డాడీ వింటన్‌ | sir Nicholas Winton was organized the rescue of 669 children | Sakshi
Sakshi News home page

డాడీ వింటన్‌

Published Fri, Aug 18 2017 11:44 PM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM

డాడీ వింటన్‌

డాడీ వింటన్‌

యుద్ధంలో యోధుడెవరు? గన్ను కాల్చిన వాడా... కత్తి దించిన వాడా? కానే కాదు. ప్రాణం కాపాడిన వాడే యుద్ధంలో నిజమైన యోధుడు. దేవుడు ప్రేమించేది అలాంటి యోధుడినే. మనం కోరుకునేది ఇలాంటి జీవితాన్నే. సర్‌ నికొలస్‌ వింటన్‌... మీ గుండెలో కట్టుకున్న 669 గూళ్లలో పక్షులకు ఇప్పుడు రెక్కలొచ్చాయి. ఆ రెక్కల సవ్వడే మాకు వినపడుతున్న చప్పట్లు. మీరు చేసింది కీర్తికోసం కాదు. మేము మిమ్మల్ని కీర్తిస్తున్నది మాత్రం స్ఫూర్తి కోసం!!

సూర్యుడు వెలుతురును ఇస్తాడు. చంద్రుడు వెన్నెలను ఇస్తాడు. అంతమాత్రాన మన జీవితాలన్నీ వెలిగిపోతున్నాయనా? కాదు! వెలుతురు, వెన్నెల.. పైనుంచి కురిసే ఆనందాలు మాత్రమే. మనిషి లోపల విరిసే మతాబులు వేరే ఉన్నాయి. చిన్నారుల స్వచ్ఛమైన చిరునవ్వులు అవి. బతుకులోని ఇక్కట్ల చీకట్లను తొలగించే చిరుదివ్వెలు అవి. ఈ నవ్వుల దివ్వెలే లేకపోతే? భువిపై మనుషులే కాదు..
దివిలోని సూర్యుడు, చంద్రుడు కూడా చిన్నబోతారు! మొత్తం విశ్వానికే గ్రహణం పడుతుంది. ఆ గ్రహణ దుఃఖం ఎలా ఉంటుందో తెలుసా?
సరిగ్గా ఎలా ఉంటుందో తెలుసా? బోరు బావిలో బిడ్డ పడినట్లు ఉంటుంది! పాల్లేక పసికందు డొక్కలు ఎండిపోతున్నట్లు ఉంటుంది.పొత్తిళ్లలోని బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లినట్లు ఉంటుంది. కంకర రాళ్లను కొట్టలేక లేత చేతులు చితికిపోయినట్లు ఉంటుంది. ఇలాంటి గ్రహణమే 1938లో లోకానికి పట్టింది! అది జాతి విద్వేష గ్రహణం.


డెబ్బై ఎనిమిదేళ్ల సర్‌ నికొలస్‌ వింటన్‌.. ఒక ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆ టీవీ షో కి వచ్చి కూర్చోగానే చుట్టూ ఉన్న ఆడియెన్స్‌ అంతా ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. వాళ్లు అలా ఎందుకు లేచి నిలబడ్డారో వింటన్‌కి అర్థం కాలేదు! వింటన్‌ కడుపులో 50 ఏళ్లుగా ఒక నిజం దాగి ఉంది. ఇంట్లోని అటకపై దుమ్ము పొరల్లో దాగి ఉన్న ఒక పుస్తకం అనుకోకుండా కంటపడే వరకు ఆ నిజం గురించి వింటన్‌ భార్యకు కూడా తెలీదు.  1938 నాటి మారణ హోమం నుంచి వింటన్‌ 669 మంది యూదు జాతి చిన్నారులను ఒంటి చేత్తో కాపాడాడు. అదే ఆ నిజం! ఆ పుస్తకంలో రాసి ఉన్న పేర్లు, అంటించి ఉన్న ఫొటోలు ఆ చిన్నారులవే. చెకోస్లొవేకియా నుంచి వాళ్లందరినీ భద్రంగా బ్రిటన్‌ చేర్చాడు వింటన్‌. ఆ తర్వాత, ఆ చిన్నారుల తల్లిదండ్రులలో చాలామంది, నాజీ నియంత హిట్లర్‌ క్రౌర్యానికి మృత్యు శిబిరాలలో బందీలై, చివరికి దుర్మరణం చెందారు.

