‘మట్టిగుండె’ చప్పుడు | Vijayanti writes on poet papineni Shiv Shankar | Sakshi
Sakshi News home page

‘మట్టిగుండె’ చప్పుడు

Published Thu, Dec 22 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM

‘మట్టిగుండె’ చప్పుడు

‘మట్టిగుండె’ చప్పుడు

వ్యవసాయ నేపథ్యంతో కథలు, కవితలు రాసిన శివశంకర్, పత్తి రైతుల ఆత్మ హత్యల మీద ఆధునిక కాలంలో కవితలు రాసిన మొట్టమొదటి కవి. ‘నాగలి విరిగిన చప్పుడు’ పేరుతో రాసిన  కవిత అందుకు చక్కని ఉదాహరణ.

‘‘జీవితంలో ఎదురైన అనుభవాలకే అక్షరరూపం ఇచ్చాన’’ని ప్రఖ్యాత రచయిత, ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమి అవార్డుకు ఎంపికైన డాక్టర్‌ పాపినేని శివశంకర్‌ తన సాహిత్య ప్రయాణానికి చోదకశక్తిని గురించి చెప్పారు. ‘మట్టిగుండె’ కథా సంపుటితో ఆయన తెలుగు రచనా ప్రపంచానికి సుపరిచితులు. 1910 –2010 నూరేళ్ల కథాచరిత్రలో ‘మట్టిగుండె’ చప్పుడు స్థానం దక్కించుకుంది. శివశంకర్‌ కథకుడు. విమర్శ కుడు. కవి. ఆయన రచించిన ‘రజనీగంధ’ కవితా సంపుటితో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు.

1953, నవంబర్‌ 6వ తేదీన వెంకటకృష్ణారావు, శాంతమ్మ దంపతులకు గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామంలో జన్మించారు పాపినేని శివశంకర్‌. గుంటూరు జేకేసీ కళాశాలలో బి.ఎ. పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో ఎంఏ; నాగార్జున విశ్వవిద్యాలయంలో పి.హెచ్‌డీ. పూర్తిచేశారు. అన్ని దశల్లోనూ బంగారు పతకాలు సాధిం చారు. ‘సాహిత్యం–మౌలిక అంశాలు’ అన్న అంశం మీద ఆచార్య తమ్మారెడ్డి నిర్మల పర్యవేక్షణలో ఆ సిద్ధాంత వ్యాసాన్ని వెలువరించారు. దీనికే తూమాటి దొణప్ప బంగారు పతకం లభించింది. బి.ఎస్‌.ఎస్‌.బి. కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా చేరి, 2010లో ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు.

ఇప్పటివరకు ‘స్తబ్దత’, ‘ఒక సారాంశం కోసం’, ‘ఆకుపచ్చని లోకంలో’, ‘ఒక ఖడ్గం – ఒక పుష్పం’, ‘రజనీగంధ’ అనే ఐదు కవితా సంపుటాలు వెలు వరించారు. ‘మట్టిగుండె’, ‘సగం తెరిచిన తలుపులు’ అనే రెండు కథా సంపుటాలు, ‘సాహిత్యం – మౌలిక భావాలు’, ‘నిశాంత’, ‘ద్రవాధునికత’ అనే మూడు విమర్శ గ్రంథాలు వెలువరించారు. ప్రాచీన కవిత్వ ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ కవుల పద్యాలు, వాటి వివరణతో ‘తల్లీ! నిన్ను దలంచి’ అనే అద్భుత సంక లనాన్ని కూడా వెలువరించారు. అటు ఆధునిక సాహి త్యంతో పాటు, ప్రాచీన సాహిత్యంలోని అనర్ఘరత్నాల పట్ల కూడా తన అభిమానాన్ని ఆ విధంగా చాటు కున్నారు. 20 దాకా అవార్డులు అందుకున్నారు శివశంకర్‌.

‘‘కారణాలు అనేకం. కానీ పిచ్చుకలు అంతరించి పోవడం చూస్తున్నాం. ఈ అంశాన్ని ‘చివరి పిచ్చుక’ కథలో వివరించాను. ఈ కథకు ఆకాశవాణి జాతీయ అవార్డు వచ్చింది. అలాగే ఎందరో జ్ఞానులు ఎన్నో గ్రంథాలు రచిస్తారు. చివరకు ఆ జ్ఞానం ఉనికి ఏమిటి? దానిని గుర్తించని క్షణం వస్తే ఏ సముద్రంలో పార బోయాలి అని ప్రశ్నిస్తూ ‘సముద్రం’ అనే కథ రచిం చాను. చాలామంది మేధావులతో పరిచయాలు ఉన్న కారణంగా వారి జీవితాలను, వారి ఆలోచనలను దగ్గ రగా చూశాను. ఆ పరిశీలన నుంచి వచ్చిన కథే సముద్రం’ అని చెప్పారాయన.  

1977లో ‘కలుపుమొక్క’ కథతో కథకునిగా  ఆయన జీవితం ప్రారంభించారు. ‘‘ఉన్నత పాఠశాలల్లో చదువు కునేటప్పుడు మా తెలుగు మాస్టార్లు చెప్పిన పాఠాలే నాలో రచనాసక్తిని పెంచాయి. మొదట్లో కవితలు రాశాను. ఆ తరువాత కథలు’’ అంటూ తన అక్షర ప్రయాణం గురించి చెప్పారు శివశంకర్‌. గాంధీ ఆస్థాన కవి, తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి చౌదరి దగ్గర చదువుకున్న విద్యార్థి శివశంకర్‌.
‘‘కథ రాయడానికి వారం పడితే, కవిత రాయడానికి ఒక్క రోజు సరిపోతుంది. ఇక విమర్శ రాయాలంటే మాత్రం చాలా సమయమే పడుతుంది. అందుకు బాగా చదవాలి కూడా. నాకు శ్రీశ్రీ, తిలక్, కొడవటిగంటి కుటుంబరావు, మా. గోఖలే, ప్రేమ్‌చంద్, శరత్, టీఎస్‌ ఇలియట్, పాబ్లో నెరూడా రచనలంటే మక్కువ. అయినా అందరి రచనలు చదవకుండా ఒక స్థాయికి రాలేం కదా’ అన్నారు శివశంకర్‌.

వ్యవసాయ నేపథ్యంతో కథలు, కవితలు రాసిన శివశంకర్, పత్తి రైతుల ఆత్మహత్యల మీద ఆధునిక కాలంలో కవితలు రాసిన మొట్టమొదటి కవి. ‘నాగలి విరిగిన చప్పుడు’ పేరుతో రాసిన  కవిత అందుకు చక్కని ఉదాహరణ. ఆయన తన రచనలలో మానవతావాదం, గ్రామీణ నేపథ్యం, వ్యవసాయ నేపథ్యం ఆవిష్కరిస్తారు. వ్యవసాయ నేపథ్యంతో ‘రజనీగంధ’ సంపుటిలో ఉన్న ఒక కవిత పేరు ‘పెంపకం’. ఆధునిక కాలంలో ఒత్తిళ్ల నేపథ్యంలో పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పారు ఈ కవితలో–‘నేను పిల్లలకు ఏమీ ఇవ్వలేదు/మానవత్వంతో నిండిన /రెండు కన్నీటి బొట్లను భరిణెలో పెట్టి ఇచ్చాను’ అన్నారు. అటువంటి కవిత్వం ఆయనది. ఆర్ద్రతతో నిండి ఉంటుంది. మదర్‌ థెరిసాని ‘విశ్వసౌందర్యమూర్తి’ అంటూ కవిత రచించారు. ఆ కవితను ఆంగ్లంలో విన్న థెరిసా శివశంకర్‌ను ప్రశంసించారు.

గుంటూరు జిల్లా మాండలికంలో మా. గోఖలే రచనల తరువాత ఆ ప్రక్రియలో అంత పేరు తెచ్చిన కథ ‘చింతలతోపు’. మారుతున్న గ్రామీణ నేపథ్యం, అందరూ పట్టణాలకు వలసపోతున్న వైనం ఈ కథలో వివరించారు. అలాగే మనుషులు వదులవుతారు కథ వయసు వచ్చే కొద్దీ మానవ సంబంధాలలో, ఇంకా చెప్పాలంటే వైవాహిక, దైహిక సంబంధాలలో వచ్చే పరిణామాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు శివశంకర్‌. పాతికేళ్ల పాటు ‘కథ’ పేరుతో తన సహ సంపాదకుడు వాసిరెడ్డి నవీన్‌తో కలసి ఆయన సంకలనాలను వెలువరించారు. వాటికి ఆయన రాసిన ముందుమాటలు ఆధునిక తెలుగు కథలోని శిల్ప, ఇతివృత్తాల ప్రాధా న్యాన్ని, స్థాయిని అద్భుతంగా ఆవిష్కరించాయి.   

– డా. వైజయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement