భారత్‌కు జపాన్ ఫార్మా కంపెనీలు
భాగస్వామ్యానికి ఇక్కడి కంపెనీలు సిద్ధం
ఫార్మాక్సిల్ డెరైక్టర్ జనరల్ అప్పాజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయ ఔషధ రంగంలో జపాన్ కంపెనీలు అడుగుపెట్టబోతున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఏడాదిలో ఇది కార్యరూపంలోకి రానుంది. భారత ఔషధ ఎగుమతులను ప్రోత్సహిస్తున్న ఫార్మాక్సిల్... కొన్నేళ్లుగా జపాన్ దిగ్గజ ఫార్మా సంస్థలతోపాటు ఒసాకా ఫార్మాస్యూటికల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్‌తోనూ ఈ విషయమై చర్చిస్తోంది. జపాన్ సంస్థల ప్రతినిధులు భారత్‌లోని పలు కంపెనీలను సందర్శించారు కూడా. జపాన్‌కు చెందిన 30 కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని ఫార్మాక్సిల్ డెరైక్టర్ జనరల్ పి.వి.అప్పాజీ చెప్పారు. యూబీఎం ఆధ్వర్యంలో బుధవారమిక్కడ ప్రారంభమైన ఫార్మాలిటికా ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. అక్కడి కంపెనీలతో తదుపరి చర్చలు ఈ నెలలోనే ఉన్నాయన్నారు. భారత కంపెనీలతో జాయింట్ వెంచర్లకు ఆస్కారం ఉందన్నారు.
జీవీకే అంశంపై వారంలో నిర్ణయం..
హైదరాబాద్‌కు చెందిన జీవీకే బయో క్లినికల్ పరీక్షలతో సంబంధం ఉన్న 700 ఔషధాలను యూరోపియన్ యూనియన్ కొద్ది రోజుల క్రితం నిషేధించింది. ఈయూ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్న కేంద్ర ప్రభుత్వం... ప్రతిపాదిత భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను వాయిదా వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. జీవీకే-ఈయూ వివాదంపై తదుపరి కార్యాచరణకు సంబంధించి వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుందని అప్పాజీ వెల్లడించారు. ఈయూ బ్యాన్‌తో భారతీయ కంపెనీలు రూ.3,250 కోట్ల విలువైన వ్యాపారం కోల్పోతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.
రూ.700 కోట్లతో మూడు ప్లాంట్లు..
అరబిందో ఫార్మా కొత్తగా మూడు ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. వీటిలో నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద ఓరల్ సాలిడ్ ఫినిష్డ్ డోసేజెస్ ప్లాంటు ఒకటి. యూరోపియన్ మార్కెట్ల కోసం విశాఖపట్నం జిల్లాలో ఓరల్ ఫినిష్డ్ డోసేజెస్ యూనిట్ స్థాపించనుంది. అలాగే సెమి సింథటిక్ పెన్సిలిన్ ప్లాంటు హైదరాబాద్ సమీపంలోని జడ్చర్ల వద్ద నెలకొల్పుతోంది. ఈ మూడు గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్లకు రూ.700 కోట్లు ఖర్చు చేయనున్నట్టు అరబిందో ఫార్మా హోల్‌టైమ్ డెరైక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఏపీఐ ప్లాంట్ల విస్తరణకు రూ.200 కోట్లు పెట్టుబడిగా వెచ్చించనున్నట్లు ఆయన వెల్లడిం చారు. కాగా, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో శంషాబాద్-జడ్చర్ల మార్గంలో ఫార్మెక్సిల్ భారీ ఎగ్జిబిషన్ కేంద్రం ఏర్పాటు కానుంది.