
సాక్షి, హైదరాబాద్ : కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన నర్రెడ్డి శివరామిరెడ్డి సతీమణి కొండమ్మ గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఆమె కుమార్తె భగీరథీ ఇంట్లో కన్నుమూశారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం సోమిరెడ్డిపల్లె గ్రామంలో జన్మించిన కొండమ్మకు 1947లో శివరామిరెడ్డితో వివాహమైంది. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉన్న కాలంలో 1949 అక్టోబర్ 1న వీరపునాయునిపల్లె మండలం, యూరాజుపాలెం గ్రామంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన కమ్యూనిస్టు కుటుంబాల్లో, ప్రజల్లో ఆమె ధైర్యం నింపారు. ఇతరనాయకురాళ్లతో కలసి మహిళా ఉద్యమాన్ని నిర్మించారు.
పార్టీ సాయుధ పోరాటానికి అవసరమైన ఆయుధాలను కొనేందుకు తన మెడలోని బంగారు నగల్ని విరాళంగా ఇచ్చారు. సాయుధ పోరాటంలో ఆర్థికంగా చితికిపోయిన కామ్రేడ్ల కుటుంబాలను ఆదుకోవడానికి తనవంతు వాటాకు వచ్చిన ఆస్తిని అమ్మి ఆర్థిక సహాయం అందించే అంశంలోనూ, దుర్భర దారిద్య్రాన్ని గడిపిన సందర్భంలోనూ భర్తకు ఆమె అండగా నిలిచారు. కమ్యూనిస్టు ఉద్యమానికి నర్రెడ్డి కొండమ్మ సేవలు మరువలేనివని హైదరాబాద్ కొండమ్మ పార్థీవదేహం వద్ద నివాళులర్పించిన సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment