పదిలో ప్రత్యేకత చాటాలంటే పుట్టిన ఊరు వదలాలి. ఇంటర్‌లో విన్నర్ కావాలంటే ఇంటి నుంచి దూరంగా పోవాలి. ఇక.. ఐఐటీ సీటు రావాలంటే అయినవారిని వీడాల్సిందే. నీట్‌లో ర్యాంకు రావాలంటే నిలుచున్నచోటును మరిచిపోవాల్సిందే. ఇదీ నిన్నామొన్నటివరకు రాయలసీమ విద్యార్థుల పరిస్థితి. అవును.. ప్రతిభ ఉన్నా సానబెట్టేవారు దొరకని దుస్థితి. పట్టుదల ఉన్నా పెద్దపట్టణాలకు వెళ్లలేని ఆర్థికస్థితి. ఇలాంటి తరుణంలో ఓ యువకుడు తన సద్బుద్ధితో వీరికి సరికొత్త మార్గాన్ని చూపాడు. రాళ్ల సీమ నుంచి రత్నాల్లాంటి విద్యార్థులను వెలికితీస్తున్నాడు. కడప గడ్డ వేదికగా ఐఐటీ, నీట్‌లలో ర్యాంకుల పంట పండిస్తున్నాడు. తన ‘సంకల్ప్’బలంతో కార్పొరేట్ శక్తులకు సవాల్ విసురుతున్నాడు. విద్యార్థుల సామర్థ్యానికి తన శక్తి జోడించి లక్ష్యం వైపు నడిపిస్తున్న ఓ విజేత స్ఫూర్తిగాథే నేటి ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సాక్షి, కడప డెస్క్: ‘విజయం కోసం ఆరాటపడితే సరిపోదు.. జీవితంలో ఎదగాలని ఆశపడితే చాలదు.. మనసా వాచా కర్మణా ఆచరించాలి.. అలా చేయకుంటే ఎంత ఉన్నతాశయమైనా భూమిలో నాటని విత్తనంతో సమానమే.. అది మొలకెత్తదు.. ఆ ఆశయమూ ఫలించదు..’ అంటూ విద్యార్థులకు స్ఫూర్తిమంత్రం నూరిపోస్తుంటాడు వంశీకృష్ణ. వెనుకబడిన సీమ విద్యార్థుల భవితకు దీపధారై నడుస్తున్న ఆయన పుష్కరం క్రితం కడపకు వచ్చాడు.
లాభాపేక్ష లేకుండా...
2011లో వైఎస్సార్ జిల్లా కేంద్రంలో నాగార్జున మోడల్ స్కూల్ కేంద్రంగా ‘సంకల్ప్’ స్థాపించాడు. అప్పటి నుంచి ఎందరో విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధన అందిస్తున్నారు. అటుతర్వాత ఏపీహెచ్‌బీ కాలనీలో దశాబ్దం కిందట ‘సంకల్ప్’ పేరిట ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేశాడు వంశీకృష్ణ. అయినా ‘నాగార్జున’తో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. డబ్బు సంపాదన లక్ష్యంగా కాకుండా సేవాదృక్పథంతో ఇస్తున్న ఆయన శిక్షణతో ఎంతోమంది ఉజ్వల భవిష్యత్ పొందారు.
పకడ్బందీగా ప్రవేశపరీక్ష
‘సంకల్ప్’లో ప్రవేశాల కోసం బేసిక్ మ్యాథమేటిక్స్ విధానం ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. నాలుగో తరగతి ముగించి ఐదో తరగతిలో చేరబోయే విద్యార్థులు మాత్రమే ఇందుకు అర్హులు. పదో తరగతి వరకు శిక్షణ కొనసాగుతుంది. ఏటేటా నిర్వహించే ప్రవేశ పరీక్షలకు సీమ జిల్లాల నుంచి విద్యార్థులు వెల్లువలా వస్తారు. ఇక్కడ చేరితే ఐఐటీలో కచ్చితంగా సీటు వస్తుందనే నమ్మడమే ఇందుకు కారణం. పరీక్షల్లో అర్హత సాధించిన వంద మందికే ఇక్కడ అవకాశం కల్పిస్తారు.
ఆలోచనే ఆయుధం
సంకల్ప్‌లో మొత్తం సిలబస్‌ను వేగంగా బోధించరు. విద్యార్థి ఆలోచనా విధానం, స్వతహాగా చొరవను గుర్తిస్తారు. ఉపాధ్యాయులపై ఆధారపడకుండా సొంతంగా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివేలా తర్ఫీదు ఇస్తారు. నిత్యం ఏదో ఒక టాపిక్ చెబుతారు. అది నేర్చుకున్న విద్యార్థి సొంతంగా దానిపై ఒక్క నిమిషం మాట్లాడాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక తరహా శిక్షణతో వారు రాటుదేలుతారు.
ప్రశ్నించడం నేర్పుతూ..
సంస్థలో ప్రతి విషయంలో ఎందుకు? ఏమిటి? ఎలా? అంటూ ప్రశ్నించడం అలవరుస్తున్నారు. మూస పద్ధతిలో బోధన కాకుండా విద్యార్థికి న్యూమరికల్ ప్రాబ్లం ఇచ్చి ఎన్ని పద్ధతుల్లో సాల్వ్ చేస్తారంటూ అడుగుతారు. చాలామంది మూడు పద్ధతుల్లో సాల్వ్ చేస్తారు. కొందరు అంతకంటే ఎక్కువ పద్ధతుల్లో పరిష్కరిస్తారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థి తొమ్మిది పద్ధతుల్లో సాల్వ్ చేయడం విశేషం. చిన్నారుల ఆలోచనలను సరైన దారిలో పెడితే ఇలాంటి అద్భుతాలు సాధ్యమంటాడు వంశీ.
►ఉత్తర తెలంగాణ నుంచి..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓదేడుకు చెందిన సత్యనారాయణ, పద్మ దంపతుల కుమారుడు చకిలం వంశీకృష్ణ. ఓదేడు, మంథని, వరంగల్‌లో ఈయన బాల్యం గడిచింది. అక్కడే ప్రాథమికస్థాయి నుంచి డిగ్రీ వరకు చదువు పూర్తి చేశాడు. ఫిజిక్స్‌లో పీజీ చేసిన ఆయన ఐఐటీ, జేఈఈ లెక్చరర్‌గా కోటా(రాజస్థాన్), ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పనిచేశాడు. ఐఐటీ రామయ్య, సూపర్ థర్టీ ఆనంద్ కుమార్‌ల నుంచి స్ఫూర్తి పొందాడు. వెనుకబడిన ప్రాంతాలకు ఏదైనా చేయాలనే ఆలోచన అక్కడే మొదలైంది. కెమిస్ట్రీ లెక్చరర్ చకిలం రేణుకతో వివాహమైన అనంతరం ‘సంకల్ప్’ స్థాపనకు బీజం పడింది.
► ర్యాంకులకు సూచిక
భావిభారతానికి సేవ చేయాలనే లక్ష్యంతో తన శిష్యులను డాక్టర్లు, ఇంజినీర్లుగా.. సమాజానికి ఉపయోగపడే ఉన్నతాశయాలు కలిగినవారిగా తయారు చేస్తున్నాడు వంశీ. ప్రతీ పురుషుడి విజయం వెనుక ఓ సీ్త్ర ఉంటుందనే నానుడిని నిజం చేస్తున్నారు ఆయన భార్య రేణుక. కెమిస్ట్రీ బోధకురాలైన ఆమె ‘సంకల్ప్’కు డెరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ‘సంకల్ప్’ ఘనత తమతో పాటు సహోపాధ్యాయులది కూడా అంటున్నాడు వంశీకృష్ణ. అందరి సమష్టికృషితోనే ఘనమైన ఫలితాలు సాధిస్తున్నామంటున్నాడు. ఆయన వద్ద చదివిన చాలామంది విద్యార్థులు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కంపెనీల్లో రూ. లక్షల్లో గడిస్తున్నారు.
