కొ...క్కొ...రొ...క్కో....
హేయ్ ఎక్కడుంది.. ఎక్కడుంది.. నా కోడి, ఏ తట్ట కింద నక్కినాది? అరే, ఎక్కడుంది.. ఎక్కడుంది.. నా కోడి, నా చేత చిక్కి తీరుతాది! ఈ చరణం వింటే పల్లవి పదాలు గుర్తు లేకపోయినా.. ట్యూన్ తలుచుకుంటూ.. కూని రాగాలతో ఊగిపోతాం. ఈ పాటతో కోడిని పెంచి, పోషించే వారికి మల్లే.. మనకు కూడా, తొడకొట్టే కోడేదో? తలదించే కోడేదో అంతలా అర్థమయిపోయింది. మరి, నిత్యం కాళ్లావేళ్లాపడుతూ.. పొద్దుపొద్దున్నే పలకరించే కోడమ్మ కథకు చరిత్రలో కొన్ని పేజీలు ఉన్నాయి.
వాటి గురించి మీకు తెలుసా?బలగం పెద్దదే!: 2003లో జరిపిన అధ్యయనంలో ప్రపంచ వ్యాప్తంగా 2400 కోట్ల కోళ్లు ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం మన జనాభాతో పోల్చుకుంటే కోళ్ల సంఖ్య మూడు రెట్లు పైమాటే. ఇక పక్షి జాతిలో అత్యధిక సంఖ్యలో ఉన్న పక్షిగా కోడి రికార్డు సృష్టించింది.చైనా కోక్కొరోకో..: అత్యధిక జనాభా కలిగిన చైనాలో 300 కోట్ల కోళ్లు ఉన్నాయి. ఇక అమెరికాలో 45 కోట్లు జీవిస్తున్నాయన్నది ఓ సర్వే. ప్రపంచంలోనే అత్యధికంగా పెంచుకుంటున్న పెంపుడు పక్షుల్లో కోడి మొదటిది.
ఎగరలేని పక్షి: నక్కినక్కి వచ్చే కుక్కో, పిల్లో మీదకి దూకినప్పుడు.. గద్దో, కాకో దాడి చేసినప్పుడే కోళ్లు కాస్త ఎగిరినట్లు కనిపిస్తాయి. నిజానికి కోళ్లకు సరిగా ఎగరటం రాదు. మహా అయితే ఓ మోస్తరు గోడను దాటడం, ఇంటిపై కప్పు ఎక్కడం చూస్తుంటాం. అది కూడా ఎక్కిన అరగంటకు కానీ దిగలేక, దూకలేక, ఎగరాలా, వద్దా అంటూ అటు, ఇటూ బెదురు చూపులు చూస్తుంటాయి కోళ్లు. ఎక్కువలో ఎక్కువ ఇవి ఎంతసేపు గాల్లో ఉండగలవంటే సరిగ్గా 13 సెకన్లు మాత్రమేనని ఓ అంచనా.
రంగు గుడ్లు: కొన్ని కోళ్లు.. తెలుపు, బ్రౌన్ కలర్ గుడ్లనే కాకుండా, రంగురంగుల గుడ్లను కూడా పెడుతుంటాయి. అలా పెట్టిన నీలం, పచ్చ గుడ్లనే.. రెడీమేడ్ ఈస్టర్ ఎగ్స్ అని పిలుస్తారు.‘పవర్’ కోడి: అదిరిస్తే అదురుతాది, బెదిరిస్తే బెదురుతాది. కాస్త లొట్టలేస్తే కూరై కూర్చుంటుంది. ఈ మాత్రానికే, కోడికి ఇంత బిల్డప్పా అనిపిస్తుంది కదూ? కానీ ఈ మాటలు కోడిగానీ వింటే, ‘‘కోడే కదా అని తీసి పారేస్తే రెట్ట వేయడం మానేస్తా’’ అంటూ సినిమా డైలాగ్‌ని ఓన్ చేసుకుంటుందేమో! ఎందుకంటే.. కోడి విసర్జనతో పవర్ కూడా తయారు చేసుకోవచ్చు. ఒక కోడి జీవిత కాలంలో.. ఒక 100 వాల్ట్‌ల బల్బ్‌ను 5 గంటల పాటు వెలిగించగలదట. మరి ఓ సలాం చేసుకోండి కోడమ్మకి. స్త్రీ–కోడి: కోడి జాతిలో పెట్టలదే రాజ్యమట.
వీటిల్లో భ్రూణ హత్యలు లేని కారణంగా పుంజుల సంఖ్య కంటే పెట్టలదే హవా నడుస్తో్తంది. ప్రపంచ వ్యాప్తంగా 1:6 నిష్పత్తిలో పుంజు–పెట్ట ఉన్నాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి.పుంజు పాట్లు పుంజువి: మనుషుల్లానే కోళ్లకు సంభాషణ తీరుంటుంది. అవి కొన్ని సంకేతాలు, సందేశాలు ఇచ్చిపుచ్చుకుంటాయి. అయితే, పుంజులు, పెట్టలను ఆకట్టుకోవడానికి నానా తంటాలు పడుతుంటాయి. రకరకాల శబ్దాలతో, వింత చేష్టలతో పెట్టలకు సైట్ కొట్టి పడగొడుతుంటాయి.
కొండ గుర్తు కాదు కోడి గుర్తు: కోళ్లు మనల్ని గుర్తుపడతాయి. వీటికి కలర్ బ్లైండ్ నెస్ ఉండదు. అన్ని కలర్స్‌ను ఇట్టే గుర్తించగలవు. ఏనుగులానే కోడికి కూడా జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక కోడి సుమారు 100 ముఖాలను గుర్తు పెట్టుకోగలదు. అలాగే తమ బాస్ ఎవరో..? తమ పరిధులు ఏమిటో..? అన్ని గుర్తెరిగి మసలుకుంటాయి కోళ్లు. కోడా.. మజాకా?: కోడిని బ్లేమ్ చేయడం చాలా కష్టం. ఇవి మనుషులను, కుక్కలను, పిల్లులను, ఇతర జంతువులను చీకట్లో కూడా గుర్తుపట్టగలవు. శత్రువు పన్నాగాన్ని ముందుగానే గుర్తించి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి.
కోడి మామా..!: సమాజంలో పెంపుడు పక్షిగా ఎదిగిన కోడి, సినిమాల్లోనూ చాలా సార్లు తళుకుమంది. ఇక కోడిపై పాట అనగానే మెగా‘ధీరులను గుర్తు చేస్తుంది. బంగారు కోడిపెట్ట సాంగ్‌తో చిరు, చరణ్‌లు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సన్నివేశాలు మన కళ్లముందు కదలాడతాయి. సంకురాత్రి కోడి పెట్ట అంటూ ‘యువ’ సినిమాలో మీరా జాస్మిన్ హŸయలు బాగా యాదికొస్తాయి. ఇక ‘‘పట్టు పక్కింటి కోడి పెట్టని’’ అంటూ ‘డాడీ’ సినిమాలో.. ‘‘కోడి కూర చిల్లుగారి’’ అంటూ ‘అందరివాడు’ సినిమాలో.. ‘‘కొ..కొ.. కోడి బాగుంది.
కు..కు..కూత బాగుంది’’ అంటూ ‘జై చిరంజీవ’ సినిమాలో చిరు స్టెప్‌లు వేశారు. ఇక పాత సినిమాల్లో కోడి పాటలకు కొదవేలేదు.మొత్తానికీ కోడి చరిత్రను ఓసారి అలా.. అలా.. తిరగేశాం. బహుశా! మీరు చదువుతున్నప్పుడు మీ ఇంట్లో కోడిగానీ విందేమో? చూసుకోండి. ‘వింటే ఏమవుతుంది..? మనతో పోట్లాటకొస్తే.. (బాగా బలిసిన కోడి చికెన్ సెంటర్ కొచ్చి తొడ కొట్టినట్లే) అంటారా?’ అయితే అలాగే, కానివ్వండి.
– సంహిత నిమ్మన