మెరిసిన మరో క్రీడాతేజం | weightlifting competition Ramakrishna Silver Medal | Sakshi
Sakshi News home page

మెరిసిన మరో క్రీడాతేజం

Published Tue, Feb 3 2015 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

weightlifting competition Ramakrishna Silver Medal

 విజయనగరం మున్సిపాలిటీ: కేరళలో జరుగుతున్న  35వ జాతీయక్రీడాపోటీల్లో   జిల్లాకు చెందిన మరో క్రీడా తేజం మెరిసింది. ఆదివారం  జరిగిన పోటీల్లో జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో  పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని చాటి చెప్పగా.. సోమవారం జరిగిన పోటీల్లో జిల్లాలోని నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన మొయిద.రామకృష్ణ సిల్వర్ మెడల్ దక్కించుకున్నారు. పురుషుల 68కేజీల విభాగంలో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించిన రామకృష్ణ  స్నాచ్‌లో 124 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 155 కేజీలు కలిపి మొత్తం 279 కేజీల బరువులు ఎత్తడం ద్వారా జాతీయ క్రీడల్లో తృతీయ స్థానంలో నిలిచాడు. సామాన్య కుటుంబానికి చెందిన రామకృష్ణ తల్లిదండ్రులు సత్యం, బంగారమ్మలు అదే గ్రామంలో వ్యవసాయ కూలీలుగా నివసిస్తున్నారు.
 
 ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ వెయిట్‌లిఫ్టింగ్ క్రీడ పట్ల ఉన్న ఆసక్తితో  శిక్షణలో రాటుదేలాడు. గతంలో పలు జాతీయ పతకాలను కైవసం చేసుకున్న రామకృష్ణ తాజాగా జాతీయ క్రీడా పోటీల్లో సిల్వర్ పతకం సాధించటం పట్ల జిల్లాలో సర్వత్రా హర్షం  వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం జరిగిన పోటీల్లో జిల్లాలోని నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి.శ్రీనివాసరావు సరికొత్త రికార్డు సృష్టించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో పురుషుల 56 కేజీల విభాగంలో ప్రాతినిధ్యం వహించిన శ్రీనివాసరావు  స్నాచ్‌లో  106 కేజీలు, క్లీన్ అండ్‌జర్క్‌లో 137కేజీలు కలిపి మొత్తం 243 కేజీలు బరువులు ఎత్తి బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు.
 
 అదేవిధంగా ఇదే గ్రామానికి చెందిన కె. వెంకటలక్ష్మి బ్రాంజి మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది. స్త్రీల 53 కేజీల విభాగంలో తలపడిన ఆమె స్నాచ్‌లో 72 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 96 కేజీలు కలిపి మొత్తం 168కేజీల బరువులు ఎత్తడం ద్వారా బ్రాంజి మెడల్‌ను సొంతం చేసుకుంది. అదేవిధంగా విజయనగరం పట్టణానికి చెందిన బంగారు.ఉష  జాతీయపోటీల్లో 48కేజీల విభాగంలో పాల్గొని స్నాచ్‌లో  72 కేజీల బరువును, క్లీన్ అండర్ జర్క్‌లో 89 కేజీల బరువును కలిపి మొత్తం 161 కేజీలు బరువులను  ఎత్తారు. తద్వారా బ్రాంజి మెడల్‌ను దక్కించుకుంది.
 

Advertisement
Advertisement