
న్యూఢిల్లీ: గ్రామీణ మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం నాస్కామ్ ఫౌండేషన్, టెక్నాలజీ దిగ్గజం గూగుల్, స్వచ్ఛంద సంస్థ ఐఎస్‌ఏపీ కలిసి సంయుక్తంగా ’డిజివాణి కాల్‌సెంటర్’ ఏర్పాటు చేశాయి. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ తదితర ఆరు రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చినట్లు నాస్కామ్ ఫౌండేషన్ సీఈవో నిధి భాసిన్ తెలిపారు. ప్రాథమికంగా 20,000 మంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు దీని ద్వారా సేవలు అందించాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు.
తమకు ఉపయోగపడే వివిధ పథకాలు, వ్యాపార వృద్ధికి సహాయపడే స్కీములు లేదా ఇతరత్రా సమాచారం మొదలైన వాటన్నింటి గురించి డిజివాణి ద్వారా తెలుసుకోవచ్చని భాసిన్ వివరించారు. దీనికి అవసరమైన నిధులను గూగుల్ సమకూరుస్తోందని, ఏడాది తర్వాత డిజివాణి సేవలను విస్తరించడంపై దృష్టి పెట్టనున్నామని పేర్కొన్నారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రిబిజినెస్ ప్రొఫెషనల్స్ (ఐఎస్‌ఏపీ)కి చెందిన ఢిల్లీ, లక్నో ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్లలో 19 మంది సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment