తాడిపూడి.. అందని తడి
తాడిపూడి.. అందని తడి
Published Sat, Aug 27 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
తాడిపూడి ఎత్తిపోతల పథకం మెట్ట ప్రాంత రైతులకు అక్కరకు రావడం లేదు. 2.06 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో రూపకల్పన చేసిన ఈ పథకం ద్వారా కనీసం 60 వేల ఎకరాలకైనా నీరందడం లేదు. ఎగువన దేవరపల్లి ప్రాంతంలో సబ్ లిఫ్ట్ పనులు పూర్తికాకపోవడంతో 20 వేల ఎకరాలు పూర్తిగా బీడువారాయి. దిగువన తాడేపల్లిగూడెం మండలంలో 19 వేల ఎకరాలకు నీరందక వరి ఎండిపోతోంది. తాళ్లపూడి మండలం తాడిపూడిలో దశాబ్దం క్రితం తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. అక్కడ గోదావరి జలాలను తోడి గోపాలపురం వరకు పైప్‌లైన్ ద్వారా సాగునీటిని సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి కాలువల ద్వారా తాడేపల్లిగూడెం మండలంలోని ఆయకట్టు వరకూ కాలువల ద్వారా నీటిని పంపిణీ చేయాల్సి ఉంది. కాలువలను పూర్తిస్థాయిలో తవ్వకపోవడం.. తవ్విన కాలువలు పూడుకుపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు.
తాడేపల్లిగూడెం/దేవరపల్లి : దేవరపల్లి మండలం బందపురం వద్ద తాడిపూడి కాలువపై తాడిపూడి సబ్‌లిఫ్ట్ పనులు అసంపూర్తిగా ఉండటంతో ఎనిమిదేళ్లుగా ఇక్కడి ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఆయకట్టు అంతటికీ ఖరీఫ్‌లో నీటిని విడుదల చేస్తామని రెండేళ్లుగా అధికారులు చెబుతూనే ఉన్నారు. దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో మెరక పొలాలకు సాగునీటి సదుపాయం లేక పొలాలు నిరూపయోగంగా మారాయి. సుమారు 20 వేల ఎకరాలు నీరందక బీడువారాయి. ఈ భూములకు గోదావరి జలాలు ఇవ్వాలనే లక్ష్యంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తాడిపూడి కాలువపై 5వ సబ్‌లిఫ్ట్ నిర్మాణానికి రూ.48 కోట్లు మంజూరు చేశారు. అనంతరం దేవరపల్లి మండలం బందపురం వద్ద కాలువపై సబ్‌లిఫ్ట్ నిర్మాణ పనులు చేపట్టారు. 2012 నాటికి పంపుహౌస్ నిర్మాణం పూర్తిచేసి మోటార్లు ఏర్పాటు చేశారు.
సబ్‌లిఫ్ట్ ద్వారా దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం మండలాల్లో 13 వేల ఎకరాలకు నీరు సరఫరా చేయాల్సి ఉంది. కాలువ నిమిత్తం అవసరమైన భూములిచ్చే రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ఇబ్బందులు ఎదురుకావడంతో పనులు నిలిచిపోయాయి. గత ఏడాది పంప్‌హౌస్ నుంచి బుచ్చియ్యపాలెం వరకు సుమారు 5.30 కిలోమీటర్ల మేర పైపులైన్ వేశారు. అక్కడ నుంచి మూడు డిస్ట్రిబ్యూటర్లను ఏర్పాటు చేసి పొలాలకు సాగునీరు అందించాల్సి ఉంది. 1, 2 డిస్ట్రిబ్యూటర్ల పరిధిలో కాలువ పనులు పూర్తి కాగా, 3వ డిస్ట్రిబ్యూటర్ పరిధిలో కాలువ తవ్వకం పూర్తికావాల్సి ఉంది. డీ1, డీ2 పరిధిలో పనులు పూర్తి కావడంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో సబ్‌లిఫ్ట్ ద్వారా మొదటివిడతగా 5 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అధికారులు జూలైలో ప్రకటించారు. దీంతో రైతులు పంటలు వేశారు. ఇప్పటివరకు లిఫ్ట్ ప్రారంభం కాకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. అధికారుల మాటలు నమ్మి పంటలు వేసి నష్టపోయామని రైతులు కాట్రు సత్యనారాయణ, కాట్రు భీమరాజు, ఉండవల్లి సుబాష్‌చంద్రబోస్ తెలిపారు.
