మేయర్‌కు అసమ్మతి సెగ
మేయర్‌కు అసమ్మతి సెగ
Published Wed, Aug 31 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
పావులు కదుపుతున్న అసమ్మతి వర్గం
నోరు విప్పని సొంత వర్గం
సీఎం వద్ద పంచాయితీకి ప్రయత్నం
నగరపాలక సంస్థ పాలకవర్గంలో కేఎంకే చిచ్చు రేపింది. మేయర్ కోనేరు శ్రీధర్‌ను పదవి నుంచి తప్పించేందుకు టీడీపీకే చెందిన కార్పొరేటర్లు పావులు కదుపుతున్నారు. అందుకు ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్నట్లు సమాచారం.
విజయవాడ సెంట్రల్ :
మేయర్ కోనేరు శ్రీధర్ ఒంటరి అవుతున్నారు. తన వర్గానికి చెందిన కార్పొరేటర్లు కేఎంకే వ్యవహారంలో నోరు మెదిపేందుకు ధైర్యం చేయడం లేదు. కౌన్సిల్ ఆవిర్భావం నుంచి టీడీపీ ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు మేయర్ కుడిభుజంగా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు మూడు నియోజకవర్గాలకు చెందిన కార్పొరేటర్లు మద్దతుగా నిలిచారు. మేయర్ మార్పునకు సంబంధించి రెండు నెలల క్రితం అసమ్మతి వర్గం సంతకాల సేకరణ చేపట్టగా 12 మంది కార్పొరేటర్లు మేయర్‌కు అండగా నిలబడ్డారు. శ్రీధర్‌పై ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడల్లా హరిబాబు తీవ్రంగా స్పందించేవారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరంతా గప్‌చుప్‌గా ఉండిపోయారు.
రహస్య మంతనాలు
అసమ్మతి వర్గం కార్పొరేటర్లు చురగ్గా పావులు కదుపుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్నారు. రహస్య మంతనాలు సాగించిన అసమ్మతివర్గం బుధవారం ఏ1 కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన పుష్కరాల విజయోత్సవ సభలోనూ మరోమారు భేటీ అయినట్లు సమాచారం. గతంలో మేయర్‌ను మార్చాలంటూ అసమ్మతి వర్గం పట్టుబట్టిన సందర్భంలో ఆయన ఏం అవినీతి చేశారో చెప్పండి అంటూ పశ్చిమ నియోజక వర్గానికి చెందిన ఓ నాయకుడు ప్రశ్నించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఇప్పుడు ఆధారాలతో సహా బయట పడటంతో దీన్ని అస్త్రంగా వాడుకోవాలని భావిస్తున్నారు. పదవుల మార్పు విషయమై పుష్కరాలు అయ్యే వరకు మాట్లాడొద్దంటూ ఎంపీ కేశినేని నాని అసమ్మతి వర్గాన్ని ఇప్పటి వరకు కట్టడి చేస్తూ వచ్చారు. పుష్కరాలు పూర్తవ్వడంతో పాటు మేయర్ కే ఎంకే వ్యవహారంలో అడ్డంగా బుక్ అవ్వడంతో అసమ్మతి వర్గం నోటికి పని^ ðlబుతున్నారు. కాంట్రాక్ట్ చేయడం తప్పే అంటూ ఇప్పటికే కొందరు కార్పొరేటర్లు బయటపడ్డ విషయం విదితమే.
రివేంజ్..
ఫుడ్, కాంట్రాక్ట్ కార్మికుల సరఫరా పనులను ఎనిమిది మంది టీడీపీ కార్పొరేటర్లు దక్కించుకున్నారు. అయితే బినామీ పేర్లతో పనులు చేశారు. ఓ కార్పొరేటర్ మాత్రం తన మరిది పేరుతో టెండర్ దక్కించుకున్నారు. మేయర్ సతీమణి కోనేరు రమాదేవి కేఎంకే గౌరవ డైరెక్టర్‌గా వ్యవహరించడం అత్యధిక మొత్తంలో కాంట్రాక్ట్ చేయడంతో ఫోకస్ మేయర్‌పైకి వెళ్లింది. శ్రీకనకదుర్గా లేఅవుట్ వ్యవహరంలో ఏకపక్షంగా వ్యవహరించిన మేయర్ విజ్ఞాన యాత్రకు వెళ్లినప్పుడు కావాలనే తమను అల్లరి పాలయ్యేట్లు చేయడంపై కొందరు మహిళా కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. కేఎంకే వ్యవహారాన్ని ఆయుధంగా చేసుకొని మేయర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ద్వారా సీఎం చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు భోగట్టా.
Advertisement