వింటన్‌ డైరీని వింటన్‌ భార్య తన స్నేహితురాలైన ఒక చరిత్రకారిణికి ఇవ్వడంతో ఆమె ద్వారా టీవీ షో కు రమ్మని వింటన్‌కు ఆహ్వానం అందింది. వింటన్‌.. ఆ షో కి రాగానే గౌరవ సూచకంగా లేచి నిలబడినవారంతా.. యాభై ఏళ్ల క్రితం ఆయన కాపాడిన చిన్నారులే! వాళ్లంతా పెద్దవాళ్లయి, కొందరు తండ్రులు, తాతలు, అమ్మ, అమ్మమ్మలు కూడా అయి.. వింటన్‌ చుట్టూ చేరి చప్పట్టు కొడుతూ, దగ్గరకు వచ్చి విషయం చెప్పి.. ఎంతో ఉద్వేగంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటే వింటన్‌ కళ్లు చెమర్చాయి.  సర్‌ నికొలస్‌ వింటన్‌ 2015లో తన 106 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆయనలోని మానవత్వం, మంచితనమే ఆయన్ని అన్నేళ్లు బతికించిందని అనుకోవాలి. అయితే అదంత తేలిగ్గా జరగలేదు. హిట్లర్‌ కన్నుగప్పి ప్రపంచంలోని ఏ యూదు జాతీయుడూ బతికే పరిస్థితి లేని రోజుల్లో అంతమంది పిల్లల్ని కాపాడడం మామూలు సంగతేం కాదు.

మృత్యు శిబిరాలు
నిజానికి వింటన్‌ లోకం వేరు. లండన్‌లో అతడు అప్పుడప్పుడే డబ్బు కళ్ల జూస్తున్న స్టాక్‌ బ్రోకర్‌. వయసు 29. యుద్ధం వస్తే ఏ షేర్‌ ఎలా అప్‌ అండ్‌ డౌన్‌ అవుతుందన్నదే అతడి ధ్యాసంతా. అంతకు మించిన ఆలోచన ఏదైనా ఉందీ అంటే అది.. స్విట్జర్లాండ్‌ వెళ్లి సరదాగా స్కీయింగ్‌ కొట్టడం. 1938 డిసెంబరులో ఓ రోజు ఇలాగే స్విట్జర్లాండ్‌ బయల్దేరుతుంటే చెక్‌ రాజధాని ప్రేగ్‌లో ఉంటున్న మార్టిన్‌ బ్లేక్‌ అనే స్నేహితుడి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ‘వెంటనే వచ్చేయ్‌ నిక్‌.. నీకిక్కడ ఓ ముఖ్యమైన పని ఉంది’ – అంతే సారాంశం.
వింటన్‌ ప్రేగ్‌ చేరిసరికి.. అక్కడంతా నాజీ సైనికులు! మొదట చెకొస్లొవేకియా పశ్చిమ ప్రాంతం సుడెటెన్‌లాండ్‌ను ఆక్రమించిన సైనికులు క్రమంగా చెక్‌ మొత్తాన్నీ అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నారు. శరణార్థులై చుట్టుపక్కల నుంచి చెక్‌ దేశానికి వచ్చి తలదాచుకున్న యూదులను దొరికిన వాళ్లను దొరికినట్లుగా మృత్యు శిబిరాలకు తరలిస్తున్నారు నాజీ సైనికులు!

మాతృ హృదయాలు
‘ఏమైనా చెయ్యి నిక్‌’ అని అభ్యర్థించాడు మార్టిన్‌ బ్లేక్‌. వింటన్‌ ఆలోచనలో పడ్డాడు. అమాయకులైన శరణార్థి యూదు పిల్లలు అతడి కళ్ల ముందు మెదిలారు. ఆ పిల్లలకు తిండి కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న తల్లులు, రక్షణ ఇవ్వలేని దుస్థితిలో తండ్రులు.. ‘మేమెలా పోయినా బాధ లేదు. మా పిల్లలదే ఆలోచన. వాళ్లను బతికించండి’ అన్న హృదయ విదారక విజ్ఞప్తులు వింటన్‌ గుండెను పిండాయి. బ్రిటన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాడు. ‘ఆ పిల్లలకు ఇక్కడి వారెవరైనా తల్లీతండ్రీ అయి, ఆశ్రయం ఇస్తామని హామీ ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. అంతేకాదు, ఒక్కో చైల్డ్‌కి 50 పౌండ్‌ల నగదును డిపాజిట్‌ చెయ్యవలసి ఉంటుంది’ అని బ్రిటన్‌లోని ‘హోమ్‌ ఆఫీస్‌’ నుంచి సమాధానం వచ్చింది. ఈ మాత్రం చాలు అని సంతోషపడిపోయాడు వింటన్‌.  

చెక్‌లో ఒక్క మనసూ లేదు!
అప్పట్లో యాభై పౌండ్లు అంటే చిన్న మొత్తం ఏమీ కాదు. పైగా కొద్ది సంఖ్యలో కాకుండా వేలాదిగా చిన్నారులను కాపాడాలన్న పట్టుతో ఉన్నాడు వింటన్‌. అన్ని వేల మందికి అన్ని యాభై పౌండ్లు! పోనీ బాలల సంరక్షణకు భారీగా విరాళాలిచ్చే సంస్థలు చెక్‌లో ఉన్నాయా అంటే అవీ లేవు. ఇక తనే సొంతంగా ఒక సంస్థను ప్రారంభించాడు. ‘ది బ్రిటిష్‌ కమిటీ ఫర్‌ రిఫ్యూజీస్‌ ఫ్రమ్‌ చెకోస్లోవేకియా, చిల్డ్రన్‌ సెక్షన్‌’ అని పేరు పెట్టాడు. ఆ కమిటీలో అతడితో పాటు తల్లి, ఒక కార్యదర్శి, కొద్ది మంది వాలంటీర్లు ఉండేవారు. కమిటీ పేరిట విరాళాల కోసం బ్రిటన్‌ పత్రికల్లో ప్రకటనలు విడుదల చేశాడు వింటన్‌. ఆ తర్వాత ప్రేగ్‌లోని వెన్సెస్లాస్‌ స్క్వేర్‌ లోని ఒక హోటల్‌ డైనింగ్‌ రూమ్‌లో వింటన్‌ ఆఫీస్‌ ప్రారంభం అయింది.

ఏ క్షణమైనా యుద్ధం
యూదు తల్లిదండ్రులు ఒక్కొక్కరూ వచ్చి తమ పిల్లల్ని వింటన్‌ చేతుల్లో పెడుతున్నారు. ఆ పిల్లల వివరాలను జాగ్రత్తగా ఒక పుస్తకంలో రాసుకోవడానికి, ఎవరి వివరాల ఎదురుగా వారి ఫొటోలను అంటించడానికి ట్రెవర్‌ చాద్విక్, బిల్‌ బరాజెట్టి అనే ఇద్దరు సహాయకులను కుదుర్చుకున్నాడు వింటన్‌. వీళ్లు ఇక్కడ ప్రేగ్‌లో పిల్లల్ని నమోదు చేసుకుంటూ ఉంటే అక్కడ ఇంగ్లండ్‌లో పిల్లల్ని దత్తత తీసుకోడానికి ముందుకు వచ్చిన తల్లిదండ్రులతో సంప్రదింపులకు వెళ్లి వస్తుండేవాడు వింటన్‌. పగలు కొంత సమయం తన స్టాక్‌  ఎక్సేంజీ పనులు చూసుకుంటూ, సాయంత్రాలు, రాత్రి పొద్దుపోయాక కూడా కొన్ని గంటలు పూర్తిగా పిల్లల పునరావాస బాధ్యతల్ని పర్యవేక్షించేవాడు. అయితే బ్రిటన్‌లోని హోమ్‌ ఆఫీస్‌ సిబ్బంది ఈయనలా పరుగులు పెట్టలేదు. పైగా, ‘తొందరెందుకు ఓల్డ్‌ బాయ్, ఐరోపా సంగతి తెలియదా.. ఇక్కడంతా నింపాదిగా జరుగుతుంది’ అని పనిని సాగదీసేవారు. వింటన్‌ బతిమాలి వాళ్ల చేత త్వరత్వరగా పనులు క్లియర్‌ చేయించుకునేవాడు. యుద్ధం ఏ క్షణాన్నైనా మొదలు కావచ్చని అతడికి స్పష్టంగా తెలుస్తోంది. ఆ లోపే వీలైనంతమంది పిల్లల్ని బ్రిటన్‌కు చేర్చాలన్నదే అతడి తపన.

విమానంలో, రైల్లో, ఓడలో..
1939 మార్చి 14న తొలి విమానం ప్రేగ్‌ నుంచి పిల్లలతో బ్రిటన్‌ బయల్దేరింది. మరో ఏడు బృందాలు  ప్రేగ్‌లోని విల్సన్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రయాణం సాగించాయి. ఆ తర్వాత ఈ బృందాలు నౌకలపై ఇంగ్లిష్‌ చానల్‌ మీదుగా లండన్‌లోని లివర్‌పూల్‌ స్ట్రీట్‌ చేరుకున్నాయి. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ‘దత్తత తల్లిదండ్రులు’ జాబితాలో ఉన్న ప్రకారం ఎవరి పిల్లల్ని వారు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. చివరి బృందం 1939 ఆగస్టు 2న రైల్లో లండన్‌ చేరుకుంది. అక్కడితో పునరావాసం దొరికిన పిల్లల సంఖ్య 669కి చేరుకుంది. పిల్లల్ని బ్రిటన్‌ పంపేముందు వారిని గుండెకు హత్తుకుంటున్న తల్లిదండ్రులు, అమ్మానాన్నల్ని వదల్లేక వెళుతున్న పిల్లల కన్నీళ్లు చూసి వింటన్‌ సంస్థ సభ్యులు కదిలిపోయారు.

చివరి ట్రైన్‌ మాయం!
నిజానికి 1939 సెప్టెంబర్‌ 1న ఇంకో బృందం బయలుదేరవలసి ఉంది. కానీ అదే రోజు హిట్లర్‌ పోలండ్‌ను ఆక్రమించడంతో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. దేశాల సరిహద్దులన్నిటినీ జర్మనీ తన అధీనంలోకి తీసుకుంది. ఎటూ వెళ్లే దారి లేదు. దాంతో వింటన్‌ ప్రయత్నాలూ ఆగిపోయాయి. కొన్ని గంటల్లోనే పిల్లలు ఉన్న ట్రైన్‌ మాయం అయింది. అందులోని 250 మంది పిల్లల్ని ఎవరు అదుపులోకి తీసుకున్నారో తెలీదు! వీళ్ల కోసం లివర్‌పూల్‌ స్టేషన్‌లో ఎదురు చూస్తున్న 250 కుటుంబాల ప్రాణాలు ఉసూరుమన్నాయి. అదృష్టం ఆఖరి నిముషంలో ముఖం తిప్పుకున్న ఆనాటి ఘటన వింటన్‌ను చాలా ఏళ్లు వెంటాడింది.

దట్‌ ఈజ్‌ లైఫ్‌
వింటన్‌ భార్య గ్రెటే ఇల్లు సర్దిస్తున్నప్పుడు అటకపై ఆ పుస్తకం బయట పడకపోయి ఉంటే బహుశా ఎప్పటికీ వింటన్‌లోని గొప్ప మానవీయత గురించి ప్రపంచానికి తెలిసి ఉండేది కాదు. ఆ పుస్తకంలో గుప్తంగా ఉండిపోయి అత్యద్భుతమైన విషయాలను గ్రెటే స్నేహితురాలి భర్త తన దిన పత్రికలో ఆర్టికల్స్‌గా ప్రచురించాడు. అవి చదివి బి.బి.సి. టెలివిజన్‌ యాంకర్‌ ఎస్తేర్‌ రాంట్‌జెన్‌ ‘దట్‌ ఈజ్‌ లైఫ్‌’ అనే ప్రోగ్రామ్‌ చేశారు. ఆ ప్రోగ్రామ్‌కే సర్‌ నికోలస్‌ వింటర్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి, ఆయనకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు! ఒక్కొక్కళ్లు ఆయన దగ్గరకు రావడం, మీరు కాపాడిన మనిషినే నేను అని చెప్పి, ధన్యవాదాలు సమర్పించడం.. టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని పులకింపజేసింది.

మానవత్వపు పరిమళాలు
మారణ హోమాలను ప్రపంచం ఎప్పటికైనా మర్చిపోతుంది. మానవత్వపు పరిమళాలు మాత్రం ప్రపంచం ఉన్నంత కాలం వీస్తూనే ఉంటాయి. వింటన్‌ కాపాడిన పిల్లల్లో ఒకరు ఆయనకు ఒక ఉంగరం కానుకగా ఇచ్చారు. ఆయన చనిపోయే వరకు ఆ ఉంగరం ఆయనతోనే ఉంది. యూదుల ధర్మశాస్త్రం ‘తాల్మండ్‌’లో ఒక అద్భుత వాక్యం ఉంటుంది. ఒక జీవితాన్ని కాపాడితే, ఒక ప్రపంచాన్ని కాపాడినట్లే అని. వింటన్‌కి కానుకగా వచ్చిన ఉంగరంపై ఆ వాక్యం చెక్కి ఉంటుంది. ఆ విధంగా చూస్తే వింటన్‌ కాపాడిన ప్రపంచాలు తక్కువేం కాదు.
 
వింటన్స్‌ చిల్డ్రన్‌: సర్‌ నికోలాస్‌ వింటన్‌ కాపాడిన పిల్లలు వింటన్స్‌ చిల్డ్రన్‌గా గుర్తింపు పొందారు. వాళ్లలో కొందరు ప్రముఖులు : కరేల్‌ రీయిజ్‌ : బ్రిటిష్‌ చలన చిత్ర దర్శకుడు; జో షెల్సింజర్‌ : కెనడా జర్నలిస్టు; లార్డ్‌ ఆల్ఫ్రెడ్‌ డబ్స్‌ : బ్లెయిర్‌ క్యాబినెట్‌లో మాజీ మంత్రి; డగ్‌మర్‌ సిమోవా : యు.ఎస్‌.విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి; టామ్‌ ష్రెకర్‌ : రీడర్స్‌ డైజస్ట్‌ మేనేజర్‌; హ్యూగో మారమ్‌ : ప్రసిద్ధ ఏవియేషన్‌ కన్సల్టెంట్, ఇజ్రాయెల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు; వెరా జిస్సింగ్‌ : పెరల్స్‌ ఆఫ్‌ చైల్డ్‌హుడ్‌
మెయిడెన్‌ హెడ్‌ రైల్వే స్టేషన్‌లోనే మరోవైపు చిన్నారులతో వింటన్‌ విగ్రహం. (కింద నివాళి గుచ్ఛాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement