న్యూఢిల్లీ: పన్ను సంస్కరణలకు సంబంధించి ఆరు నెలల్లో తొలి నివేదికను సమర్పించనున్నట్లు టీఏఆర్‌సీ (పన్ను పాలనా సంస్కరణల కమిషన్- టీఏఆర్‌సీ) చైర్మన్ పార్థసారథి శోమ్ పేర్కొన్నారు. అనంతరం ప్రతి మూడు నెలలకు ఒకసారి నియమిత కాల వ్యవధులకు సంబంధించిన నివేదికలను సమర్పిస్తామని ఆర్థిక మంత్రికి సలహాదారు కూడా అయిన శోమ్ వెల్లడించారు.
ఆర్థిక నేరాలను అరికట్టడం, పన్నుల వ్యవస్థలో ఇతర సంస్కరణలు వంటి అంశాలపై శోమ్ నేతృత్వంలో ఆర్థికశాఖ ఏర్పాటు చేసిన టీఏఆర్‌సీ మొదటి సమావేశం సోమవారం జరిగింది. అనంతరం శోమ్ విలేకరులతో మాట్లాడారు. ఏడుగురు సభ్యులతో ఏర్పాటయిన కమిటీ మొత్తం 18 నెలలలోపు తన పూర్తి నివేదికను సమర్పించాల్సి ఉంది. కమిషన్ రేపు కూడా సమావేశం అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా న్యూఢిల్లీలో సోమవారం పారిశ్రామిక సంస్థ అసోచామ్ పన్నులపై నిర్వహించిన 10వ అంతర్జాతీయ రెండు రోజుల సదస్సును శోమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పన్నులకు సంబంధించి ఒక నివేదికను ఆవిష్కరించారు.