అత్యధికంగా క్యాన్సర్‌ బారిన పడుతుంది వారే! | Doctors Say Rural Women Have Highest Incidence Of Breast Cancer | Sakshi
Sakshi News home page

అత్యధికంగా క్యాన్సర్‌ బారిన పడుతుంది వారే!

Oct 4 2020 7:45 AM | Updated on Oct 4 2020 7:45 AM

Doctors Say Rural Women Have Highest Incidence Of Breast Cancer - Sakshi

గ్రామీణ మహిళల కంటే పట్టణాల్లో ఉండే వారే అత్యధికంగా రొమ్ము క్యాన్సర్‌ బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌కు గురయ్యే వారిలో కేవలం 10 శాతం మంది మాత్రమే తొలి దశలో గుర్తిస్తుండగా, 70 శాతం మంది, 2, 3 దశల్లో ఆస్పత్రులకు వస్తున్నారు. మరో 20 శాతం మంది నాలుగో దశలో చికిత్సకోసం వస్తున్నారు. వ్యాధి లక్షణాలపై సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ప్రతి 8 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు క్యాన్సర్‌ నిపుణులు చెబుతున్నారు. వ్యాధిపై విస్తృతమైన అవగాహన కలగించేందుకు అక్టోబర్‌ మాసాన్ని ప్రత్యేకంగా కేటాయించారు.  

వీరికి వ్యాధి సోకే అవకాశం.. 
సాధారణంగా వయస్సు 40 ఏళ్లు దాటిన వారికి రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది.  
లేటు వయస్సులో బిడ్డలు పుట్టిన వారికి, పిల్లలు పుట్టాక పాలు ఇవ్వని వారికి ఎక్కువగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు.      
కుటుంబంలో అంతకు ముందు ఎవరికైనా ఉన్నా, ఎక్కువ ఒత్తిళ్లకు గురయ్యే వారికి, పన్నెండేళ్లలోపు రజస్వల కావడం, నెలసరి ఆగడం, 55 ఏళ్ల వరకు నెలసరి ఉండటం వంటివి కారణాలుగా చెబుతున్నారు. 
ధూమపానం, ఆల్కాహాల్‌ సేవించే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ.  
ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ప్రభావంతో కూడా ఇది వచ్చే అవకాశం ఉంది.  

సెల్ఫ్‌ టెస్ట్‌ చేసుకోవచ్చు.. 
రొమ్ము క్యాన్సర్‌ ఎవరికి వారే గుర్తించవచ్చు. పీరియడ్‌ వచ్చిన వారం రోజుల తర్వాత స్నానం చేస్తున్న సమయంలో రొమ్ములో గింజంత సైజులో కణుతులు ఏమైనా వచ్చాయా, రొమ్ముపై చర్మం రంగు మారిందా, చంకల్లో గడ్డలు లాంటివి వచ్చాయా అనే విషయాలను మహిళలు చెక్‌ చేసుకోవాలి. రొమ్ము భాగంలో నొప్పిగా ఉన్నా, చిన్న చిన్న లక్షణాలు కనిపించినా వైద్యుడిని సంప్రదించాలి.  

మమ్మోగ్రామ్‌తో నిర్ధారణ.. 
రొమ్ము క్యాన్సర్‌ను మమోగ్రామ్‌ అనే స్కానింగ్‌ ద్వారా నిర్ధారిస్తారు. ఇప్పుడు 3డీ మమ్మోగ్రామ్‌ కూడా అందుబాటులో ఉంది.  
దీని ద్వారా వ్యాధి సూక్ష్మదశలో ఉన్నప్పుడే గుర్తించే అవకాశం ఉంది.  
రొమ్ము భాగంలో పౌడర్‌లా ఏదైనా చల్లినట్లు ఉన్నా కనిపెట్టేస్తుంది.  
ఏడాదికోసారి మమ్మోగ్రామ్‌ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.  

ముందు చూపే మందు..  
రొమ్ము క్యాన్సర్‌కు ముందు చూపే మందు. తొలిదశలోనే గుర్తించి వెంటనే ఆస్పత్రికి వెళ్తే అత్యాధునిక పరికరాలతో వ్యాధిని నిర్ధారించి చికిత్స పొందవచ్చు. సెల్ఫ్‌ చెక్‌ చేసుకునే విధానాలపై మహిళలకు అవగాహన ఉండాలి. రోజు వారీ వ్యాయామం చేస్తూ, బరువు పెరగకుండా చూసుకోవడం, కొవ్వు, నూనె ఉన్న పదార్థాలు తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే మంచిది.  – డాక్టర్‌ ఏవైరావు, క్యాన్సర్‌ వైద్య నిపుణుడు    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement