వచ్చే ఏడాది భారత్‌లో రెండు స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడనున్న ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా
ప్రత్యర్థులుగా ఖతర్, జపాన్ జట్లు!
కేరళ క్రీడల మంత్రి వెల్లడి
తిరువనంతపురం: అంతా అనుకున్నట్లు జరిగితే... భారత క్రీడాభిమానులు, కేరళ ఫుట్‌బాల్ ప్రేమికులు ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా జట్టు ఆటగాళ్ల విన్యాసాలు ప్రత్యక్షంగా చూస్తారు. రెండు అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడేందుకు... స్టార్ స్ట్రయికర్ లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు వచ్చే ఏడాది కేరళకు రానుందని ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అబ్దుల్ రహమాన్ బుధవారం ప్రకటించారు. ఈ మ్యాచ్‌లను కేరళ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని... వేదికతో పాటు, ప్రత్యర్థి జట్లు ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు.
ప్రస్తుతానికైతే ఖతర్, జపాన్ జట్లను ఆహ్వానించాలనే ఆలోచన ఉందని ఆయన వివరించారు. ‘ఫుట్‌బాల్ స్టార్ మెస్సీతో కూడిన ప్రపంచ నంబర్‌వన్ ఫుట్‌బాల్ జట్టు అర్జెంటీనా వచ్చే ఏడాది కేరళకు రానుంది. ఆ జట్టు ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. దీనిపై అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘంతో కలిసి త్వరలోనే సంయుక్త ప్రకటన విడుదల చేస్తాం’ అని రహమాన్ పేర్కొన్నారు. ఇటీవల స్పెయిన్ పర్యటన సందర్భంగా అర్జెంటీనా జాతీయ జట్టును ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.
దీనికి ఆ జట్టు నుంచి సానుకూల స్పందన వచ్చిందని... త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వస్తుందని అన్నారు. మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లు, భద్రత తదితర అంశాలను ప్రభుత్వమే పర్యవేక్షిస్తుందని మంత్రి చెప్పారు. అయితే తమ షెడ్యూల్ ప్రకారం అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘమే భారత పర్యటనకు సంబంధించిన తేదీలను వెల్లడించనుందని పేర్కొన్నారు. అర్జెంటీనా ఆడనున్న మ్యాచ్‌ను ప్రత్యక్షంగా 50 వేల మంది అభిమానులు చూసేలా ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.
ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను నిర్వహించే శక్తి సామర్థ్యాలు కేరళ ప్రభుత్వానికి ఉన్నాయని రహమాన్ పేర్కొన్నారు. రెండు మ్యాచ్‌ల నిర్వహణకు రూ. 100 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ మొత్తాన్ని స్పాన్సర్ల ద్వారా సమకూరుస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment