ఆ బైపాస్ రోడ్డు.. ఆ ఊరికి పీడకల
హైదరాబాద్: అది నాలుగు లేన్ల బైపాస్ రోడ్డు. ప్రయాణ సమయాన్ని తగ్గించడం కోసం, సురక్షితంగా ప్రయాణించడం కోసం ఆరేళ్ల క్రితం రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ రోడ్డుపై ప్రయాణించడమంటే ప్రయాణికులకు, వాహనదారులకు ఎంతో సరదా. వాహనాలు యమ స్పీడుతో దూసుకెళ్తుంటాయి. పెద్దకుంట తాండా వాసులకు మాత్రం ఈ రోడ్డు దాటడం ప్రాణగండం. ఈ రోడ్డు వారికి మృత్యుకూపం వంటిది. ఎందరో మహిళలను వితంతువులుగా మార్చిన రోడ్డు ఇది. మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్దకుంట విషాదగాథ ఇది.
2006లో ఎన్ హెచ్ ను విస్తరించారు. పెద్దకుంట వాసులకిది పీడకలను మిగిల్చింది. పెద్దకుంటకు వెళితే ఎక్కువగా మహిళలు, పిల్లలు, వృద్ధులు కనిపిస్తారు. మగవాళ్లు కనిపించడం తక్కువ. ఎందుకంటే బైపాస్ రోడ్డు 35 మంది మగవాళ్లను మింగేసింది. రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలకు బలియ్యారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడం విషాదకరం. ఓ మహిళ తండ్రి, భర్త, సోదరుడిని కోల్పోయింది. దీంతో ఆ కుటుంబం మగదిక్కు లేకుండాపోయింది. ఆ ఊరిలో ఇలాంటి కుటుంబాలెన్నో. .
రోడ్డు దాటడం కోసం ఫుట్ బ్రిడ్జి లేదా టన్నెల్ నిర్మించాలని స్థానికులు ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. మా ఊరికి ఎందరో వచ్చారు.. ఫొటోలు, వీడియోలు తీసుకుని పోయారు.. కానీ ఒక్కరూ సాయం చేయలేదు అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.