ఇక వ్యాసరూపంలోనే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో బహుళ ఐచ్ఛిక సమాధానాలకు ఇక స్వస్తి పలికి... వ్యాసరూప సమాధానాల విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ పునర్‌నిర్మాణం కోసం సుశిక్షితులైన ఉద్యోగులు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసం పోటీ పరీక్షల విధానంలో మార్పులు తీసుకురావాలని, వ్యాసరూప సమాధానాల ద్వారా వారి శక్తిసామర్థ్యాలను పరీక్షించేందుకు అవకాశం ఉంటుందనే అంశాలు పోటీ పరీక్షల విధానం సమీక్షా కమిటీ ముఖ్యుల చర్చల్లో వచ్చినట్టు తెలుస్తోంది. క్లరికల్ పోస్టు నుంచి అధికారి స్థాయి వరకు, జూనియర్ అసిస్టెంట్ నుంచి గ్రూపు-1 వరకు ఉండే అన్ని పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నల విధానం ఉండాలని యోచిస్తున్నారు. అయితే ఈ విధానం ప్రవేశపెట్టాలంటే ముందుగా భారీ కసరత్తు అవసరమన్న వాదన వ్యక్తమవుతోంది. పోటీ పరీక్షను బట్టి పేపర్ల సంఖ్యను నిర్ధారించాల్సి ఉంటుంది. మరోవైపు వ్యాసరూప సమాధానాలు రాయాల్సిన ప్రశ్నల విధానాన్ని ఒక్క పేపరు గానే పరిమితం చేయాలా? ప్రతి పోటీ పరీక్షకు సంబంధించిన అన్ని పేపర్లలో వ్యాసరూప సమాధానాల విధానమే అమలు చేయాలా? అన్న విషయాల్లో చర్చలు కొనసాగుతున్నట్లు తెలిసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు వ్యాసరూప సమాధాన విధానం అమల్లోకి తెస్తే సమస్యలు తలెత్తుతాయన్న వాదన కమిటీలోని సభ్యుల్లో వ్యక్తమవుతోంది. అందుకే టీఎస్‌పీఎస్‌సీ ద్వారా త్వరలో వెలువడే నోటిఫికేషన్లలో ఈ విధానం అమలు చేయవద్దని, ఆ తరువాత నుంచి ఇచ్చే నోటిఫికేషన్లలో దీనిని అమలు చేయాలనే యోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 5న జరిగే పోటీ పరీక్షల విధానం సమీక్ష కమిటీ సమావేశంలో ఈ కొత్త విధానంపై పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, ఈ విధానాన్ని రెండుమూడేళ్లు ముందుగానే ప్రకటించి, ఆ తరువాత అమల్లోకి తెస్తే నిరుద్యోగులకు ఇబ్బంది ఉండదన్న వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వంద రకాల కేడర్ల ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ప్రతి కేడర్ ఉద్యోగాల భర్తీకి ఇచ్చే మొదటి నోటిఫికేషన్‌లో కాకుండా రెండో నోటిఫికేషన్ నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలన్న అంశంపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ విధానం అమలులో భాగంగానే గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూపు-1బీగా కొనసాగిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో గ్రూపు-1 అధికారి స్థాయికి గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్ అధికారులు వెళతారు కనుక వాటిని గ్రూపు-1బీగానే కొనసాగించాలని యోచిస్తున్నారు. అయితే దీనిపై తుది నిర్ణయాధికారాన్ని ప్రభుత్వానికే వదిలేయాలన్న అభిప్రాయానికి కమిటీ ఇప్పటికే వచ్చింది.