రికవరీ సంకేతాలు కనబడుతున్నాయ్.. | Getting signs of recovery | Sakshi

రికవరీ సంకేతాలు కనబడుతున్నాయ్..

Published Mon, Aug 10 2015 2:20 AM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM

రికవరీ సంకేతాలు కనబడుతున్నాయ్..

రికవరీ సంకేతాలు కనబడుతున్నాయ్..

- ప్రభుత్వ పాలసీ చర్యల ప్రభావం
- సీఐఐ-ఆస్కాన్ సర్వే నివేదిక
న్యూఢిల్లీ:
దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని.. అయితే, ఇది కాస్త మందకొడిగానే ఉన్నప్పటికీ రికవరీ సంకేతాలు మాత్రం కనబడుతున్నాయని తాజా సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీ నిర్ణయాలు, వాటి అమలుతో పాటు వ్యాపార, వినియోగదారుల విశ్వాసం మెరుగుపడుతుండటం వంటివి టర్న్‌ఎరౌండ్‌కు తోడ్పాటునందిస్తున్నాయని భారత పరిశ్రమల సమాఖ్య అసోసియేషన్స్ కౌన్సిల్(సీఐఐ-ఆస్కాన్) సర్వే నివేదిక పేర్కొంది. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక సంఘాల నుంచి ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా నివేదికను రూపొందించినట్లు సీఐఐ- ఆస్కాన్ చైర్మన్ నౌషద్ ఫోర్బ్స్ చెప్పారు.

ఇంకా కొంత మందగమన ధోరణి నెలకొన్నప్పటికీ.. పారిశ్రామికాభివృద్ధి క్రమంగా పురోగమిస్తుండటం సానుకూల పరిణామమని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడినట్లు ఆయన వెల్లడించారు. సమీప కాలంలో వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా నివేదిక తెలిపింది. వృద్ధి దిగజారుతుందంటూ గతేడాది ఇదే కాలంలో అనేక రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులు పేర్కొనగా.. ఇప్పుడు అతికొద్ది రంగాలు మాత్రమే ఈ విధమైన ధోరణి ఉండొచ్చని అంచనా వేయడం గమనార్హం.
 
జూన్ క్వార్టర్(క్యూ1)లో అమ్మకాలు, ఉత్పాదకత, ఎగుమతుల ధోరణి చాలా బాగుందని(వృద్ధి 20 శాతం పైగానే) 16.1 శాతం రంగాల నుంచి అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తం 93 పారిశ్రామిక రంగాలు సర్వేలో పాల్గొన్నాయి. గతేడాది జూన్ త్రైమాసికంలో ఇది 7.1 శాతం మాత్రమే. గతేడాది క్యూ1లో బాగుంది(వృద్ధి 10-20 శాతం) అన్న అభిప్రాయం 14.3 శాతంగా ఉండగా.. ఇప్పుడు 9.3 శాతానికి తగ్గిపోయింది. అయితే, ప్రతికూల వృద్ధి అంచనాలు 26.9 శాతం నుంచి 23.6 శాతానికి దిగిరావడం విశేషం.

వ్యాపార వృద్ధి ప్రతిబంధకంగా మారుతున్న అంశాల్లో తీవ్రమైన పోటీ, చౌక దిగుమతులు, విద్యుత్ కొరత, నియంత్రణపరమైన ఇబ్బందులు, దేశీయంగా, ఎగుమతులకు కూడా తగిన డిమాండ్ లేకపోవడం, నిపుణులైన కార్మికుల కొరత, అధిక పన్నులు ప్రధానంగా ఉన్నాయని సర్వేలో 50 శాతం అభిప్రాయపడ్డారు. అధిక వడ్డీరేట్లు, రవాణా ఇతరత్రా మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఇబ్బందులు వంటివి కూడా కొంతమేర వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని వారు అంటున్నారు.
 
అయితే, రికవరీ నిలదొక్కుకోవాలంటే డిమాండ్, పెట్టుబడులు పుంజుకోవాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక ప్రతినిధులు స్పష్టం చేశారు. వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ), భూసేకరణ చట్టం వంటి కీలక సంస్కరణల అమల్లో పురోగతి కూడా ఇన్వెస్టర్లల్లో మరింత స్పష్టత తీసుకొస్తుందని సర్వే నివేదిక పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement