బంగారు భారత్..! | India Biggest Gold Consumer, Overtakes China: Survey | Sakshi
Sakshi News home page

బంగారు భారత్..!

Published Wed, Oct 28 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM

బంగారు భారత్..!

బంగారు భారత్..!

పసిడి వినియోగంలో మరోసారి అగ్రస్థానం
* చైనాను మళ్లీ దాటిన ఇండియా
* 9 నెలల్లో 642 టన్నుల వినియోగం
ముంబై: ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో సుమారు 642 టన్నుల పసిడి వినియోగంతో చైనాను అధిగమించి మరోసారి ఫస్ట్ ప్లేస్‌లో నిల్చింది. 579 టన్నుల బంగారం వినియోగంతో చైనా రెండో స్థానంతో సరిపెట్టుకుంది.  

గోల్డ్ సర్వే క్యూ3 2015 సమీక్ష, అంచనాల పేరిట రూపొందిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మీడియా దిగ్గజం థామ్సన్ రాయిటర్స్‌లో భాగమైన జీఎఫ్‌ఎంఎస్ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం భారత్‌లో ఆభరణాల వినియోగం క్రితం ఏడాది క్యూ3తో పోలిస్తే ఈసారి మూడో త్రైమాసికంలో 5 శాతం పెరిగి 193 టన్నులుగా నమోదైంది. 2008 తర్వాత మూడో త్రైమాసికంలో ఇంత ఎక్కువగా డిమాండ్ కనిపించడం ఇదే ప్రథమం.

2011 ఆగస్టు తర్వాత పసిడి ధరలు అత్యంత తక్కువ స్థాయికి పడిపోవడంతో క్యూ3లో పసిడికి డిమాండ్ పెరిగిందని నివేదిక వివరించింది. ఫలితంగా మూడో త్రైమాసికంలో బంగారం దిగుమతులు 23 శాతం ఎగిసి 263 టన్నులుగా నమోదైంది. మరోవైపు, సరఫరా విషయానికొస్తే మూడో త్రైమాసికంలో అంతర్జాతీయంగా పసిడి ఉత్పత్తి కేవలం ఒక్క శాతమే పెరుగుదలతో సుమారు 851 టన్నులకు పరిమితమైంది.
 
1,100 డాలర్ల దిగువకే పరిమితం..
ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో పసిడి ధర అంతర్జాతీయంగా ఔన్సుకు (31.1 గ్రాములు) 1,100 డాలర్ల కన్నా దిగువనే కదలాడవచ్చని నివేదిక అంచనా వేసింది. దీంతో ఈ ఏడాది  పసిడి సగటు రేటు 1,159 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్ల విషయంలో స్పష్టత వచ్చే దాకా బంగారం ధరలపై ఒత్తిడి కొనసాగవచ్చని తెలిపింది.

ఇక ద్రవ్యోల్బణం తక్కువగా ఉండొచ్చన్న అంచనాలు, విలువైన లోహాలపై ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలహీనంగా ఉండటం వంటి అంశాలు కూడా పసిడి రేట్లపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని నివేదిక తెలిపింది. అయితే, ఏడాది ఆఖర్లో మాత్రం సీజనల్ కొనుగోళ్ల కారణంగా బంగారానికి కొంత మద్దతు లభించవచ్చని, వచ్చే ఏడాది మరింత ప్రకాశించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

Advertisement
Advertisement