స్వీట్ స్వేచ్ఛ | special sweets for independence day | Sakshi
Sakshi News home page

స్వీట్ స్వేచ్ఛ

Published Wed, Aug 14 2013 11:19 PM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM

స్వీట్ స్వేచ్ఛ

స్వీట్ స్వేచ్ఛ

ఏడాదిలో ఎన్ని ‘డే’ లు ఉన్నా...
 ఇవాళ మనకు స్పెషల్ డే!
 మనసుల్లో ఎన్ని రంగులున్నా...
 ఈరోజు మనందరివీ... మూడే!
 సూర్యోదయం కూడా...
 మువ్వన్నెల్లోనే కనిపిస్తుంది!
 పూలూ త్రివర్ణంలోనే.
 గగన మేఘాల్లో తేలియాడేవీ...
 భవన రాగాల్లో సొక్కిసోలేవీ...
 కాషాయ- శ్వేత- హరితాలే!
 ప్రాణాలను చిందించి, భరతమాతకు ఫ్రీడమ్ కలర్స్ అద్దారు సమరయోధులు.
 గుండెలనిండా వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం.
 భరతజాతి మహద్భాగ్యాన్నితియ్యటి రుచులతో సెలబ్రేట్ చేసుకుందాం.
 హ్యాపీ ఇండిపెండెన్స్ డే.
 

 ట్రిపుల్ కలర్ బూందీ
 కావలసినవి: శనగపిండి - అరకిలో
 బియ్యప్పిండి - 100 గ్రా.
 బెల్లం - అర కిలో; ఏలకులపొడి - టీస్పూను
 సోడా - పావు టీ స్పూను
 నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
 ఆకుపచ్చ, ఎరుపురంగులు - చిటికెడు చొప్పున
 
తయారి: ఒక పెద్ద పాత్రలో శనగపిండి, బియ్యప్పిండి, సోడా, తగినంత నీరు పోసి దోసెల పిండి మాదిరిగా కలపాలి.    
బాణలిలో నూనె కాగాక, కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని బూందీ చట్రంలో వేసి చేత్తో నెమ్మదిగా కదిపి, (చట్రం ఎంత సన్న రంధ్రాలున్నదైతే బూందీ అంత సన్నగా వస్తుంది) బూందీ వేగాక తీసేయాలి.    
ఒక పెద్ద పాత్రలో బెల్లం, ఏలకులపొడి, తగినంత నీరు పోసి బెల్లం తీగపాకం వచ్చాక, తయారుచేసి ఉంచుకున్న బూందీని అందులో వేసి బాగా కలపాలి.
(గమనిక: కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని మూడు సమాన భాగాలుగా చేసుకుని, ఒక్కో భాగంలో రంగులు వేసి కలిపాక బూందీ తయారుచేసుకుంటే ట్రిపుల్ కలర్ బూందీ సిద్ధమవుతుంది).
 
 ట్రైకలర్ కాజూ బర్ఫీ
 కావలసినవి: జీడిపప్పు - 500 గ్రా.
 పంచదార - 500 గ్రా.
 ఫుడ్ కలర్ - కొద్దిగా (ఆకుపచ్చ, ఎరుపు రంగులు)
 రోజ్‌వాటర్ - టీ స్పూను
 కుంకుమపువ్వు - చిటికెడు
 పాలు - కొద్దిగా
 
తయారి: జీడిపప్పులను సుమారు నాలుగు గంటలసేపు తగినంత నీటిలో నాన బెట్టాలి.    
నీటిని ఒంపేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.    
ఒక పెద్ద పాత్రలో జీడిపప్పు పేస్ట్, పంచదార వేసి స్టౌ మీద ఉంచాలి.   
ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత రోజ్ వాటర్ జతచేయాలి.    
చిన్న పాత్రలో కుంకుమపువ్వు, పాలు వేసి బాగా కలిపి, చల్లారనివ్వాలి.    
మరో రెండు చిన్న పాత్రలలో కొద్దిగా నీరు తీసుకుని ఆకుపచ్చ, ఎరుపు రంగులు విడివిడిగా కలపాలి.   
జీడిపప్పు మిశ్రమాన్ని మూడు భాగాలుగా చేసి కుంకుమపువ్వు + పాల మిశ్రమం, రంగు నీటిని జతచేసి మూడు రంగుల మిశ్రమాలు తయారుచేసుకోవాలి.   
ఈ మిశ్రమాన్ని వరుసగా ఒక ప్లేట్‌లో ఒకదాని మీద ఒకటి వేసి సమానంగా పరిచి కావలసిన ఆకారంలో కట్ చేయాలి.
 
మువ్వన్నెల హల్వా
కావలసినవి: సొరకాయ తురుము, క్యారట్ తురుము - అర కప్పు చొప్పున; బొంబాయిరవ్వ - 2 కప్పులు; పాలు - 6 కప్పులు; పంచదార - 6 కప్పులు; ఏలకులు పొడి - 2 టీ స్పూన్లు; నెయ్యి - 2 కప్పులు; జీడిపప్పు, కిస్‌మిస్ - 4 టేబుల్ స్పూన్ల చొప్పున; రోజ్ ఎసెన్స్ - 6 చుక్కలు
 
తయారి:  బాణలిలో బొంబాయిరవ్వ వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి పక్కన ఉంచాలి.
సొరకాయ తొక్క తీసి, తురిమి నీరు గట్టిగా పిండి పక్కన ఉంచాలి  క్యారట్ తొక్క తీసి, తురిమి పక్కన ఉంచాలి  ఒక పెద్ద పాత్రలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి, సొరకాయ తురుము, క్యారట్ తురుములను విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి  అదే పాత్రలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేసి వేయించి పక్కన ఉంచాలి  ఒక పెద్ద పాత్రలో పాలు పోసి మరిగాక పంచదార, ఏలకులపొడి వేసి మరిగించాలి.
 
బొంబాయిరవ్వ వేస్తూ గరిటెతో బాగా కలిపి, మధ్యమధ్యలో నెయ్యి వేసి ఉడికిన తరువాత, రోజ్‌ఎసెన్స్ జత చేయాలి  మరొక పాత్రలో సొరకాయ తురుము, క్యారట్ తురుములను నేతితో కలిపి విడివిడిగా ఉడికించాలి  ఉడికించిన బొంబాయిరవ్వ మిశ్రమంలో క్యారట్ తురుము, సొరకాయ తురుములను విడివిడిగా కలపాలి.

ఒక ప్లేట్‌లో వీటిని రంగుల వారీగా ఒకదానిమీదొకటి పరిచి, జీడిపప్పు, కిస్‌మిస్‌ల తో గార్నిష్ చేయాలి.
 
 దహీపూరీ
 కావలసినవి:  పూరీలు - 40 (మార్కెట్‌లో రెడీగా దొరుకుతాయి)
 స్ప్రౌట్స్ - అర కప్పు; కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు
 ఉడికించిన బంగాళదుంప ముక్కలు - అర కప్పు
 చింతపండు, ఖర్జూరం చట్నీ - కప్పు
 పెరుగు - మూడు కప్పులు; ఉప్పు - తగినంత;
 
 గార్నిషింగ్ కోసం
 సేవ్ - అర కప్పు (మార్కెట్‌లో దొరుకుతుంది)
 కారం - 2 టీ స్పూన్లు; జీలకర్రపొడి - 2 టీ స్పూన్లు
 
 తయారి:  ఒకపాత్రలో పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి.    
 మరో పాత్రలో స్ప్రౌట్స్, బంగాళదుంప ముక్కలు వేసి కలపాలి.    
 సర్వింగ్ ప్లేట్‌లో పూరీలను ఉంచాలి.    
 ప్రతిపూరీ మధ్యలోనూ రంధ్రం చేసి, అందులో బంగాళదుంప మిశ్రం ఉంచి, పైన చింతపండు + ఖర్జూరం చట్నీ వేయాలి.    
 తరువాత పెరుగు వేయాలి.    
 సన్నటి సేవ్, కారం, జీలకర్రపొడి పైన చల్లాలి.    
 కొత్తిమీరతో గార్నిష్‌చేసి సర్వ్ చేయాలి.
 
-రంజాన్‌ఖాన్, ఎగ్జిక్యూటివ్ చెఫ్
 సెలబ్రిటీ రిసార్ట్స్
 షామిర్‌పేట్, హైదరాబాద్
 సేకరణ: డా. వైజయంతి
 ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్

Advertisement
Advertisement