
ప్రభుత్వమే ‘అడ్డుగోడ'
కర్నూలు రూరల్:
హంద్రీ, తుంగభద్ర నదుల వరదల నుంచి నగర ప్రజలకు ముప్పును తప్పించే నాథుడే కనిపించడం లేదు. వైఎస్‌ఆర్ హాయంలో మంజూరైన వరద రక్షణ గోడ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మంజూరైన పనులకు తెలుగుదేశం ప్రభుత్వం లోటు బడ్జెట్ అంటూ నిధులు విడుదల చేయలేదు. 2008 సంవత్సరంలో వచ్చిన హంద్రీ వరదలు నగర ప్రజలకు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి.
నాడు బాధితులను పరామర్శించేందుకు వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ నాటి పరిస్థితులను చూసి చలించారు. నగరం చుట్టూ వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు రక్షణ గోడ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ‘గోటె’ అనే కన్సల్టెన్సీ ద్వారా సర్వే చేయించి .. ఇచ్చిన నివేదికల ఆధారంగా రూ.244.70 కోట్ల నిధులను మంజూరు చేసి, 2008 డిసెంబరులో జిల్లా మ్యుజియం ఎదుట శంకుస్థాపన చేశారు.
వైఎస్‌ఆర్ మరణం అనంతరం రక్షణ గోడ నిర్మాణాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వరద రక్షణ గోడ నిర్మించడం ప్రభుత్వానికి భారమవుతుందనే ఉద్దేశంతోనే రద్దు చేసి అవసరమైనప్పుడు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనికి తోడు అధికారులు హంద్రీనది ఎంత విస్తీర్ణంలో ఉంది..వెడల్పు ఎంత..నది భూములను ఎక్కడేక్కడ ఆక్రమణకు గురయ్యాయే ముందస్తుగా గుర్తించకుండానే అంచన వ్యయాలను వేయడంతో టెక్నికల్‌గా కూడా నిధుల మంజూరికి అడ్డుగా మారినట్లు తెలిసింది.
ఇప్పటి వరకు నాలుగు సార్లు ప్రతిపాదనలు చేశారు. రాష్ట్ర విభజన తరువాత కూడా ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి అధికారులు కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఆగస్టు నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ. 25 కోట్లు కేటాయించాలని అధికారులు చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం పైసా కూడా కేటాయించలేదు.
ట్రాఫిక్ మళ్లింపునకు వంతెనల నిర్మాణం
నగరంలో వాహనాల రద్దీ పెరుగుతుండటంతో ట్రాఫిక్‌ను మళ్లించేందుకు హంద్రీ నదిపై మూడు వంతెలను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారుల సమాచారం. హంద్రీనది 3.6 కి.మీ దగ్గర స్విమ్మింగ్‌పూల్ సమీపం నుంచి నది ఆవలవైపు ఉన్న ఆనంద్ సినీ కాంప్లెక్స్ వరకు (కేసీ కెనాల్‌కు అనుసంధానంగా) నిర్మించేందుకు రూ.18.92 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అలాగే హంద్రీ 0.875 కి.మీ దగ్గర ( జమ్మిచెట్టు) నుంచి జొహరాపురానికి వెళ్లే క్రాస్ వంతెనకు రూ.13.90 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. కిడ్స్‌వరల్డ్ దగ్గర వంతెన నిర్మాణానికి సుమారు రూ. 15 కోట్లతో ప్రతిపాదించారు.