కబ్జాల చెరలో సొసైటీ స్థలాలు | Society to take the places of exile | Sakshi
Sakshi News home page

కబ్జాల చెరలో సొసైటీ స్థలాలు

Published Wed, Dec 3 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

Society to take the places of exile

 పాలకొండ:డివిజన్ కేంద్రం, నగర పంచాయతీ అయిన పాలకొండలో నానాటికీ ఇళ్ల స్థలాలకు పెరుగుతున్న డిమాండ్ ఖాళీ స్థలాల కబ్జాకు దారితీస్తోంది. ప్రైవేట్, ప్రభుత్వ అన్న తేడా లేకుండా కబ్జాల పర్వం కొనసాగుతోంది. అదే క్రమంలో జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థకు చెందిన స్థలాలు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పట్టణంలో ఈ సంస్థకు రూ.కోట్ల విలువైన స్థలాలున్నాయి. దశాబ్దాల క్రితం వీటిని వినియోగించిన ఆ సంస్థ గత కొంతకాలంగా నిరుపయోగంగా వదిలేసింది. నాగవంశపువీధి జంక్షన్‌లోని సుమారు ఎకరా ఖాళీ స్థలంతో పాటు పాలకొండ-శ్రీకాకుళం ప్రధాన రహదారికి ఆనుకొని తహశీల్దార్ కార్యాలయం ఎదుట సుమారు 50 సెంట్లు, జగన్నాథస్వామి ఆలయ సమీపంలో సుమారు ఒకటిన్నర ఎకరాల స్థలాలు ఈ సంస్థకు ఉన్నాయి.
 
 పస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం వీటి విలువ రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నిరుపయోగంగా ఉన్న ఈ స్థలాలపై పలుకుబడి ఉన్న కొందరు వ్యక్తుల కన్ను పడింది. ఇప్పటికే నాగవంశపువీధి కూడలిలో ఉన్న గొడౌన్ స్థలాన్ని ఓ పక్క నుంచి ఆక్రమణదారులు కబ్జా చేయడం ప్రారంభించారు.ఇదే అదునుగా అధికార పార్టీ అండదండలు ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ జాగాను సొంతం చేసుకొనేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. మరోవైపు జగన్నాథస్వామి ఆలయ సమీపంలో ఉన్న స్థలంలో ఇప్పటికే 30 సెంట్ల వరకు ఆక్రమణలో ఉంది. అలాగే అత్యంత విలువైన తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న స్థలంలోనూ ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. ఈ స్థలాన్ని పలు ప్రభుత్వ కార్యాలయాలకు లేదా క్వార్టర్లకు వినియోగించేలా కొన్ని శాఖల అధికారులు ముమ్మర ప్రయత్నాలు  చేస్తున్నారు. డీసీఎంఎస్ అధికారులు మేల్కొనకపోతే స్థలాలు పూర్తిగా అన్యాక్రాంతమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
 
 సమన్వయలోపం
 స్థలాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా తమ స్థలాలు ఎక్కడున్నాయి, వాటి పరిస్థితి ఏమిటి, ఆక్రమణల పర్వం తదితర అంశాలపై డీసీఎంఎస్ అధికారుల వద్దే పూర్తి సమాచారం లేదు. గత ఐదేళ్లుగా నాగవంశపు వీధి కూడలిలో ఉన్న స్థలంలో రైతు బజారు ఏర్పాటు చేయాలన్న యోచన ఉన్నా అది కార్యరూపం దాల్చలేదు. పైగా ఈ స్థలాలకు సంబంధించి రెవెన్యూ అధికారులకు ఎటువంటి సమాచారం లేదు. వీటి ఆక్రమణలను ఎవరు అడ్డుకోవాలన్న దానిపైనా స్పష్టత కొరవడింది. సొంతంగా ఆస్తులను పరిరక్షించుకునే యంత్రాంగం లేదని డీసీఎంఎస్ ఈ విషయంలో పలుమార్లు రెవెన్యూ అధికారులనే ఆశ్రయించింది. అయినా పెద్దగా చర్యలు లేవు. పోనీ వీటి నిరుపయోగంగా వదిలేయకుండా కనీసం లీజు రూపంలో వ్యాపారవర్గాలకు అప్పగిస్తే కొంత ఆదాయమైనా సమకూరుతుంది. ఇదే సమయంలో సరిహద్దులు గుర్తించి కంచెలాంటివి ఏర్పాటు చేస్తే అక్రమార్కుల బారీ నుంచి కాపాడుకొనే అవకాశం ఉంటుంది. ఈ దిశగా డీసీఎంఎస్ అధికారులు దృష్టి సారించడం లేదు.
 

Advertisement

పోల్

Advertisement