సృజనం: అంతరంగం | jujjuri venu writes a village story | Sakshi
Sakshi News home page

సృజనం: అంతరంగం

Published Sun, Nov 24 2013 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM

సృజనం: అంతరంగం

సృజనం: అంతరంగం


 దేవుడు కూడా బలమున్నోడి పక్కనే ఉంటాడు. జింకని ఏటాడేటప్పుడు పులి పక్కనుంటాడు. పులిని ఏటాడేటప్పుడు ఏటగాడి పక్కనుంటాడు. నోరు లేని ఆటిని సంపడం పాపమయ్యా’’
 
 అపార్ట్‌మెంట్లో మూడవ అంతస్తు. బయట నుండి కిటికీని కలుసుకుని మాట్లాడుతున్నట్టు వక్క చెట్టు. అదే కిటికీ దగ్గర లోపల్నుండి అదే చెట్టును పరామర్శిస్తున్నట్టు ప్లాస్టిక్ వాల్ ఛైర్లో నేను. ఆ చెట్టును చూస్తున్నప్పుడల్లా చిన్ననాటి పల్లెటూరు గుర్తుకొస్తుంటుంది. అపార్ట్‌మెంట్ తాలూకు కృత్రిమ వాతావరణం నుండి నన్ను నేను రక్షించుకోవడానికి నాకున్న ప్రత్యామ్నాయం పల్లెటూరే. నేను తాతని అయినా నా తాతతో ముడిపడ్డ ఆ జ్ఞాపకం, నాకు మానవ స్వభావాన్ని విప్పి చెప్పింది. అల్జీమర్స్ వ్యాధితో ఎన్నో జ్ఞాపకాలు కోల్పోయినా, ఆ జ్ఞాపకం మాత్రం నా స్మృతి పథంలో శిలాశాసనంలా ముద్రించుకుపోయింది.
 
 ఆ రోజు ఆకాశమంతా నీలి సముద్రంలా ఉంది. కెరటాలు సృష్టించిన నురగల్లా తెల్ల మబ్బులున్నాయి. తాతయ్య ఎందుకో, అంతకు క్రితం రోజు రేడియో విన్నప్పట్నుంచీ ఒంట్లో సత్తువనంతా ఎవరో లాగేసినట్టు దిగాలుగా ఉన్నాడు. కోళ్లు కుయ్యకముందే తెల్లారగట్లే కొంగల చెరువుకు రెండు మైళ్లు నడిచెళ్లి పాలు పితుక్కొచ్చేవాడు. సైకిల్‌ను లేడిపిల్లలా చెంగున దూకిస్తాడు. పాలు తెచ్చి తేవడంతోనే తాత కాలకృత్యం కల్లుతో మొదలవుతుంది. గమళ్లోళ్ల సత్తయ్య దగ్గరికి లగెత్తి, ఎండబెట్టి లోపల గుజ్జు తీసేసిన ఆనబకాయ డొక్కుతో రెండు తడవలు కల్లు తాగి తాబేటికాయ (తాబేలు ఆకారంలో చేసిన మట్టికుండ)తో కల్లు తెచ్చుకునేవాడు. పడక్కుర్చీలో కూర్చుని చుట్ట వెలిగించుకుని, వరి పొలాలను చూస్తూ బుద్ధి పుట్టినప్పుడల్లా ఆరారగా కల్లు ఖాళీ చేసేవాడు. అపర్ణాహపు వేళ అన్నం తిని, కునుకు తీసి, చల్లబడ్డాక ఏదో పనున్నట్టు ఊరి మధ్య రావిచెట్టు కింద రచ్చబండ దగ్గరికి పరిగెట్టేవాడు. అక్కడ ఈయనలాంటి ముసలోళ్ల మధ్య కూర్చుని లోకాభి రామాయణం మొదలుపెడతాడు. తమ గురించి చెప్పే గొప్పలు గానీ, పక్కవాళ్లనడిగే అప్పులు గానీ, లంక పొగాకు చుట్టల ముచ్చట్లు గానీ, తమ చుట్టాల ఇక్కట్లు గానీ... ఇలా దొర్లని విషయమంటూ అక్కడుండదు. అలాంటిది ఆ రోజు ఆయన దినచర్య మారిపోయింది.
 
 నల్లటి నిర్వేదం కమ్ముకున్నట్లు మౌనంగా పడక్కుర్చీలో నడుం వాల్చాడు. సూరీడు పెకైక్కాక నాన్న సైకిలెక్కి గేదెల పాలు పితుక్కొచ్చాడు. తాతకి టీచుక్క ఇచ్చినా గొంతులో పోసుకుందే లేదు. గ్లాసులో మట్టిరంగు మీగడ తడక పైకి తేలింది. సుస్తీ చేసినవాడల్లే ఉండిపోయాడు. నాటు వైద్యుడు రామాచారి దగ్గరకు కబురు వెళ్లలేదంటే తాతకి సుస్తీ లేదు, అలాగని ఎంగిలి పళ్లేదు కూడా. తాత చిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ మాటకొస్తే ఊరు ఊరంతా విచిత్రంగా ప్రవర్తిస్తోంది.
 
 ఎత్తరుగులున్న మా తాటాకిల్లు ముందు సైకిల్ షాపుంది. పది పైసలిచ్చి గంటకు అద్దెకు తెచ్చుకుని ఊరంతా తిరిగేవాళ్లం. ఐదు పైసలు నేనిచ్చి నల్లగోవు అప్పారావుగాణ్ని వెనక ఎక్కించుకుని ఓ అర్ధగంట, ఆ తరువాత వాడి ఐదు పైసలతో వాడు తొక్కుతున్న సైకిలెక్కి ఓ అర్ధగంట షికారుకెళ్లేవాళ్లం. ఆ రోజు బడికి సెలవు. మా చెక్క పలకలకు కూడా సెలవిచ్చి మూలనపడేశాం. సైకిల్ షాపు తెరవకపోవడంతో నన్ను నిరాశ, నిస్పృహ ఆవహించాయి. అంతేకాదు, గమళ్లోళ్ల సత్తయ్య బల్లకట్టు (మోకు)తో తాడిచెట్టు ఎక్కేటప్పుడు, గొడ్డలితో కట్టెల్ని నరుకుతున్నట్టు పెద్ద శబ్దం ప్రతిధ్వనించేది. ఊరికి చివర ఇల్లు మాదే కావడంతో, శబ్దం వచ్చే దిశగా తాత కల్లుకి పయనమయ్యేవాడు. ఆ రోజు శబ్దం రాలేదు. చాలాసేపటి తరువాత తెలిసిన విషయమేమిటంటే, గమళ్లోళ్ల సత్తయ్య ఊరికి ఉత్తరానున్న శివాలయంలో దూరి దైవ ప్రార్థనలు చేస్తున్నాడని! ఇంకో విచిత్రం ఏంటంటే, మా అత్తయ్య మా ఇంటికి రావడం.
 
 ఎప్పుడో అత్తయ్య పెళ్లిలో తాతయ్యకు, పెళ్లికొడుకైన మావయ్యకు తగాదా జరిగి, రెండిళ్లకూ రాకపోకలు ఆగిపోయాయి. మా ఇంటికి పండగలకీ, పబ్బాలకీ అత్తయ్య గానీ, మావయ్య గానీ వచ్చేవారు కాదు. పాము కాటుతో మావయ్య చనిపోయినా కూడా మా ఇంటి నుండి తాతయ్య ఎవర్నీ వెళ్లనీయలేదు. అత్తయ్య పిల్లలతో రావడంతో నానమ్మ సంతోషం అంతా ఇంతా కాదు. అత్తయ్య వస్తూనే తాతయ్యని ఎలా ఉన్నావు నాన్నా అని అడిగినా, తాతయ్య బదులివ్వలేదు. నానమ్మ, తాతయ్య దగ్గరకొచ్చి, ‘‘రాక రాక ఆడబిడ్డొచ్చింది గదా. ఏటపోతుని ఏసిపెట్టొచ్చు కదా’’ అని అడిగింది. తాతయ్య కళ్లెర్రజేసి నానమ్మకేసి చూశాడు. ఆవిడ గబగబా లోపలికి వెళ్లిపోయింది.
 
 ఊరి చివర గంగానమ్మ వేపచెట్టు దగ్గర మా ఆటస్థలం. గంగానమ్మ వేపచెట్టు దగ్గర బలిచ్చిన కోళ్ల, మేకల రక్తం అక్కడున్న పంట బోదెల్ని తడిపేసిందట. గుట్టగా పడున్న కోళ్ల, మేకల తలలు చూసి పిల్లకాయలు జడుసుకుంటారని పెద్దలు పిల్లల్ని అక్కడికి రానివ్వడం లేదు. ఆ రోజు రక్తం రుచి చూడని ఇళ్లు చాలా తక్కువ. ప్రతి ఇంట్లోనూ పెళ్లి జరుగుతున్నట్టు మాంసం తినేవాళ్లు తింటున్నారు, మందు తాగేవాళ్లు తాగుతున్నారు. అడ్డుచెప్పేవారు లేరు, ఆశపడనివారూ లేరు. కొన్నిళ్లల్లో ఇలా ఉంటే, ఇంకొన్ని ఇళ్లల్లో పొయ్యిలో పిల్లి లేవనే లేదు. అలా ఊరంతా కొంత పెళ్లిసందడి, మరికొంత శ్మశాన నిశ్శబ్దం అలుముకున్నాయి. మా ఇంటికి తాతయ్య అక్క నర్సమ్మమ్మ వచ్చింది. నానమ్మ, తాతయ్య దగ్గరికెళ్లి, ‘‘ఏమయ్యా మీ నర్సప్ప వచ్చిందయ్యా, మరక (ఆడమేక)నైనా కొయ్యవయ్యా’’ అంది. తాతయ్య కోపం గోదారి గట్టు తెగినట్టు కట్టలు తెంచుకుంది. ఆవేశంతో రొమ్ములు ఎగిసిపడుతున్నాయి. పళ్లు పటపటా నూరాడు. నానమ్మ బిత్తరపోయి అక్కణ్నుంచి వెళ్లిపోయింది.
 
 ఆ రోజు చిత్రాల్లోకెల్లా చిత్ర విచిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. మా ఊరిలో ఒరిస్సా బ్రాహ్మలాయన చిన్న హోటల్ పెట్టాడు. అందరూ కాజాపంతులని పిలిచేవారు. జన్మ వల్లే కాక సంస్కారం వల్ల కూడా బ్రాహ్మణుడాయన. కాజా పంతులికి సైకిల్ షాపు శ్రీనివాసు ఫ్రెండ్. శ్రీనివాసుకి నీసు అంటే పిచ్చవడంతో తినాలనే యావతో ఎప్పుడు చేపల్ని ఇంటికి తీసుకెళ్లినా, వాళ్లావిడ వాటిని రాతికేసి తోమి బాగుచెయ్యలేనని కరాఖండిగా చెప్పేసేది. అందుకే శ్రీనివాసు కాజాపంతుల్ని ఆ రోజు చేప కూర వండిపెట్టమని బతిమిలాడాడు. స్నేహం కంటే గొప్పదేదీ లేదని కాజా పంతులు వాటిని మిత్రుడు కడుపు నిండా తృప్తిగా భోంచేసేలా రుచిగా వండి పెట్టాడు. మిత్రుడు చేప కూర ఆబగా తింటుంటే, పంతులుగారు పరమానందపడిపోయాడు. శ్రీనివాసు పంతుల్ని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
 
 పదిహేను వేలు ఒంటి చేత్తో వడ్డీకి తిప్పే అతిపెద్ద వ్యాపారస్తుడిగా పేరుబడ్డ పేర్రాజు తన బాకీవాళ్ల దగ్గరికెళ్లి తనకు వడ్డీయే కాదు, అసలు కూడా ఇవ్వక్కర్లేదని చెప్పాడంట. ఆ రోజు సాయంత్రం గోళీలాటకెళ్తుంటే, శీలం వీర్రాజు ‘‘ఒరేయ్ ఈ రోజు రాత్రి మనం చచ్చిపోతామంట’’ అన్నాడు. మా ఊళ్లో వామిశెట్టోరింట్లో మాత్రమే ఒకే ఒక టీవీ ఉండేది. ఆ రోజు అందర్నీ వాళ్లింటికి టీవీ చూడ్డానికి రానిచ్చారు. టీవీ చూస్తుండగా తెలిసింది అసలు విషయం ‘‘స్కైలాబ్ ఆ రాత్రి భూమిని ఢీకొట్టబో’’తుందని!
 
