బ్యాంకులకు ఇక 2,4 శనివారాలు సెలవు
సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి..
న్యూఢిల్లీ : లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త! ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాలు సెలవు దినాలుగా ప్రకటించాలన్న ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఇందుకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. దీంతో ఇకపై ప్రతి రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు దినాలుగా ఉంటాయని పేర్కొన్నారు. ఉద్యోగుల పనితీరును మరింతగా మెరుగుపర్చేందుకు ప్రభుత్వ నిర్ణయం ఉపయోగపడగలదని తెలిపారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు శనివారాలు సగం పనిదినాలుగా ఉంటున్నాయి.