కొవ్వూరు ఆర్టీసీ డిపోకు మోక్షం | Kovvur rtc toDepot of salvation | Sakshi
Sakshi News home page

కొవ్వూరు ఆర్టీసీ డిపోకు మోక్షం

Published Tue, Oct 21 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

కొవ్వూరు ఆర్టీసీ డిపోకు మోక్షం

కొవ్వూరు ఆర్టీసీ డిపోకు మోక్షం

* ఆర్టీసీ కేంద్ర కార్యాలయం అనుమతి  
 * 54 బస్సులు కేటాయింపు
* రీజియన్ మేనేజర్ రామారావు వెల్లడి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :  కొవ్వూరు ప్రజల చిరకాల స్వప్నం త్వరలో సాకారం కానుంది. డిపోను తిరిగి ప్రారంభించడానికి ఆర్టీసీ కేంద్ర కార్యాలయం ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. దీంతో డిపోను తెరిచి ప్రజలకు సేవలందించడానికి ఆర్టీసీ ‘పశ్చిమ’ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ డిపో ద్వారా సేవలందించడానికి 54 బస్సులను సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ పశ్చిమ రీజియన్ మేనేజర్ ఆర్.రామారావు తెలిపారు. 44 బస్సులను పల్లెవెలుగు సర్వీసులుగా, 4 బస్సులను ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా, మరో 4 డీలక్స్ సర్వీసులుగా, 2 బస్సులను సూపర్ లగ్జరీ సర్వీసులుగా నిర్వహించనున్నట్టు చెప్పారు. 54లో 19 బస్సులను రాజమండ్రి డిపో నుంచి, 11 బస్సులను తణుకు డిపో నుంచి, 10 బస్సులను ఏలూరు డిపో నుంచి, 5 బస్సులను జంగారెడ్డిగూడెం డిపో నుంచి, 6 బస్సులను నరసాపురం డిపో నుంచి, 3 బస్సులను అమలాపురం డిపో నుంచి కేటాయిస్తున్నట్టు చెప్పారు.
 
2006లో మూసివేత
1960 దశాబ్దంలో కొవ్వూరు ఆర్టీసీ డిపోను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2006 ఆగస్టు 10న నష్టాల పేరుతో అప్పటి ప్రభుత్వం జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు డిపోలను మూసివేసింది. దీంతో కొవ్వూరు ప్రాంత ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. ఇతర డిపోల బస్సులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లో ప్రయాణికులు ఎక్కువగా ఆటోలు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించేవారు. డిపో మూసివేసిన నాటి నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలు తెరిపించడానికి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు వారి పోరాటం ఫలించింది.
 
కాంట్రాక్టు కార్మికులకు వరం
త్వరలో తెరుచుకోనున్న కొవ్వూరు డిపో కాంట్రాక్టు కార్మికులకు వరంగా పరిణమించనుంది. ఈ డిపో పునరుద్ధరించడానికి 54 బస్సులకుగాను బస్సు ఒక్కింటికి ఐదుగురు సిబ్బంది అవసరమవుతారని రామారావు తెలిపారు. ఒక్కో బస్సుకు 2.6 చొప్పున కండక్టర్లు, డ్రైవర్లు అవసరంకాగా ఆ నిష్పత్తిలో 57 మంది డ్రైవర్లు, 57 మంది కండక్టర్లను తీసుకుంటామని ఆయన చెప్పారు. వీరిలో 2012 సంవత్సరంలోపు కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకున్న దాదాపు అందరు డ్రైవర్లు, కండక్టర్లు రెగ్యులరైజ్ కానున్నారని వివరించారు.
 
టెండర్ల ఆహ్వానం
కొవ్వూరు ఆర్టీసీ డిపోను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో ఆ డిపోకు అవసరమెన అన్ని హంగులు కల్పించడానికి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించినట్టు రామారావు చెప్పారు. డిపో ప్రాంగణంలో పెరిగిపోయిన చెట్లు, మొక్కలను తొలగించడానికి, గోడలకు మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు టెండర్లు ఆహ్వానించామని, ఈ నెల 22న టెండర్లను తెరిచి పనులను అప్పగించనున్నట్టు చెప్పారు. అలాగే గ్యారేజీ నిర్వహణకు అవసరమైన టూల్ కిట్లను కూడా కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలోని వివిధ డిపోల్లో పనిచేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లలో కొవ్వూరు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
 
కార్మిక నాయకుల హర్షం
కొవ్వూరు డిపోను తెరిచేందుకు అనుమతి లభించడంపై పలువురు కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.సూర్య చంద్రరావు, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ సుందరయ్య, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.పుల్లయ్య, టి.పట్టాభిరామ్ దొర వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement