
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
వార్తల్లో వ్యక్తులు
నోకియా సీఈఓగా రాజీవ్ సూరి
ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ నోకియా ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా భారత్‌కు చెందిన రాజీవ్ సూరి ఎంపికయ్యారు. ఆయన స్టీఫెన్ ఎలాఫ్ స్థానంలో మే 1న సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. గతంలో నోకియా నెట్‌వర్క్ పరికరాల యూనిట్, సొల్యూషన్స్ అండ్ నెట్‌వర్క్‌లో సూరి ప్రధాన అధికారిగా పని చేశారు. 1967లో జన్మించిన సూరి మంగుళూరు యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్స్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. 1995లో ఎన్‌ఎస్‌ఎన్ ఇండియాలో సిస్టమ్ మార్కెటింగ్ మేనేజర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్
చైర్మన్‌గా జస్టిస్ మొహంతా
హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అశుతోష్ మొహంతా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మే 1న నియమితులయ్యారు. ఈ పదవికి మొహంతా పేరును గవర్నర్ నరసింహన్ నామినేట్ చేసినట్లు న్యాయ సేవాధికార సంస్థ తెలిపింది.
ఇట్స్ ఏపీ అధ్యక్షుడిగా రమేశ్ లోగనాథన్
ఐటీ, ఐటీఈఎస్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ (ఇట్స్ ఏపీ) నూతన అధ్యక్షుడిగా ప్రోగ్రెస్ సాఫ్ట్‌వేర్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ రమేశ్ లోగనాథన్ ఏప్రిల్ 29న ఎన్నికయ్యారు. ఆయన రెండేళ్లు(2014-16) ఈ పదవిలో ఉంటారు. హైదరాబాద్‌లోని ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా ఉన్న ప్రోగ్రెస్ సాఫ్ట్‌వేర్ కేంద్రాన్ని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దడంలో రమేశ్ లోగనాథన్ కీలక పాత్ర పోషించారు.
నల్లధనంపై సిట్ అధిపతిగా జస్టిస్ షా
విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధ నంపై విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి. షాను సుప్రీంకోర్టు మే1న నియమించింది. వైస్ చైర్మన్‌గా మరో రిటైర్డ్ న్యాయమూర్తి అరిజిత్ పసాయత్‌ను ధర్మాసనం నియమించింది.
భారత్ తొలి ఓటరు శ్యామ్ నేగి
భారత్ తొలి ఓటరుగా శ్యామ్‌నేగిని భారత ఎన్నికల సంఘం అధికారులు ధ్రువీకరించారు. ఆయన ఇప్పటివరకు (1951 నుంచి) మొత్తం 16 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశారు. 97 ఏళ్ల నేగి తొలిసారి 1951 అక్టోబరు లో నిర్వహించిన ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని కిక్నార్ జిల్లా కల్వాలో ఓటు వేశారు.
జవహర్ కలియానీకి అమెరికాలో కీలక పదవి
భారత సంతతికి చెందిన జవహర్ కలియానీ అమెరికా ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖలో మే 2న నియమితులయ్యారు. కంట్రోలర్ ఆఫ్ కరెన్సీ కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్లికేషన్ల అమలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన నేతృత్వం వహిస్తారు. జవహర్ కలియానీ ముంబైలో ఇంజనీరింగ్, అమెరికాలోని ఇలినాయిస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు.
మేలో తొలి పని దినంగా స్వాతి డే
చెన్నై సెంట్రల్ స్టేషన్‌లో మే 1న బెంగళూరు-గువహటి ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన పేలుళ్లలో మృతి చెందిన తెలుగమ్మాయి పరుచూరి స్వాతికి దక్షిణమధ్య రైల్వే అరుదైన గౌరవం కల్పించింది. స్వాతి స్మారకార్థం ఏటా మేలో తొలి పనిదినాన్ని స్వాతి డేగా పాటించనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల భద్రతలో పునరంకితమయ్యే ఉద్దేశంతో స్వాతి డేను అమలు చేస్తున్నామని దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. స్వాతిది గుంటూరు జిల్లా.
జాతీయం
అసోంలో తీవ్రవాదుల దాడి
అసోంలో మే 1, 2 తేదీల్లో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ సొంగ్ బిజిత్ (ఎన్‌డీఎఫ్‌బీఎస్)కు చెందిన మిలిటెంట్లు జరిపిన దాడుల్లో 32 మంది మరణించారు. బోడో టెరిటోరియల్ ఏరియా డిస్ట్రిక్ట్స్ కోక్రాఝుర్, బక్సా జిల్లాల్లో సాయుధ తీవ్రవాదులు మైనారిటీ వర్గాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో విచారణ జరిపించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. స్వతంత్ర బోడోలాండ్ కోసం నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ సొంగ్ బిజిత్ కొన్నేళ్లుగా పోరాటం చేస్తోంది.
భారత్‌లో వాతావరణ సమతుల్యతకు ముప్పు
భారత్‌లో అతివృష్టి, అనావృష్టి పరిణామాలతో వాతావరణ సమతుల్యతకు విఘాతం వాటిల్లుతోందని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఇటీవలి దశాబ్దాల్లో దక్షిణాసియా రుతుపవనాల సీజన్‌లో ముఖ్యంగా మధ్య భారతదేశంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయని వీరి పరిశోధనలో తేలింది. భారత్‌లో వెట్ స్పెల్స్ (కొద్దిరోజులపాటు వర్షాలు కురవడం), డ్రై స్పెల్స్ (కొద్ది రోజులపాటు వర్షాభావం) లాంటి పరిస్థితులు భవిష్యత్‌లో క్రమంగా పెరుగుతాయని శాస్త్రవేత్తల బృందం వివరించింది.
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
2011లో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ప్రపంచ బ్యాంకుకు చెందిన ఇంటర్నేషనల్ కంపారిజన్ ప్రోగ్రాం ఏప్రిల్ 30న విడుదల చేసిన నివేదికలో తెలిపింది. మూడో స్థానంలో ఉన్న జపాన్‌ను భారత్ వెనక్కి నెట్టింది. అమెరికా మొదటి స్థానంలో, చైనా రెండో స్థానంలో నిలిచాయి.
టాప్ 100లో ఐఐటీ గువహటి
ప్రతిష్ఠాత్మక గువహటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంతర్జాతీయంగా అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా స్థానం సంపాదించింది. ఈ జాబితాలో తొలిసారిగా చోటు సంపాదించిన ఏకైక భారతీయ విద్యా సంస్థగా ఐఐటీ గువహటి నిలిచింది. 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న 100 సంస్థల జాబితాను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజీన్ విడుదల చేసింది. పోర్చుగల్‌కు చెందిన లిస్బన్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ సిడ్నీతో కలిసి ఐఐటీ గువహటి 87వ ర్యాంకును పంచుకుంది. దక్షిణ కొరియాకు చెందిన పొహాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వరుసగా మూడో ఏడాది కూడా జాబితాలో తొలి స్థానంలో నిలిచింది.
అంతర్జాతీయం
లిబియా కొత్త ప్రధానిగా అహమ్మద్ మితీగ్
లిబియా కొత్త ప్రధానమంత్రిగా అహమ్మద్ మితీగ్‌ను లిబియా పార్లమెంట్ మే 4న ఎన్నుకుంది. 42 ఏళ్ల మితీగ్ లిబియాకు అత్యంత పిన్నవయస్కుడైన ప్రధాని. 2011లో గడాఫీ ప్రభుత్వం కూలిన తర్వాత లిబియాకు మితీగ్ ఐదో ప్రధానమంత్రి.
రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారులపై
అమెరికా ఆంక్షలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన ఏడుగురు అధికారులు, 17 సంస్థలపై అమెరికా ఏప్రిల్ 28న కొత్త ఆంక్షలు విధించింది. సైనిక అవసరాలకు ఉపయోగించే అత్యాధునిక ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించింది. తూర్పు ఉక్రెయిన్‌లో జరుగుతున్న హింసలో రష్యా జోక్యం చేసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. యూరోపియన్ యూనియన్ కూడా రష్యా, ఉక్రెయిన్ అధికారులపై ఆంక్షలు విధించేందుకు అంగీకరించింది. వీసాలపై నిషేధం, ఆస్తులను స్థంభింపజేయడం
లాంటివి ఈ ఆంక్షల్లో ఉన్నాయి.
మామిడి, కూరగాయల దిగుమతులపై ఈయూ నిషేధం
భారత్ నుంచి దిగుమతి అయ్యే ఆల్ఫోన్సో రకం మామిడికాయలపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు ఏప్రిల్ 28న తాత్కాలిక నిషేధం విధించాయి. వంకాయ, చేమ, కాకర, దోసకాయలపై కూడా ఈ నిషేధం ఉంటుంది. 2013లో భారత్ నుంచి దిగుమతైన పండ్లు, కూరగాయల్లో హానికర కీటకాలు ఉన్నట్లు గుర్తించడంతో యూరోపియన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధానికి యుైనె టెడ్ కింగ్‌డమ్ మద్దతు తెలిపింది. యూకే ఏటా భారత్ నుంచి 16 మిలియన్ల మామిడికాయలను దిగుమతి చేసుకుంటుంది. వీటి విలువ 6 మిలియన్ పౌండ్లు.
క్రీడలు
మాడ్రిడ్ నగర దత్త పుత్రుడిగా నాదల్
ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారుడు రఫెల్‌నాదల్‌ను మాడ్రిడ్ నగరం తమ దత్త పుత్రుడిగా ప్రకటించింది. ఈ అవార్డును మాడ్రిడ్ నగర మేయర్ అనా బొటెల్లా మే 5న నాదల్‌కు అందించారు. 2013లో జరిగిన ఓటింగ్‌లో నాదల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఎవరినైనా దత్తపుత్రుడిగా కానీ, దత్త పుత్రికగా కానీ స్వీకరించడం మాడ్రిడ్ నగరవాసుల దృష్టిలో అతి పెద్ద గౌరవం.
ప్రపంచ వాకింగ్‌లో ఇర్ఫాన్‌కు 26వ స్థానం
చైనాలోని తైసాంగ్‌లో జరిగిన ప్రపంచ రేస్ వాకింగ్ కప్‌లో భారత వాకర్ తోడి ఇర్ఫాన్ 26వ స్థానంలో నిలిచాడు. ఈ పోటీలో 20 కిలోమీటర్ల దూరాన్ని ఇర్ఫాన్ 1:21:09 గంటల సమయంలో పూర్తి చేశాడు. ఐదుగు రు సభ్యుల భారత బృందంలో ఇదే అత్యుత్తమ ప్రతిభ. 17 జట్లు పాల్గొన్న ఈ పోటీ లో భారత్‌కు 8వ స్థానం దక్కింది. ఉక్రెయిన్‌కు చెందిన రుస్లాన్ డిమెంట్రెంకో మొదటి, కాయ్‌జెలీన్ రెండోస్థానంలో నిలిచారు.
పోర్చుగల్ ఓపెన్‌లో సానియా జంటకు టైటిల్
పోర్చుగ ల్ ఓపెన్ టెన్నిస్ డబుల్స్ విజేతగా సానియా మీర్జా జంట నిలిచింది. మే 3న జరిగిన ఫైనల్లో సానియా, ఆమె సహచర క్రీడాకారిణి కారాబ్లాక్ (జింబాబ్వే) తో కలిసి ఇవా హిదినోవా (చెక్ రిపబ్లిక్), వలెరియా సొలోవ్యెవా (రష్యా) జంటపై నెగ్గి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.
ఆసియా స్నూకర్‌లో కమల్‌కు కాంస్యం
ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్నూకర్ ఆటగాడు కమల్ చావ్లా కాంస్యం సాధించాడు. మే 3న యూఏఈలో నిర్వహిం చిన సెమీ ఫైనల్‌లో మలేషియాకు చెందిన చువాన్ లియోంగ్‌ధోర్ చేతిలో చావ్లా ఓటమిపాలై మూడో స్థానంలో నిలిచాడు.
డోపీంగ్‌లో పట్టుబడిన టైసన్ గే
అమెరికా అథ్లెటిక్ స్ప్రింట్ స్టార్ టైసన్ గే డోపింగ్‌లో పట్టుబడ్డాడు. పోటీలు లేనప్పుడు (ర్యాండమ్ అవుట్ ఆఫ్ కాంపిటీషన్) నిర్వహించిన రెండు పరీక్షలతో పాటు మరో ఈవెంట్ పరీక్షలోనూ టైసన్ నిషేధిత ఉత్ప్రేరకాలను వాడినట్లు రుజువైంది. దాంతో అమెరికా యాంటీ డోపింగ్ అసోసియేషన్ అతనిపై ఏడాది పాటు నిషేధం విధించింది.
అధికారులపై అమెరికా ఆంక్షలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన ఏడుగురు అధికారులు, 17 సంస్థలపై అమెరికా ఏప్రిల్ 28న కొత్త ఆంక్షలు విధించింది. సైనిక అవసరాలకు ఉపయోగించే అత్యాధునిక ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించింది. తూర్పు ఉక్రెయిన్‌లో జరుగుతున్న హింసలో రష్యా జోక్యం చేసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. యూరోపియన్ యూనియన్ కూడా రష్యా, ఉక్రెయిన్ అధికారులపై ఆంక్షలు విధించేందుకు అంగీకరించింది. వీసాలపై నిషేధం, ఆస్తులను స్థంభింపజేయడం
లాంటివి ఈ ఆంక్షల్లో ఉన్నాయి.
మామిడి, కూరగాయల దిగుమతులపై ఈయూ నిషేధం
భారత్ నుంచి దిగుమతి అయ్యే ఆల్ఫోన్సో రకం మామిడికాయలపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు ఏప్రిల్ 28న తాత్కాలిక నిషేధం విధించాయి. వంకాయ, చేమ, కాకర, దోసకాయలపై కూడా ఈ నిషేధం ఉంటుంది. 2013లో భారత్ నుంచి దిగుమతైన పండ్లు, కూరగాయల్లో హానికర కీటకాలు ఉన్నట్లు గుర్తించడంతో యూరోపియన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధానికి యుైనె టెడ్ కింగ్‌డమ్ మద్దతు తెలిపింది. యూకే ఏటా భారత్ నుంచి 16 మిలియన్ల మామిడికాయలను దిగుమతి చేసుకుంటుంది. వీటి విలువ 6 మిలియన్ పౌండ్లు.
అవార్డులు
రతన్ టాటాకు బ్రిటన్ అత్యున్నత పౌర పురస్కారం
భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు యునెటైడ్ కింగ్‌డమ్ అత్యున్నత పౌరపురస్కారం లభించింది. స్వాతంత్య్రానంతరం ఈ అవార్డును పొందిన తొలి భారతీయుడు రతన్‌టాటానే. నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (జీబీఈ) పేరు కలిగిన ఈ పురస్కారాన్ని క్వీన్ ఎలిజబెత్-2 తరఫున భారత్‌లోని బ్రిటిష్ హై కమిషనర్ జేమ్స్ బెవాన్ మే 5న రతన్‌టాటాకు ప్రదానం చేశారు.
బీహార్ మహిళకు నైటింగేల్ పురస్కారం
బీహార్‌కు చెందిన ఆరోగ్య శాఖ అధికారిణి మార్తా డోడ్రేను భారత ప్రభుత్వం ఫ్లోరెన్స్ నైటింగేల్-2014 అవార్డుకు ఎంపిక చేసింది. 40 ఏళ్ల మార్తా బీహార్‌కు పొరుగునే ఉన్న జార్ఖండ్‌లోని పలాము జిల్లాకు చెందిన గిరిజన మహిళ. బీహార్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తూ పోలియో నివారణకు విశేష కృషి చేశారు. ఈ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను నైటింగేల్ పురస్కారంతో గౌరవించాలని నిర్ణయించింది. అవార్డు కింద మార్తాకు రూ.50 వేల నగదు, ప్రశంసా పత్రాన్ని అందిస్తారు. 2013 నవంబరులో ప్రకటించిన ఐక్యరాజ్యసమితి గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు కూడా డోడ్రేకు లభించింది.
బ్రిటన్‌లో భారత శాస్త్రవేత్తకు ఫెలోషిప్
బ్రిటన్‌లోని గ్లాస్గో యూనివర్సిటీలో పరిశోధనలు సాగిస్తున్న భారత శాస్త్రవేత్త రవీందర్ దహియా రూ. 10.83 కోట్ల విలువైన ఇంజనీరింగ్ ఫెలోషిప్స్ ఫర్ గ్రోత్ గెలుచుకున్నారు. అడ్వాన్స్‌డ్ మెటీరియల్, రోబోటిక్ అండ్ అటానమస్ సిస్టమ్స్, సింథటిక్ బయాలజీ రంగాల్లో చేసిన పరిశోధనలకు గానూ రవీందర్‌కు ఈ ఫెలోషిప్ లభించింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
అస్త్ర పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ) మే 4న విజయవంతంగా పరీక్షించింది. దృష్టి క్షేత్రానికి ఆవల ( బియాండ్ విజువల్ రేంజ్ ) గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని నౌకాదళ స్థావరం నుంచి సుఖోయ్-30 యుద్ధ విమానం ద్వారా వాయుసేన ప్రయోగించింది. దేశీయంగా రూపొందిన తొలి బీవీఆర్ ఎయిర్ టు ఎయిర్ అస్త్ర అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది. గగనతలంలో సుమారు 20 కి.మీ నుంచి 80 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.