Village women
-
గ్రామీణ మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం కాల్‌సెంటర్
న్యూఢిల్లీ: గ్రామీణ మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం నాస్కామ్ ఫౌండేషన్, టెక్నాలజీ దిగ్గజం గూగుల్, స్వచ్ఛంద సంస్థ ఐఎస్ఏపీ కలిసి సంయుక్తంగా ’డిజివాణి కాల్‌సెంటర్’ ఏర్పాటు చేశాయి. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ తదితర ఆరు రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చినట్లు నాస్కామ్ ఫౌండేషన్ సీఈవో నిధి భాసిన్ తెలిపారు. ప్రాథమికంగా 20,000 మంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు దీని ద్వారా సేవలు అందించాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. తమకు ఉపయోగపడే వివిధ పథకాలు, వ్యాపార వృద్ధికి సహాయపడే స్కీములు లేదా ఇతరత్రా సమాచారం మొదలైన వాటన్నింటి గురించి డిజివాణి ద్వారా తెలుసుకోవచ్చని భాసిన్ వివరించారు. దీనికి అవసరమైన నిధులను గూగుల్ సమకూరుస్తోందని, ఏడాది తర్వాత డిజివాణి సేవలను విస్తరించడంపై దృష్టి పెట్టనున్నామని పేర్కొన్నారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రిబిజినెస్ ప్రొఫెషనల్స్ (ఐఎస్ఏపీ)కి చెందిన ఢిల్లీ, లక్నో ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్లలో 19 మంది సిబ్బంది ఉన్నారు. -
అత్యధికంగా క్యాన్సర్ బారిన పడుతుంది వారే!
గ్రామీణ మహిళల కంటే పట్టణాల్లో ఉండే వారే అత్యధికంగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌కు గురయ్యే వారిలో కేవలం 10 శాతం మంది మాత్రమే తొలి దశలో గుర్తిస్తుండగా, 70 శాతం మంది, 2, 3 దశల్లో ఆస్పత్రులకు వస్తున్నారు. మరో 20 శాతం మంది నాలుగో దశలో చికిత్సకోసం వస్తున్నారు. వ్యాధి లక్షణాలపై సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ప్రతి 8 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు క్యాన్సర్ నిపుణులు చెబుతున్నారు. వ్యాధిపై విస్తృతమైన అవగాహన కలగించేందుకు అక్టోబర్ మాసాన్ని ప్రత్యేకంగా కేటాయించారు. వీరికి వ్యాధి సోకే అవకాశం.. ►సాధారణంగా వయస్సు 40 ఏళ్లు దాటిన వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ►లేటు వయస్సులో బిడ్డలు పుట్టిన వారికి, పిల్లలు పుట్టాక పాలు ఇవ్వని వారికి ఎక్కువగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ►కుటుంబంలో అంతకు ముందు ఎవరికైనా ఉన్నా, ఎక్కువ ఒత్తిళ్లకు గురయ్యే వారికి, పన్నెండేళ్లలోపు రజస్వల కావడం, నెలసరి ఆగడం, 55 ఏళ్ల వరకు నెలసరి ఉండటం వంటివి కారణాలుగా చెబుతున్నారు. ►ధూమపానం, ఆల్కాహాల్ సేవించే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ►ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావంతో కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. సెల్ఫ్ టెస్ట్ చేసుకోవచ్చు.. రొమ్ము క్యాన్సర్ ఎవరికి వారే గుర్తించవచ్చు. పీరియడ్ వచ్చిన వారం రోజుల తర్వాత స్నానం చేస్తున్న సమయంలో రొమ్ములో గింజంత సైజులో కణుతులు ఏమైనా వచ్చాయా, రొమ్ముపై చర్మం రంగు మారిందా, చంకల్లో గడ్డలు లాంటివి వచ్చాయా అనే విషయాలను మహిళలు చెక్ చేసుకోవాలి. రొమ్ము భాగంలో నొప్పిగా ఉన్నా, చిన్న చిన్న లక్షణాలు కనిపించినా వైద్యుడిని సంప్రదించాలి. మమ్మోగ్రామ్‌తో నిర్ధారణ.. ►రొమ్ము క్యాన్సర్‌ను మమోగ్రామ్ అనే స్కానింగ్ ద్వారా నిర్ధారిస్తారు. ఇప్పుడు 3డీ మమ్మోగ్రామ్ కూడా అందుబాటులో ఉంది. ►దీని ద్వారా వ్యాధి సూక్ష్మదశలో ఉన్నప్పుడే గుర్తించే అవకాశం ఉంది. ►రొమ్ము భాగంలో పౌడర్లా ఏదైనా చల్లినట్లు ఉన్నా కనిపెట్టేస్తుంది. ►ఏడాదికోసారి మమ్మోగ్రామ్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ముందు చూపే మందు.. రొమ్ము క్యాన్సర్‌కు ముందు చూపే మందు. తొలిదశలోనే గుర్తించి వెంటనే ఆస్పత్రికి వెళ్తే అత్యాధునిక పరికరాలతో వ్యాధిని నిర్ధారించి చికిత్స పొందవచ్చు. సెల్ఫ్ చెక్ చేసుకునే విధానాలపై మహిళలకు అవగాహన ఉండాలి. రోజు వారీ వ్యాయామం చేస్తూ, బరువు పెరగకుండా చూసుకోవడం, కొవ్వు, నూనె ఉన్న పదార్థాలు తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. – డాక్టర్ ఏవైరావు, క్యాన్సర్ వైద్య నిపుణుడు -
నాదస్వర మణులు
నాదస్వర కచేరీలో మహిళలు రాణించడం అరుదైన విషయం..అందులో కుటుంబ సభ్యులంతా రాణిస్తే విశేషం. ఆ కీర్తి ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి దక్కింది. మహిళలంతా నాదస్వర కచేరీలు నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ముదిగొండ: ముదిగొండ మండలం వల్లభి గ్రామంలోని పలువురు మహిళలు ‘నాదస్వర’ ప్రతిభావంతులుగా పేరు గడిస్తున్నారు. షేక్ మీరాబీ, హుస్సేన్‌బీ, జి రాజేశ్వరీ, అనిఫా, పి లక్ష్మి, పి నాగలక్ష్మి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ప్రోగ్రాంలు ఇస్తున్నారు. వీరంతా గ్రామానికే చెందిన షేక్ యాకూబ్‌సాహెబ్ వద్ద నాలుగేళ్లు సాధన చేశారు. తల్లిదండ్రుల కూడా ప్రోత్సహించారు. నాదస్వర నారీమణులు చదువుకున్నది కూడా తక్కువ అయినా, సాధనలో మిన్నగా ఉన్నారు. ఊపిరి బిగపట్టుకుని సప్తస్వరాలను సన్నాయిలో వినిపించడం అంత తేలికకాదు. ఇటువంటివి నేర్చుకునేందుకు మగవారు సైతం జంకుతారు. కానీ మహిళలు మాత్రం నిష్ణాతులై ప్రదర్శనలు ఇస్తున్నారు. నేర్చుకున్న స్వరాలు సరళి స్వరాలు, జంటలు, అలంకారాలు, పిల్లారి, గీతాలు, కృతులు, వర్ణాలు, మొదలగు కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, లయ, తాళం, రాగం, సృతి ప్రధానమైనవి. ప్రతి ఏటా వీరికి ఆరు నెలల పాటు సీజనల్ ప్రోగ్రామ్స్ చేస్తారు. మాఘమాసం, చైత్రం, వైశాఖమాసం, శ్రావణమాసం లలో వీరికి సీజన్. మిగతా ఆరు నెలలు జీవన భృతి కోసం కూలీ పనులకు వెళుతుంటారు. డోలు వాయిద్యకారుడు దరిపల్లి శేషయ్య కుమార్తెలు లక్ష్మి, నాగలక్ష్మి, నాగేశ్వరి ముగ్గురు నాదస్వరంలో ప్రావీణ్యం పొందారు. షేక్ మీరాబీ సిస్టర్స్ కూడా నాదస్వరంలో రాణిస్తున్నారు. ఖమ్మం, పాల్వంచ, భద్రాచలం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, తిరుపతి, సూర్యపేట, వేములవాడ రాజన్న దేవాలయాల్లో భక్తి గీతాలు ఆలపించడానికి సన్నాయి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. అవార్డులు..ప్రశంసలు.. ఖమ్మంలో జరిగిన తెలుగు మహాసభల్లో అప్పటి కలెక్టర్ సిద్దార్థ జైన్ చేతుల మీదుగా ప్రశంసపత్రాలు, షీల్డు అందుకున్నారు. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో కళాకారులకు నిర్వహించిన సిల్కాన్ ఆంధ్రా ప్రోగ్రాంలో అవార్డులు, ప్రశంస పత్రాలు పొందారు. గత ఏడాది ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లచే సన్మానం పొందారు. అమ్మానాన్నల ప్రోత్సాహం.. చిన్ననాటి నుంచి సంగీతంపై మక్కువ పెంచుకున్నాం. నాన్న శేషయ్య డోలు వాయిద్యంలో మంచి ప్రావీణ్యుడు. మేం ముగ్గురం అక్కా చెల్లె్లళ్లం. అందరం కలిసి నాన్నతో పెళ్లిళ్లు, దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలకు వెళుతుంటాం. అమ్మానాన్నల ప్రోత్సాహంతో సంగీతంలో రాణిస్తున్నాం.– లక్ష్మి, నాగలక్ష్మి సన్నాయి సిస్టర్స్ ఎంతో ఇష్టం సన్నాయి, సంగీతంలో కళాకారులుగా రాణించడం ఎంతో ఇష్టం. ఇతర జిల్లాలకు వెళ్లి పెళ్లిళ్లకు, దేవాలయాల్లో ఆరాధనోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. మాకు సంగీతం నేర్పిన గురువుకు వందనం, మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చారు. అందరి ప్రసంశలు అందుకుంటున్నాం, –షేక్ మీరాబీ, సన్నాయి కళాకారిణి -
టీడీపీ కార్యకర్తకు మహిళల దేహశుద్ది
నల్లచెరువు : నల్లచెరువు మండల పరిధిలోని ఉప్పార్లపల్లిలో మంగళవారం ప్రభుత్వ పాఠశాల ఎదురుగా టీడీపీ కార్యకర్త బాహవుద్ధీన్‌కి గ్రామ మహిళలు చెప్పులతో కొట్టి దేహశుద్ధి చేశారు. గ్రామంలోని పాఠశాలలో దాదాపు ఎనిమిదేళ్ల నుంచి మద్యాహ్న భోజన ఏజెన్సీని భూదేవి, అమీనమ్మలు నిర్వహిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినందున మధ్యాహ్న భోజన ఏజెన్సీని తమకు అప్పగించాలని 15 రోజులుగా ఏజెన్సీ నిర్వాహకులపై బాహుద్ధీన్ గొడవకు దిగుతున్నాడు. హెచ్ఎం నజీర్పై ఒత్తిడి తెచ్చాడు. భయపడిన హెచ్ఎం రెండు రోజులుగా పాఠశాలకు హాజరు కాలేదు. ఈ క్రమంలో మంగళవారం మద్యం సేవించి పాఠశాల వద్దకు వచ్చిన బాహవుద్ధీన్ ఏజెన్సీ నిర్వహకులతో గొడవకు దిగాడు. ఇపుడు తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, తాను చెప్పినట్లు వినాలని హుకుం జారీ చేశాడు. తమ పార్టీకి చెందిన షరీఫా, మంగమ్మలకు ఏజెన్సీని అప్పగించాలన్నాడు. అంతలో విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని, ఇపుడున్న ఏజెన్సీ వారు వంట బాగానే చేస్తున్నారని సర్దిచెప్పారు. అరుునా అతను వినిపించుకోకుండా విద్యార్థుల తల్లులు ఖతీజా, అమరావతి, అషాబీలపై దాడికి దిగాడు. దీంతో మహిళలు ఆగ్రహంతో అతడిపై చెప్పులతో దాడి చేసి.. దేహశుద్ధి చేశారు. ఇంత రాద్ధాంతం సృష్టించిన బాహుద్ధీన్ తనపై దాడి జరిగిందని నల్లచెరువు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం కొసమెరుపు. -
చెమట చుక్కలే చెలికత్తెలు!
ప్రపంచ జనాభాలో సగమైన మహిళ సమాజ గమనంలో అంతటా తానై నిలిచింది. ఆహార ఉత్పాదన కార్యక్షేత్రాలైన గ్రామసీమల్లోని మహిళలే ప్రపంచం ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మ తల్లులు. దారాలు కట్టిన చెమటే జలతారు మేలి ముసుగుగా నిరంతరం ఎండవానలకోర్చి హరిత క్షేత్రాల్లో బంగారు పంటల రాసులెత్తుతున్న మహిళలకు ‘సాక్షి’ వినమ్రంగా నమస్కరిస్తోంది. అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతోంది. గ్రామీణ స్త్రీకి పెద్దపీట వేస్తేనే ప్రభుత్వ విధానాలు పరిపూర్ణమవుతాయి. దేశ భవిష్యత్‌కు మూలాధారం గ్రామసీమలే అన్నారు జాతిపిత బాపూజీ. పల్లెల వ్యవసాయమే మన ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ. స్వయం సమృద్ధతే ఊపిరిగా బతికిన పల్లెలు స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్లలో నానాటికీ తీసికట్టు నాగం బొట్లన్నట్లు చతికిల పడ్డాయి. స్థూల జాతీయోత్పత్తిలో 64.8 శాతం అనుత్పాదక విభాగమైన సేవా రంగం నుంచి అందుతోంది. ఉత్పాదక రంగంలో వ్యవసాయం దాదాపు పారిశ్రామిక రంగంతో సరిసమాన వాటానందిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థకు మేలు భాగాన్ని అందిస్తున్న గ్రామీణ వ్యవసాయానికి వెన్నముక స్త్రీ. ‘సర్వోపగతుండు చక్రి..’ అన్న చందంగా ధారగా పారే చెమట చుక్కలతో పచ్చని పైరులకు ఊపిరి పోస్తోంది వీళ్లే. అంతా తానై సిరుల పంటల రాసులెత్తినా.. ఆమె సామాజిక అస్థిత్వం మాత్రం విసిరేసిన మాసిపాత సమానమయ్యింది. సాగును నమ్ముకున్న వారిలో స్త్రీలే ఎక్కువ మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళల్లో 86% మంది వ్యవసాయ పనులపై ఆధారపడి ఉండగా, పురుషులు 58 శాతమే సాగు పనుల్లో భాగస్వాములు. పాడి పరిశ్రమలో 1.5 కోట్ల మంది పురుషులు పనిచేస్తుండగా, 7.5 కోట్ల మంది స్త్రీలున్నారని గణాంకాలు చెబుతున్నాయి. పశుపోషణలోనూ పురుషుల వాటా 1.5 కోట్లు కాగా, మహిళల సంఖ్య 2 కోట్లు. కాడి-మేడి మూలన పడిన ఈ కాలంలో ట్రాక్టర్లతో దుక్కులు చేయడమే పురుషుడి పని. తరువాత వరలు కట్టడం, నారు పోయడం, నాట్లు, కలుపు పనులను నిర్వహిస్తున్నది మహిళలే. పండిన పంట నూర్చి మార్కెట్‌కు తరలించడంలోనూ ముఖ్యపాత్ర వీరిదే. వ్యవసాయానికి ఆధారం, జవం, జీవ ం విత్తనం. నాటి సంప్రదాయ వ్యవసాయంలోనైనా నేటి ఆధునిక వ్యవసాయంలోనైనా విత్తనోత్పత్తి విడదీయరాని భాగం. వచ్చే పంటకు విత్తన ఎంపిక, భద్రపర్చడం మహిళలే చేసేవారు. ఆధునిక కాలంలో పత్తి, వరి, మొక్కజొన్న వంటి సంకర జాతి విత్తనోత్పత్తిలో ఆరేడు ఏళ్ల బాలికల నుంచి అంతా మహిళలే చేస్తారు. విత్తనోత్పత్తి క్షేత్రాల్లో సంకరపరిచే పని నిర్వహించేది వీరే. ఇక ప్రధాన వ్యాపార పంటలు పత్తి, పొగాకు, మిరప సాగులో 60 శాతం శ్రమ మహిళలదే. పత్తి విత్తడం, కలుపు తీత, ఏరటం వరకూ, పొగాకు నాటింది మొదలు బేరన్లకు చేర్చి గ్రేడింగ్ చేసే వరకూ చెమట చిందించేది వీరే. మిర్చి, కూరగాయలు, పండ్ల తోటల్లోనూ ఇదే పరిస్థితి. భారత వ్యవసాయ ఉత్పత్తి క్రమాన్ని సూక్ష్మంగా గమనిస్తే అన్నింటా మహిళలదే అగ్రతాంబూలమని అర్థమౌతుంది. పండించే పంట ఏదైనా పురుషుల పాత్ర కొద్ది గంటలకు మాత్రమే పరిమితమంటే అతి శయోక్తికాదు. పురుష ప్రధానమై న దుక్కిదున్నడం, ఎరువులు వేయడం వంటివన్నీ ఒకటి రెండు దఫాల్లో ముగిసే పనులే. మహిళలు చేసే కలుపుతీత సాలు పొడవునా కొనసాగే పని. సమాన వేతనం నీటి మీద రాతే! ఇంటి పని, పంటల సాగుతో పాటు అన్నింటా తానైన మహిళకు మాత్రం సాధికారత కరువయ్యింది. ఇక సమాన పనికి సమాన వేతనం అనేది నీటి మీద రాతై కాగితాలకు పరిమితమయిపోయింది. ప్రస్తుతం చాలాచోట్ల పురుషులకు రూ. 250 నుంచి 300 కూలి గిట్టుబాటవుతుండగా అదే పని చేస్తున్న మహిళలకు మాత్రం రూ.150 నుంచి 200 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. జీవిత కాలమంతా ఉత్పత్తి రంగంలోనే గడపడం వలన విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వెనుకబడిపోయారు. దీనికి కారణం శ్రమ, ఉత్పాదకత, ఉత్పత్తి వనరైన భూమి మీద కనీస హక్కు లేకపోవడమే. మరోవైపు ఆధునిక అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై వలసలు పెరిగాయి. ఇందులోనూ ప్రథమ బాధితులు మహిళలే. పురుషులు వలసపోవడం వలన కుటుంబ, వ్యవసాయ నిర్వహణ పూర్తి భారం వారే తలకెత్తుకుంటున్నారు. మారాల్సింది ప్రభుత్వ విధానాలే.. ప్రభుత్వ విధానాల మార్పే మహిళలు ఎదు ర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం. వ్యవసాయం కేంద్ర బిందువుగా విధాన నిర్ణయాలు జరగాలి. జల వనరులను సంరక్షించి నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపర్చాలి. ఈ పని జరిగితే వ్యవసాయ రంగంలో ప్రధాన భూమిక నిర్వహిస్తున్న మహి ళలకు వెసులుబాటు లభిస్తుంది. మహిళా సాధికారత చట్టాల కు పరిమితం కాకుండా భూయాజమాన్య హక్కులను కట్టబెట్ట డంతో పాటు మహిళా సాక్షరతకు ప్రాధాన్యతనిచ్చి నిధుల కేటాయింపులు జరిపితేనే పరిస్థితులు మెరుగుపడతాయి. సహజ వ్యవసాయమే మహిళకు రక్షరేఖ తీవ్రసంక్షోభంలో మునిగిపోతున్న వ్యవసాయరంగం గ్రామీణ సమాజంపైన, ముఖ్యంగా మహిళల మీద తీవ్ర దుష్ర్పభావం చూపుతోంది. వ్యవసాయ రంగంలో అన్నీ తానై నిలుస్తున్న మహిళలకు సాంద్ర వ్యవసాయ విధానం గోడదెబ్బ, చెంప దెబ్బగా మారింది. ఈ పరిస్థితిని నివారించాలంటే ప్రకృతి వనరుల మీద ఆధారపడి కొనసాగే నూతన వ్యవసాయ విధానానికి రూపకల్పన చేయాల్సి ఉంది. సహజ లేదా సేంద్రి య వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వలన మొదట ఉపశమనం పొందేది మహిళలే. విషరసాయనాల వినియోగం తగ్గితే నేల పునరుజ్జీవం పొంది ఉత్పాదక శక్తి పెరుగుతుంది. దీనికితోడు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం ఆపివేయడం వలన ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. పౌష్టికాహారం అందడం వలన అనారోగ్య సమస్యలు సమసిపోతాయి. ఆర్థికంగా సుస్థిరతను సాధించ డం వలన విద్య, ఆర్థిక, సామాజిక రంగాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తి ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణ సారథులవుతారు. నిర్మాణాత్మక ప్రణాళికతో మహిళాభివృద్ధికి, తద్వారా వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు చేయాల్సి ఉంది. - జిట్టా బాల్‌రెడ్డి, సాగుబడి డెస్క్ (ఈ నెల 15న అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం సందర్భంగా) గ్రామీణ మహిళా దినోత్సవం ఎందుకు? సమాజాభ్యున్నతికి గ్రామీణ మహిళలు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి ఏడేళ్లుగా అక్టోబర్ 15న అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆహారోత్పత్తిలో గ్రామీణ మహిళల పాత్ర ఎంత కీలకమైనదో ఎలుగెత్తి చాటడం కోసమే ప్రపంచ ఆహార దినోత్సవానికి ముందురోజు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా మహాసభ కోరిన పన్నెండేళ్లకు ఈ కల సాకారమైంది. ఫొటో: పి.ఎల్ మోహన్‌రావు -
ఎక్త్సెజ్ స్టేషన్ ముట్టడి
మండవల్లి, న్యూస్‌లైన్ : మండలంలోని కానుకొల్లు గ్రామ మహిళలు స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌ను శనివారం ముట్టడించారు. తమ గ్రామంలో బెల్ట్‌షాపులు తొలగించాలని వారు డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులు కూడా తొలగించలేని ఎక్సైజ్ స్టేషన్ వల్ల ఉపయోగమేమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన 50 మంది మహిళలు తొలుత ఆ గ్రామ సర్పంచ్ గూడవల్లి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎక్సైజ్ స్టేషన్ ముందు గంట సేపు ధర్నా నిర్వహించారు. స్ధానిక ఎస్ఐ ఎ.మణికుమార్ సిబ్బందితో వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఎక్సైజ్ అధికారుల అసమర్థత కారణంగా గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు పెట్టి మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. మా జీవితాలే ప్రశ్నార్థకమవుతున్నాయ్... తామంతా పేద కుటుంబాలకు చెందినవారమని, కొంతకాలం నుంచి కానుకొల్లులో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులతో నానా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. తమ భర్తలకు మద్యం సేవించే అలవాటు ఉన్న కారణంగా వారి కూలి, తమ కూలి డబ్బులు సైతం మద్యం సీసాలకు బెల్ట్ షాపులలో ధారపోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి 11 గంటల వరకు నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులు తమ జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆవేదన చెందారు. కనీసం పిల్లలు చదివించటానికి కూడా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని వివరించారు. చివరికి తమ జీవితాలే ప్రశ్నార్థకమవుతున్నాయని వాపోయారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై స్పందించిన ఎస్ఐ వంశీకృష్ణ మాట్లాడుతూ బెల్ట్‌షాపుల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఐ అందుబాటులో లేకపోవటంతో ఎస్ఐకి మహిళలు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శొంఠి చింతలమ్మ, గంధసిరి పెద్దింట్లమ్మ, శొంఠి నాగమణి, కాగిత నాగలక్ష్మి, గూడవల్లి సంపూర్ణ, పరసా దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.