మహబూబ్నగర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో నిద్రిస్తున్నఓ మహిళ వద్ద నుంచి 8 నెలల పసికందును ఆగంతకులు అపహరించుకుని పోయారు.
పాలమూరు జిల్లా బస్టాండ్‌లో ఎనిమిది నెలలు బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. పాల్ కొండ తండాకు చెందిన గిరిజన మహిళ శారద, తన ఇద్దరు కొడుకులతో కలిసి మహబూబ్ నగర్ బస్టాండ్‌కు తెల్లవారుజామున చేరుకుంది. ఆ సమయంలో తండాకు వెళ్లడానికి వీలుకాకపోవడంతో బస్టాండ్‌లోనే ఉండిపోయింది. ఆమె పక్కనే ముగ్గురు గుర్తు తెలియని మహిళలు, తమకు బాబును ఇచ్చేయమని బలవంతం చేశారు. శారద ఇవ్వననడంతో వాగ్వాదానికి దిగారు.
కాసేపయ్యాక వారు వెళ్లిపోవడంతో పిల్లలు సహా శారద అక్కడే నిద్రపోయింది. తెల్లారి లేచి చూసేసరికి, బాబు కనిపించలేదు. దీంతో శారద కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తన భర్త ఉపాధి నిమిత్తం ముంబయిలో ఉంటారని, తాను తండాలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నానని చెబుతోంది. తన బిడ్డను వెదికి తెచ్చియమని దీనంగా వేడుకుంటోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు విచారిస్తున్నారు.