 ఆ రాత్రి బిక్కుబిక్కుమంటోంది. తుమ్మచెట్ల వరుసలోంచి తీతువుపిట్ట భయంకరంగా అరుస్త్తోంది. ఊరి ఊరకుక్కలు ఏడుస్తున్నాయి. ఆకాశంలో చుక్కల చల్లదనాన్ని, తెల్లదనాన్ని చూస్తూ అందరూ ఆరుబయట పడుకున్నాం. నేను తాతయ్య మంచం మీదే పడుకున్నాను. తడికల అవతల బయటే పడుకున్న చాకలి వెంకటేశు తాతని అడిగాడు, ‘‘రెండు మేకల్నీ కోసెయ్యకపోయారయ్యా, ఇంకెందుకుంచుకున్నారు?’’
 తాతయ్యొక బలమైన నిట్టూర్పు వదిలాడు. కళ్లల్లో నీళ్లు సుళ్లు తిరగడం నాకు తెలుస్తోంది. ‘‘ఇంకా మడుసులకి బుద్ధి రాలేదు చూశావా ఎంకటేసు! మనింట సుభకార్యమైనా, అసుభ కార్యమైనా బలయ్యేది మూగజీవాలే. దేవుడు కూడా అందుకే ఆటిని మాట్లాడనివ్వకుండా నోరు నొక్కేశాడు.
 
 ఆటికి మాటొస్తే ఇన్ని రోజులు ఆటిమీద మడిసి చేసిన మారణకాండకి బదులడిగితే నోరు తెరిచే మడిసెవ్వడు? ఆటి మూగ సేపాలే ఈ భూమి యినాసనం. దేవుడు కూడా బలమున్నోడి పక్కనే ఉంటాడు. జింకని ఏటాడేటప్పుడు పులి పక్కనుంటాడు. పులిని ఏటాడేటప్పుడు ఏటగాడి పక్కనుంటాడు. నోరు లేని ఆటిని సంపడం పాపమయ్యా’’ అని గాద్గదికమైన గొంతుతో అన్నాడు. వైరాగ్యం నిలువునా ఆవరించింది. తాత కంటికొనల నుండి కన్నీరు జారుతోంది. తోకచుక్క కనబడ్డప్పుడు మనమేదనుకుంటే అది జరుగుతుందని నమ్మకం. ఆ రోజు రాత్రి మా పైనుండి తోకచుక్క వెళుతున్నప్పుడు తాతయ్య దానికి దణ్నం పెడుతూ ‘‘తెల్లారేదాకా ఉంచి, మా బతుకులు తెల్లారేట్టు చెయ్యి’’ అని కోరుకున్నాడు. ఎవ్వరూ నిద్రపోలేదు. నేను మాత్రం నిద్రపోయాను.
 
 నాకు మెలకువొచ్చేసరికి పురిటినొప్పులు పడి సూరీడు వచ్చాడు. పొద్దెక్కాక పడిన ఎండ భూమ్మీద బంగారం పరిచినట్టుంది. కళ్లు నులుముకుని మంచం దిగి చూస్తే ఇంటి ముందు సైకిల్ షాపు తెరిచి ఉంది. తాడి తోపుల్లోంచి బల్లకట్టు శబ్దం వినిపిస్తోంది. తాత కోసం అటూ ఇటూ చూస్తుంటే, పాక అవతలి సందులో మాటలు వినిపిస్తుంటే అటు వెళ్లాను. తాత చుట్ట కాలుస్తూ చాకలి వెంకటేశుతో కర్రకి తలకిందులుగా వేలాడుతున్న తల లేని మేక తోలు ఒలిపిస్తున్నాడు. నేనలాగే బిగుసుకుపోయాను. నిద్ర మత్తు వదిలింది. తాత నన్ను చూసి రారా మనవడా అని రెండు చేతులు సాచాడు. అది ధృతరాష్ట్ర కౌగిలిలా అనిపించి, నేను వెనక్కి పరుగుపెట్టాను. ఆ పరుగుతో మనిషంటే అసహ్యం, అభద్రతా భావం ఏర్పడ్డాయి.  మనిషి తన మనసు పొరల్లో నిక్షిప్తం చేసుకున్న కోరికల చుట్టూ కట్టుకున్న గాలిగోడలు కనబడ్డాయి. అంతరిక్షాన్ని చేరుకున్న మనిషి, తన అంతరంగానికి మాత్రం దూరమవుతూనే ఉన్నాడు.
 - జుజ్జూరి వేణు

Advertisement
Advertisement