దిగువన పరిస్థితి ఇదీ
ఎత్తిపోతల పథకానికి దిగువన ఉన్న తాడేపల్లిగూడెం మండలంలో 35 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, కేవలం 19 వేల ఎకరాలకు మాత్రమే ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో తవ్విన కాలువలు, బోదెలు పూడుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో బోదెల ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. ఈ పథకం కింద నిరే్ధశించిన ఆయకట్టుకు నీరందకపోగా, కొన్ని చేలు మాత్రం ముంపునకు గురవుతున్నాయి. తాడేపల్లిగూడెం మండలంలోని కడియద్ద, కొమ్ముగూడెం, బంగారుగూడెం, కుంచనపల్లి, మాధవరం, అప్పారావుపేట, ఆరుగొలను, ఆరుళ్ల, జగన్నాథపురం, జగ్గన్నపేట, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ పరిధిలోని కడకట్ల రెవెన్యూ ప్రాంతం, నందమూరు, నవాబ్‌పాలెం, కొండ్రుపోలు, వెంకట్రామన్నగూడెం మీదుగా తాడిపూడి కాలువ వెళుతోంది. సగం తవ్విన కాలువలు, అసంపూర్తిగా ఉన్న బోదెల వల్ల వర్షాలు కురిసినప్పుడల్లా ఆయకట్టులోని పొలాలు ముంపుబారిన పడుతున్నాయి. సాధారణ రోజుల్లో నీరందకపోగా.. వర్షాలు కురిసినప్పుడు ముంపు వెంటాడుతోంది.
బోదెల్ని బాగు చేయాలి
తాడిపూడి బోదెలను పూర్తిస్థాయిలో బాగుచేస్తే సాగునీటికి ఇబ్బంది ఉండదు. నిన్నమొన్నటి వరకూ నీరందక ఇబ్బం దులు పడ్డాం. ఇప్పుడు కాస్త నీరిస్తున్నా సరిపోవడం లేదు. ఇక్కడున్న ఇబ్బందుల్ని పూర్తిగా తొలగించాలి.
– గోతం రాజు, వెంకట్రామన్నగూడెం, తాడేపల్లిగూడెం మండలం
పూర్తిగా నీరు వదలాలి
కాలువకు పూర్తిగా నీరు వదిలితే వ్యవసాయ అవసరాలకు ఇబ్బంది ఉండదు. పూర్తి ఆయకట్టుకు నీరందితే సమస్య తొలగినట్టే.– మరిడి సూర్యచంద్రరావు,
వెంకట్రామన్నగూడెం, తాడేపల్లిగూడెం
సబ్ లిఫ్ట్ ద్వారా నీరిస్తాం
తాడిపూడి 5వ స»Œ æలిఫ్ట్ ద్వారా ఈ ఖరీఫ్ సీజన్‌లో సుమారు 5వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. డీ–1, డీ–2 పరిధిలో కాలువ పనులు పూర్తయ్యాయి. సబ్ లిఫ్ట్ విద్యుత్‌కు సంబం«ధించి అనుమతి రావాల్సి ఉంది. భూసేకరణలో జాప్యం వల్ల కాలువ పనులు ఆలస్యమయ్యాయి. వచ్చే ఏడాది పూర్తిగా సాగునీరు ఇచ్చేందుకు కృషి చేస్తాం. – సీహెచ్ దేవప్రకాష్, ఈఈ, తాడిపూడి ఎత్తిపోతల పధకం
Advertisement
Advertisement