జాతీయస్థాయి క్రికెట్ స్టేడియాలు సిద్ధం
త్రిలోచనాపురం (ఇబ్రహీంపట్నం) : నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో క్రీడాభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ఇబ్రహీంపట్నంలోని త్రిలోచనాపురంలో రెండు జాతీయస్థాయి క్రికెట్ స్టేడియాలు దాదాపు సిద్ధమయ్యాయి. కృష్ణానదికి అవతల వైపున రాజధాని నిర్మాణం జరగనుండగా, నదికి ఇవతల వైపున విజయవాడ నగరానికి అతిసమీపంలో ఈ క్రికెట్ స్టేడియాలు నిర్మిస్తున్నారు.
మే రెండు నుంచి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లు
మే రెండో తేదీ నుంచి ఇక్కడ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13 ఎకరాల్లో నిర్మాణం జరుపుకొంటున్న క్రికెట్ స్టేడియాల్లో ఒక గ్రౌండ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. రెండో స్టేడియంలో పిచ్‌ల నిర్మాణం జరిగింది. పే ్లగ్రౌండ్‌లో పచ్చదనాన్ని నింపాల్సి ఉంది. పిచ్‌ల ఏర్పాటుకు వివిధ ప్రాంతాల నుంచి బ్లాక్, రెడ్‌సాయిల్‌ను తీసుకువచ్చారు. క్రికెటర్లకు అందుబాటులో ఉండేందుకు ఒక్కో గ్రౌండ్‌లో ఏడు పిచ్‌లు ఏర్పాటు చేశారు.
సకల సౌకర్యాలు
ఇక్కడ రంజీ మ్యాచ్‌లతో పాటు జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు మార్గం సులువైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కార్పొరేషన్‌కు చెందినది కావడంతో పోటీల నిర్వహణకు అనేక ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు అసోసియేషన్ సొంత స్టేడియాల్లో క్రికెట్ పోటీల నిర్వహణతో పాటు జాతీయస్థాయి క్రీడాకారులకు
అత్యుత్తమ శిక్షణ ఇక్కడ ఇవ్వనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ జిల్లా సహాయ కార్యదర్శి కె. మురలేశ్వరరావు తెలిపారు. జాతీయస్థాయి క్రీడాకారుల శిక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏసీ రూమ్‌లు, కిచెన్, డైనింగ్ హాల్, ఎంపైర్ రూమ్స్, స్విమ్మింగ్‌ఫూల్, జిమ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మాణమైన ఈ స్టేడియాలు కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్‌కు అప్పగించనున్నామని ఆయన తెలిపారు.