తెనాలి అమ్మాయి... జర్మనీ అబ్బాయి..
వివాహ బంధానికి ఎల్లలు లేవనే నిజం మరోసారి రుజువైంది. మనసుకు నచ్చిన అమ్మాయిని.. ఖండాలు దాటి వచ్చి మరీ మూడుముళ్ళ బంధంతో ఒక్కటి చేసుకున్నాడా యువకుడు. ఈ సంఘటన తెనాలిలో శనివారం తెల్లవారుజామున జరిగింది. తెనాలి చెంచుపేటకు చెందిన పావులూరి సత్యన్నారాయణ, గాయత్రిదేవి దంపతులకు పావని, రాజేష్ అనే ఇద్దరు పిల్లలున్నారు. పావని ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం నాలుగేళ్ల క్రితం జర్మనీ వెళ్లింది. అక్కడ ఆమె పనిచేసే కంపెనీలో జర్మనీకి చెందిన లెన్‌జ్ కొన్‌రాడ్ ష్విష్‌టన్ బర్గ్ కడా ఉద్యోగం చేస్తున్నాడు. పావనిని చూసిన ష్విష్‌టన్ బర్గ్ ఆమెతో జీవితాంతం కలిసి నడవాలని భావించాడు. తన అభిప్రాయాన్ని ఆమెకు తెలియజేశాడు. తన తల్లిదండ్రులు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని పావని తెలిపింది.
వెంటనే బర్గ్ తన తల్లిదండ్రులైన క్లవ్‌స్ ష్విష్‌టన్ బర్గ్, మార్టిన్ ఎఫ్ మర్ట్‌లకు ముందుగా తెలియజేశాడు. ఒక్కగానొక్క కుమారుడి కోరికను మన్నించిన వారు తెనాలిలోని పావని తల్లిదండ్రులను సంప్రదించారు. వారితో మాట్లాడి వారిని పెళ్లికి ఒప్పించారు. ఇరు కుటుంబసభ్యుల అంగీకారంతో స్థానిక చెంచుపేటలోని చావాస్ గ్రాండ్‌లో శనివారం తెల్లవారుజామున 2.39 నిమిషాలకు హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేయించేందుకు నిశ్చయించారు. దీంతో అబ్బాయి తల్లిదండ్రులు తెనాలి వచ్చి వేదమంత్రాల నడుమ వారిని ఒక్కటిగా చేశారు. వివాహం కనుల పండువగా జరిగింది.