీ నాస్కామ్, విదేశాంగమంత్రిత్వ శాఖ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే అమెరికా కాంగ్రెస్ తో లాబీయింగ్ కోసం ఐటీ బాడీ నాస్కామ్ సుమారు 2.8 కోట్ల రూపాయలను వెచ్చించినట్టు తెలిసింది. 2013 నుంచి ఇదే అత్యధిక మొత్తమని ఇండస్ట్రి వర్గాలంటున్నాయి. 2003 నుంచి నాస్కామ్, అమెరికా లాబీయింగ్ సంస్థ హిల్ సేవలను వాడుకుంటూ, అమెరికా కాంగ్రెస్ తో లాబీయింగ్ చర్చలు జరుపుతూ ఉంది.
దేశీయ ఐటీ ఇంజనీర్లకు నిబంధనలు సరళీకరం చేసేందుకు నాస్కామ్ ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అమెరికాకు 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవిలోకి వచ్చిన తర్వాత హెచ్1బీ వీసాలపై ఆందోళన మరింత ఎక్కువైన సంగతి తెలిసిందే. అమెరికానే ఫస్ట్, అమెరికాను మళ్లీ గ్రేట్ గా రూపొందించడానికి ఉద్యోగాలు మళ్లీ వెనక్కి తీసుకొస్తానంటూ ట్రంప్ వాగ్ధానాలు చేశారు. ఈ వాగ్ధానాల మేరకు ఆయన మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఇప్పటికే పలు వివాదాస్పద ఆర్డర్లపై సంతకాలు చేశారు. హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ లో ప్రతిపాదిస్తున్న కొత్త సంస్కరణలు కూడా ఈ కోవకు చెందినవే. ఈ ప్రతిపాదనలకు ట్రంప్ నుంచి స్ట్రాంగ్ మద్దతు ఉందని తెలుస్తోంది. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల వల్ల అమెరికాకే లాభమని నాస్కామ్ వాదిస్తోంది.
Advertisement