తుపాను బాధితులకు ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సాయం
విశాఖపట్నం: వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్, వారెవ్వా ఫ్రెండ్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తుపాను బాధితులకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జ్ఞానాపురం, హెచ్‌బీ కాలనీ, భీమిలి తదితర ప్రాంతాల్లోని తుపాను బాధితులకు ఒక్కొక్కరికి రూ.1,600 విలువైన బియ్యం, నిత్యావసర సరకులు, దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. సింహాద్రిపురంలో జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ గీతా థామస్‌రెడ్డి మాట్లాడుతూ హుదూద్ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని గమనించి తమ ఫౌండేషన్, వారెవ్వా సంస్థ సంయుక్తంగా ఇంటర్నెట్‌లో దాతల సాయం కోరినట్టు తెలిపారు. దాతల నుంచి సుమారు రూ.18 లక్షలు వచ్చాయని, ఆ సొమ్ముతో 1,200 మంది కి సాయం అందజేస్తున్నట్టు చెప్పారు.
వారెవ్వా సంస్థ వ్యస్థాపకుడు, ప్రముఖ పాకశాస్త్ర నిపుణుడు సంజయ్ తుమ్మా మాట్లాడుతూ ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ తలపెట్టన కార్యక్రమంలో తమవంతు సాయం అందిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. తుపాను విధ్వంసాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలియజేసి దాతల సాయం కోరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పరిణితారెడ్డి, వై.జె.రెడ్డి, ఫాదర్ బాలసౌరి, అన్నంరెడ్డి రవి తదితరులు పాల్గొన్నారు.