ఎంతోమంది ఇంజినీర్లు, డాక్టర్లుగానే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్‌లుగా కూడా స్థిరపడ్డారు. ఈ ఏడాది ప్రణతిరెడ్డి అనే విద్యార్థిని నీట్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 45వ ర్యాంకు సాధించడం ‘సంకల్ప్’ సాధనకు గీటురాయిగా నిలిచింది. పదుల సంఖ్యలో ఐఐటీ, మెడికల్ సీట్లు సాధించడం గర్వకారణమైంది. తమ సంస్థలో ఏటా పది మందికి ఉచితంగా శిక్షణ ఇవ్వడమేగాక కార్పొరేట్ కళాశాలలో చదివిస్తున్నాడు వంశీకృష్ణ. భవిష్యత్తులో అనాథ పిల్లలకు శిక్షణను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమంటున్నారాయన.
క్రమశిక్షణ నేర్పుతున్నారు
నా కుమారుడు శ్రీనందన్‌రెడ్డి, కుమార్తె హర్షిత సంకల్ప్‌లో చదివారు. బేసిక్స్‌తో పాటు పోటీప్రపంచానికి తగ్గట్టు తీర్చిదిద్దారు. ప్రాబ్లం సాల్వింగ్‌తో పాటు క్రమశిక్షణ నేర్పారు. దీంతో ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ సులభమైంది. శ్రీనందన్ 2019 ఆల్ ఇండియా నీట్‌లో 42వ ర్యాంకు సాధించారు. హర్షిత కూడా మంచి ర్యాంకు సాధించింది.
– ఎ.ప్రసూన, ప్రొఫెసర్, హోమియో మెడికల్ కళాశాల
సెల్ఫ్ లెర్నింగ్ అత్యావశ్యకం
ఐఐటీల్లో ఇంజినీరింగ్ చేసే విద్యార్థులకు సెల్ఫ్ లెర్నింగ్ చాలా అవసరం. వారిని అందుకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నాం. మాస్టర్ టాస్క్ ఇచ్చి అదే పద్ధతుల్లో ప్రశ్నలు క్రియేట్ చేయమని చెబుతాం. ఇష్టంలో కష్టపడే వాతావరణం ఉండేలా చూస్తాం.
– వంశీ, సంకల్ప్ సంస్థ
సీమవాసుల అదృష్టం
కడపలో ఇన్‌స్టిట్యూట్ పెట్టడం జిల్లావారికే కాదు సీమవాసులకు సైతం అదృష్టంగా మారింది. విద్యార్థులు బరువుగా కాకుండా, బాధ్యతగా చదువుకోవడాన్ని నేర్పి స్తున్నారు. దీంతో మావాడు కేవీపీఐ, మ్యాథ్స్ ఒలింపియాడ్, తదితర పరీక్షల్లో సైతం రాణించాడు. ఐఐటీలో 280 ర్యాంకుతో ఖరగ్ పూర్‌లో సీటు సాధించాడు. అమెజాన్‌లో సీనియర్స్ విభాగంలో ఇంటర్న్‌షిప్ సాధించాడు.
– చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు
మామయ్య సలహాతో..
వంశీకృష్ణ మేనమామ రాజకీయ, సామాజిక అంశాల విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్. సంకల్ప్ స్థాపించాలనే తన ఆలోచనను ఆయనకు వివరించారు. వెనుకబడిన ప్రాంతాలకు ఉప యోగపడేలా సంస్థ ఉండాలని, రాయలసీమ అందుకు అనుగుణంగా ఉంటుందని నాగేశ్వర్ సలహా ఇచ్చారు. దీంతో రాయలసీమ నడిబొడ్డునున్న కడపలో సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment