గ్రేట్ ప్రశాంత్ | Great Prashant Success Story | Sakshi
Sakshi News home page

గ్రేట్ ప్రశాంత్

Published Mon, Apr 6 2015 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

గ్రేట్ ప్రశాంత్

గ్రేట్ ప్రశాంత్

సక్సెస్ స్టోరీ
 
పరిశోధన చేయాలనే కోరిక.. ఉన్నత విద్యనభ్యసించాలనే లక్ష్యం.. ఇవే గేట్ 2015లో జాతీయ స్థాయిలో ఈసీఈ బ్రాంచ్‌లో 65వ ర్యాంకు సాధించడంలో తోడ్పడ్డాయంటున్నాడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి పుల్ల ప్రశాంత్ గౌడ్.  ఇష్టపడి చదివితే గేట్‌లో ర్యాంకు కష్టం కాదంటున్న  ప్రశాంత్ సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే...
 
స్వస్థలం కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి. నాన్న పుల్ల తిరుపతి గౌడ్.. గీత కార్మికుడు. మమ్మల్ని ఉన్నత స్థితిలో చూడాలన్న కోరికతో చదివించారు. ఇద్దరు అన్నయ్యలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ల స్ఫూర్తి, తోడ్పాటుతో ఉన్నత విద్యే లక్ష్యంతో ముందుకు సాగాను. తొమ్మిదో తరగతి వరకు మెట్‌పల్లిలో, పదో తరగతి ఏపీఆర్‌ఎస్ నాగార్జున సాగర్‌లో చదివాను.
 
ఫ్యాకల్టీ ప్రోత్సాహం


మండలస్థాయి టాపర్ల జాబితా ఆధారంగా ప్రవేశాలు కల్పించే ట్రిపుల్ ఐటీ బాసరలో 2009లో ప్రవేశం లభించింది. అక్కడి అకడమిక్ వాతావరణం, ఫ్యాకల్టీ తోడ్పాటు నన్ను లక్ష్యం దిశగా నడిపాయి. పరిశోధన రంగంలో అడుగు పెట్టాలనే నా ఆశకు ఐఐటీలు, ఐఐఎస్‌సీ వేదికలని, దానికి గేట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకోవడం ముఖ్యమని లెక్చరర్లు సూచించి, ప్రిపరేషన్‌లో సహకరించారు.
 
ఎటువంటి శిక్షణ లేకుండానే..

ఎలాంటి ప్రత్యేక శిక్షణ లేకుండానే ట్రిపుల్ ఐటీలో అందుబాటులో ఉన్న మెటీరియల్‌తో ఆరు నెలల ముందు నుంచి గేట్-2015కు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ సాగించాను. మరో ముగ్గురు స్నేహితులతో కంబైన్డ్ స్టడీస్, సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించి బీటెక్ స్థాయి అంశాలపై పట్టు సాధించడం వంటివి గేట్ విజయానికి తోడ్పడ్డాయి.
 
అకడమిక్స్‌లో రాణించాలి


 అకడమిక్ అంశాల్లో పరిపూర్ణత సాధిస్తే గేట్‌లో ర్యాంకు సాధించడం సులభమే. గేట్‌లో అడిగే ప్రశ్నలు అప్లికేషన్ ఓరియంటెడ్‌గా ఉంటాయి. అకడమిక్స్‌లో చదివేటప్పు డే అప్లికేషన్ ఓరియంటేషన్‌తో చదవడం లాభిస్తుంది.

మాక్ టెస్ట్‌లే కీలకం

 కోచింగ్ ఉన్నా లేకపోయినా గేట్‌లో మెరవాలంటే మాక్ టెస్ట్‌లకు హాజరవాలి. ఇవి విద్యార్థులు తమ నైపుణ్యాన్ని అంచనా వేసేందుకు ఉపకరిస్తాయనే ఆలోచనతో ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ లు రాశాను. ప్రత్యేకించి ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు.
 
ఉన్నత విద్యే లక్ష్యం


 గేట్ ర్యాంకు ఆధారంగా ఐఐఎస్‌సీ బెంగళూరులో ప్రవేశించి ఈసీఈ విభాగంలో రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ ఐఐఎస్‌సీ బెంగళూరులో సీటు లభించకపోతే తదుపరి ప్రాథమ్యాలు ఐఐటీ ఢిల్లీ, చెన్నైలు. ఐఐటీల్లో ఎంటెక్‌లో చేరినప్పటికీ పీహెచ్‌డీ చేయడమే నా లక్ష్యం. గేట్ ర్యాంకుతో పీఎస్‌యూల్లో జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం మా క్యాంపస్‌లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. కానీ నా లక్ష్యం ఉన్నత విద్యనభ్యసించడమే.

సిలబస్‌పై అవగాహన

గేట్ ఔత్సాహిక విద్యార్థులు తమ వ్యక్తిగత నైపుణ్యాలను విశ్లేషించుకోవాలి. ఆ మేరకు గేట్ సిలబస్‌ను పరిశీలించి తాము అదనంగా దృష్టిసారించాల్సిన అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. కనీసం ఒక ఏడాది ముందు నుంచి గేట్ లక్ష్యంగా ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి. అకడమిక్స్‌ను నిర్లక్ష్యం చేయకుండా అప్‌డేట్ అవుతుండాలి. సహచరులతో పోల్చుకుని ఆందోళన చెందొద్దు. మాక్‌టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లు కచ్చితంగా మేలు చేకూరుస్తాయి.

అకడమిక్ ప్రొఫైల్

ఏపీఆర్‌ఎస్ నాగార్జున సాగర్‌లో 2009 పదో తరగతి ఉత్తీర్ణత (570 మార్కులు)
2009లో ట్రిపుల్ ఐటీ బాసర క్యాంపస్‌లో ప్రవేశం
2011లో ట్రిపుల్ ఐటీ బాసరలో ఇంటర్మీడియెట్‌లో 97.8 శాతం ఉత్తీర్ణత
బీటెక్‌లో ఇప్పటివరకు 9సీజీపీఏతో ఉత్తీర్ణత.
గేట్-2015లో 65వ ర్యాంకు
గేట్ మార్కులు - 900
గేట్ నార్మలైజ్డ్ స్కోర్ - 69.14
 

Advertisement
Advertisement