చాన్నాళ్ల తర్వాత ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ మీడియాలో హోరెత్తుతున్నాడు. అమెరికాలోని ‘గుర్తు తెలియని’ జైలునుంచి వీడియో లింక్ ద్వారా ముంబై సెషన్స్ కోర్టు ముందు రెండు రోజులుగా అతడిస్తున్న వాంగ్మూలాలు ముంబై నగరంపై ఎనిమిదేళ్లక్రితం జరిగిన ముష్కరదాడిలో పాకిస్తాన్ ప్రమేయాన్ని మరోసారి ధ్రువీకరిస్తున్నాయి. మూడోరోజైన బుధవారం ఎందుకనో అటువైపు నుంచి సాంకేతిక అవరోధం ఏర్పడింది. ప్రస్తుతం అమెరికాలో 35 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న హెడ్లీ మరికొన్ని రోజులు సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది. అతను వెల్లడిస్తున్న అంశాలు నిజానికి కొత్తవేమీ కాదు.
అయిదారేళ్లుగా అవన్నీ విన్నవే. ముంబై దాడులు జరిగిన ఏడాది తర్వాత...అంటే 2009లో తొలిసారి షికాగోలో హెడ్లీ అరెస్టయ్యాడు. అప్పట్లోనే ముంబై దాడుల పథక రచనలో హెడ్లీ ప్రమేయం, అతనికి పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ అందించిన సహకారం వగైరా అంశాలన్నీ ప్రపంచానికి వెల్లడయ్యాయి. 2010లో మన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు అమెరికా వెళ్లి అతడినుంచి మరిన్ని విషయాలు రాబట్టారు.
ఆ మరు సటి ఏడాది అమెరికా న్యాయస్థానం ముందు సైతం హెడ్లీ ఈ వివరాలన్నీ చెప్పాడు. తమ చిరకాల మిత్ర దేశం గనుకా, దాడులు జరిగింది తమ గడ్డపై కాదు గనుకా ఆ విషయంలో అమెరికా మౌనంగానే ఉండిపోయింది. మన దేశం అడిగి నప్పుడు దర్యాప్తు సంస్థ ముందు చెప్పిన విషయాలకు విలువేమున్నదని పాక్ దబా యించింది. ఇప్పుడు న్యాయస్థానం ముందు హెడ్లీ చెప్పాడు గనుక ఆ దేశం సంజా యిషీ ఇవ్వాల్సిన స్థితిలో పడింది. లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్, కమాం డర్ జాకీవుర్ రెహ్మాన్ లఖ్వీలతోపాటు ఐఎస్‌ఐ అధికారుల ప్రమేయం గురించి కూడా అతను వెల్లడించాక నోరెత్తకుండా కూర్చోవడం పాకిస్తాన్‌కు సాధ్యంకాదు.
పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై గత నెల మొదట్లో ఉగ్రవాదులు దాడి జరిపి సృష్టించిన బీభత్సంపై ఇప్పటికే మన దేశం కీలకమైన సాక్ష్యాధారాలను పాకిస్తాన్‌కు అందించింది. వాటిపై తగిన చర్యలు తీసుకున్నాక ఇరు దేశాలమధ్యా జరగాల్సిన చర్చలు ప్రారంభమవుతాయని కూడా రెండు దేశాలూ నిర్ణయించాయి. ఆ ఉదంతానికి సంబంధించి జైషే మహమ్మద్ సంస్థ స్థావరాలపై దాడులు జరిగాయని, కొంతమందిని అదుపులోకి తీసుకున్నారని వార్తలొచ్చినా అందుకు సంబంధించిన పురోగతి ఏమిటో పాక్ ఇంతవరకూ చెప్పలేదు. ఆ సంస్థ చీఫ్ మసూద్ అజర్‌ను అరెస్టు చేసినట్టు కథనాలు రావడం, చివరికతను గృహ నిర్బంధంలో ఉన్నాడని గుప్పుమనడం కూడా అయింది.
అందుకు సంబంధించి ఇంతవరకూ ఉలకని పాకిస్తాన్‌కు తాజాగా హెడ్లీ చెబుతున్న సాక్ష్యాలు నిస్సందేహంగా మింగుడుపడనివే. హెడ్లీ ఏకకాలంలో అమెరికా మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం ఏజెంటుగా పనిచేశాడు. అటు లష్కరే ఏజెంటుగా ఉన్నాడు. అదే సమయంలో ఐఎస్‌ఐ ఏజెంటుగా వ్యవహరించాడు. ఇదంతా రెండు దశాబ్దాలపాటు కొనసాగించాడు. ముంబై దాడులకు ముందు ఏడుసార్లు, ఆ తర్వాత ఒకసారి మన దేశానికొచ్చాడు. తన గురించి అనుమానం రాకుండా ఉండేందుకు వీసా దరఖాస్తులో అన్నీ తప్పుడు వివరాలిచ్చాడు.
ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. 2009 నుంచి హెడ్లీ తమ నిర్బంధంలో ఉన్నా అతను వెల్లడించిన అంశాలను అమెరికా మన దేశంతో పంచుకోలేదు. పాకిస్తాన్‌ను నొప్పించరాదన్న ఉద్దేశమా, అంతకుమించిన ప్రయోజనమేమైనా దీని వెనక ఉన్నదా అన్న సంగతి అమెరికాయే చెప్పాలి. అనేకానేకసార్లు ఒత్తిళ్లు తెచ్చిన తర్వాత 2010లో కొన్ని పరిమితులు విధించి హెడ్లీని ప్రశ్నించేందుకు ఎన్‌ఐఏను అనుమతించింది.
అమెరికాపై దాడి చేసిన ఉగ్రవాదులు ప్రపంచంలో ఏమూలనున్నా దాడి చేసి పట్టుకుంటామని, అది తమ హక్కని చెప్పే అమెరికా అలాంటి హక్కే ఇతర దేశాలకూ ఉంటుందని గుర్తించడంలేదు. అతన్ని అప్పగించడం మాట అటుంచి, కనీసం ప్రశ్నించడానికి అతి కష్టంమీద అనుమతించింది. నవంబర్‌లో పారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడులు, ఆ మరుసటి నెలలో కాలిఫోర్నియాలో ఒక జంట కాల్పులు సాగించి పలువుర్ని పొట్టనబెట్టుకోవడంవంటి ఉదంతాల తర్వాత అమెరికా తన వైఖరిని మార్చుకున్నదనిపిస్తుంది.
మార్పు రావడం మంచిదే అయినా దానికి మళ్లీ పరిమితులుండకూడదు. నిజానికి అమెరికా గనుక ముంబై దాడుల విషయంలో మన దేశానికి సహకరించదల్చుకుంటే 2011లో తమ న్యాయస్థానం ముందు హెడ్లీ ఇచ్చిన సాక్ష్యాలను అప్పట్లోనే అది పాకిస్తాన్‌కు అందజేసేది. అలాచేసి ఉంటే పాక్ దబాయింపులకు అప్పుడే కళ్లెం పడేది. ఐఎస్‌ఐ అధికారులను అరెస్టు చేయకతప్పని పరిస్థితి ఎదురయ్యేది. హెడ్లీ ఆ సమయంలో ఇచ్చిన సాక్ష్యాలతోపాటు మన దర్యాప్తు సంస్థలు సేకరించిన అనేక అంశాలను మన దేశం పాక్ న్యాయ కమిషన్ ఇక్కడికొచ్చినప్పుడు అందజేస్తే అనంతర కాలంలో పాక్ కోర్టు ‘ఇవేవీ సాక్ష్యాలు కాద’ని కొట్టిపడేసింది.
అప్పుడు అమెరికా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయింది. ఏమైతేనేం ఇన్నాళ్లకు హెడ్లీ మన కోర్టు ముందుకొచ్చి అన్ని వివరాలూ చెప్పాడు. అతను చెబుతున్న అంశాలు నేరుగా అక్కడి రాజ్యాన్నే దోషిగా నిలబెడుతున్నాయి. వీటి ఆధారంగా రేపో మాపో మన దేశం పాకిస్తాన్‌కు సవివరమైన నివేదికలను అందజేస్తుంది. అప్పుడు పాక్ ఏం చెబుతుందన్నది తేలుతుంది.
ఎప్పటిలా తప్పించుకోవాలని చూస్తే భారత్-పాక్ మధ్య జరగాల్సిన చర్చలకు కొత్త అవరోధాలు ఏర్పడక తప్పదు. ఇరు దేశాలమధ్యా ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే పాకిస్తాన్ ఇప్పటికైనా హెడ్లీ చెబుతున్న సాక్ష్యాల ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలి. లేనట్టయితే ప్రపంచంలో ఉగ్రవాద దేశంగా ముద్రపడక తప్పని స్థితి ఏర్పడుతుందని ఆ దేశం గ్రహించాలి.
పాక్ మౌనం వీడాలి
Published Thu, Feb 11 2016 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM
Advertisement
Advertisement