
సెక్షన్ 66Aను కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ : భావ ప్రకటనా స్వేచ్ఛకు బంధనాలు వేస్తున్న ఇన్ఫర్మేషన్ చట్టంలోని సెక్షన్ 66Aని సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగ అధికరణ 19(1)A కల్పిస్తున్న భావ ప్రకటనా స్వేచ్ఛకు ఈ సెక్షన్ భంగకరంగా ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేయమని ప్రభుత్వం చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. డిజిటల్ మీడియా స్వేచ్ఛకు సంబంధించి సెక్షన్ 66A అత్యంత కిరాతకంగా ఉందని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
కంప్యూటర్, మొబైల్ లేదా ఇతర సమాచార సాధనాల ద్వారా ఎవరైనా అసహ్యకరమైన, అవమానకరమైన మెసేజ్, సమాచారం పంపితే అలాంటి వారికి మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించే అధికారం ఐటీ చట్టంలోని సెక్షన్ 66A కల్పిస్తోంది. అవమానకరైన సమాచారం అనే పదం చాలా అస్పష్టంగా ఉందని, దీన్ని ఎలా అంటే అలా నిర్వచించుకునే వీలుందని అనేక మంది సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు
ముంబయిలో శివసేన అధినేత బాల్‌ఠాక్రే చనిపోయినప్పుడు ముంబైలో బంద్ పాటించడాన్ని షహీన్ ధద అనే యువతి ఫేస్‌బుక్‌లో ప్రశ్నించారు. రేణు శ్రీనివాసన్ అనే మరో యువతి ఆ కామెంట్‌కు 'లైక్' కొట్టింది. దాన్ని నేరంగా పరిగణించి ఆ ఇద్దరు యువతులను పోలీసులు 2012లో అరెస్టు చేశారు.
సాధారణ జన జీవనానికి ఇబ్బంది కలిగించిన బంద్‌ను ప్రశ్నించడం కచ్చితంగా భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకే వస్తుందని, అయితే విస్తృత అర్థాన్నిచ్చే విధంగా ఐటీ చట్టం 66ఏను అన్వయించి వారిని అరెస్టు చేయడమంటే పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లేననీ, ఐటీ చట్టంలోని ఆ సెక్షన్‌ను తొలగిం చాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రేయా సింఘాల్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) వేసిన విషయం తెలిసిందే.