పోస్టల్ ఏటీఎంలు వచ్చాయ్
చెన్నై: దేశంలోనే తొలి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఏటీఎం గురువారం నుండి అందుబాటులోకి వచ్చింది. పోస్టల్ శాఖ ఆధునీకరణలో భాగంగా చెన్నైలోని త్యాగరాయనగర్ హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎం సర్వీస్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం ప్రారంభించారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా ఆధునీకరించడానికి మధ్యంతర బడ్జెట్లో రూ.4,909 కోట్లు కేటాయించామని ఈ సందర్భంగా చిదంబరం గుర్తు చేశారు.
ఐటీ ఆధునీకరణ స్కీమ్ కింద వచ్చే ఏడాది కల్లా 1.55 లక్షల పోస్ట్ ఆఫీసులను కవర్ చేస్తామని వివరించారు. ఉత్తరాలు, పోస్ట్‌కార్డ్‌ల వినియోగం తగ్గడంతో పోస్ట్ ఆఫీసుల భవిష్యత్తులపై సందేహాలు ముసురుకున్నాయని, కాని కొత్త కొత్త వ్యూహాలను అమలు చేయడంతో వీటి భవిష్యత్తుకేమీ ఢోకా లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఇప్పటికీ పార్సిళ్ల బట్వాడాకు పోస్టల్ డిపార్ట్‌మెంటే ఉత్తమమైనదని పలువురు భావిస్తున్నారని పేర్కొన్నారు.
కాగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ త్వరలో ఢిల్లీ, ముంబైల్లో మరో నాలుగు ఏటీఎంలను ప్రారంభించనున్నది. ఈ ఏడాది 1400, వచ్చే ఏడాది 1800 ఏటీఎంలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. పోస్ట్ ఆఫీసుల్లో కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్(సీబీఎస్) అమలు చేయడానికి రూ. 700 కోట్లు కేటాయించామని పేర్కొంది.