
పట్టు వదిలారు
లేఅవుట్ తీర్మానం రద్దుకు పాలకపక్షం నిర్ణయం
ఉల్లంఘనలు లేవంటున్న కమిషనర్
పట్టుబిగిస్తున్న ప్రతిపక్షం
విజయవాడ సెంట్రల్ : శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లేఅవుట్ రిలీజ్ వ్యవహారంలో పీటముడి పడింది. కౌన్సిల్‌లో హడావుడిగా తీర్మానాన్ని ఆమోదించి చిక్కుల్లోపడిన పాలకపక్షం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. త్వరలో నిర్వహించనున్న అత్యవసర సమావేశాన్ని ఇందుకు వేదికగా మలచుకోవాలని నిర్ణయించింది. గతంలో చేసిన తీర్మానాన్ని ఆమోదిస్తే భవిష్యత్‌లో సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంచనా కడుతున్నారు. లేఅవుట్ నిబంధనల ప్రకారం పదిశాతం స్థలం కంటే తక్కువ ఉన్న వారంతా ఇదే విధానాన్ని అమలు చేయమని డిమాండ్ చేసే అవకాశం ఉంది.
ఇదే జరిగితే మునిసిపల్ చట్టాలు అపహాస్యం పాలయ్యే ప్రమాదం ఉంది. ఈ నిబంధనలను సాకుగా చూపి ఇప్పటికీ నగరంలో కొన్ని స్థలాలను కార్పొరేషన్ స్వాధీనం చేశారు. కొసమెరుపు ఏమిటంటే.. అసమ్మతి నేత ఈ సమావేశానికి గైర్హాజరు కావడమే. అసమ్మతి నేతపై మేయర్ వర్గం ఎదురుదాడికి దిగిన విషయం విదితమే. సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఒక కార్పొరేటరే అసమ్మతికి ఆజ్యం పోస్తున్నారని, ఆయన వ్యవహారశైలిని ఆధారాలతో సహా అధిష్టానానికి మేయర్ వర్గం పంపింది. ఈక్రమంలో అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం. కార్పొరేటర్ల వ్యవహారశైలిపై ఇంటెలిజెన్స్ నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. టాక్ ఆఫ్ ది సిటీగా మారిన సొసైటీ భూముల వ్యవహారానికి త్వరలోనే తెరదించాలని హైకమాండ్ ఆదేశించినట్లు పార్టీశ్రేణుల ద్వారా తెలుస్తోంది.
ఎలాంటి విచారణకైనా సిద్ధం
సొసైటీ భూముల లేఅవుట్ రిలీజ్ వ్యవహారంలో ఎలాంటి తప్పు చేయలేదని ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమేనన్నారు. త్వరలోనే అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి చర్చిస్తామని చెప్పారు. ఏం చేయాలనేదానిపై ఆ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. 88(కె) ప్రకారం కమిషనర్ ప్రతిపాదన చేశారు కాబట్టే కౌన్సిల్‌కు ఆ అంశం వచ్చిందని తెలిపారు. పూర్తిగా అవగాహన లేకపోవడం వల్లే ఆమోదించామని, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ చర్చ పెడతామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు నెలిబండ్ల బాలస్వామి, ఎన్.జగదీష్, త్రిమూర్తిరాజు, మహేష్, కె.దుర్గాభవాని, కె.శైలజ, బి.ఉమామహేశ్వరి, పి.జగదాంబ, పి.తులసి తదితరులు పాల్గొన్నారు.