సునీల్ మిట్టల్, రవి రుయాలకు ఊరట | Spectrum case: Relief to Sunil Mittal, Ravi Ruia | Sakshi
Sakshi News home page

సునీల్ మిట్టల్, రవి రుయాలకు ఊరట

Published Sat, Jan 10 2015 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

సునీల్ మిట్టల్, రవి రుయాలకు ఊరట

సునీల్ మిట్టల్, రవి రుయాలకు ఊరట

* అదనపు స్పెక్ట్రమ్ కేటాయింపు కేసు నుంచి విముక్తి
* ప్రత్యేక కోర్టు సమన్లను తోసిపుచ్చిన సుప్రీం

న్యూఢిల్లీ: అదనపు స్పెక్ట్రమ్ కేటాయింపు కేసులో భారతీ సెల్యులార్ సీఎండీ సునీల్ మిట్టల్, ఎస్సార్ గ్రూప్ ప్రమోటర్ రవి రూయాలకు ఊరట లభించింది. 2002 ఎన్‌డీఏ పాలనా కాలంలో అదనపు స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి అవినీతి కేసులో వీరిని నిందితులుగా పేర్కొంటూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన సమన్లను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ‘ఈ కేసులో వీరికి న్యాయ సూత్రాల రీత్యా సమన్లు సరికావు.

కేసుతో సంబంధమున్నట్లు తగిన ఆధారాలు లేవు. కనుక ప్రత్యేక కోర్టు ఉత్తర్వును మేము తోసిపుచ్చుతున్నాం’ అని చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ మదన్ బీ లోకూర్, ఏకే శిక్రీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఏ దశలోనైనా, ఏ విధమైన తగిన ఆధారాలు లభించినా వారిని కోర్టుకు పిలిపించే అధికారం ప్రత్యేక జడ్జికి ఉంటుందని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మిట్టల్ తరఫున అత్యున్నత న్యాయస్థానం ముందు సీనియర్ న్యాయవాది ఎఫ్‌ఎస్ నారీమన్ వాదనలు వినిపించారు. సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో అసలు తమ క్లయింట్ పేరు లేదని, అయినా కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ చేయడం సరికాదని న్యాయస్థానానికి తెలిపారు.
 
స్పెక్ట్రం వేలంపై భారతీ , వొడాఫోన్ వినతికి నో...
ప్రభుత్వం గతంలో తమకు కేటాయించిన స్పెక్ట్రంను వేలం వేయకుండా స్టే ఇవ్వాలంటూ భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా చేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అయితే, లెసైన్సులు రెన్యువల్ చేయాలన్న అభ్యర్ధనపై విచారణను మాత్రం పెండింగ్‌లో ఉంచింది. ఇరు సంస్థల స్పెక్ట్రం లెసైన్సుల గడువు ఈ ఏడాది డిసెంబర్‌తో తీరిపోనుంది. దీంతో వీటి ఆధీనంలో ఉన్న స్పెక్ట్రంను కూడా వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం లేదా వేలంలో ఖరారయ్యే బిడ్ మొత్తాన్ని చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, తమ చేతిలో ఉన్న స్పెక్ట్రంను వేలం వేయొద్దని రెండు కంపెనీలూ కోరుతున్నాయి.
 
ఫిబ్రవరి 25 నుంచి 2జీ, 3జీ స్పెక్ట్రం వేలం
కాగా ఫిబ్రవరి 25 నుంచి 2జీ, 3జీ స్పెక్ట్రం వేలం మొదలవుతుందని టెలికం విభాగం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు సమర్పించేందుకు ఆఖరు తేది ఫిబ్రవరి 6. స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వం కనీసం రూ. 64,840 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Advertisement
Advertisement